Klin Kaara's Temple Tree Nursery: మెగా వారసురాలి కోసం టెంపుల్ ట్రీ నర్సరీ, చెర్రీ-ఉపాసనల వ్యక్తిత్వాలను ప్రతిబింబించేలా డిజైన్!
మెగా కపుల్ రామ్ చరణ్, ఉపాసన తమ కుమార్తె క్లిన్ కారా కోసం టెంపుల్ ట్రీ నర్సరీని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు గత నెలలో ఓ పాపకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మెగా మనవరాలికి ‘క్లిన్ కారా కొణిదెల’ అని నామకరణం చేసినట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వారసురాలు వచ్చినప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో సంతోషం రెట్టింపైంది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న ఉపాసన.. తన గారాలపట్టికి సంబంధించిన ప్రతీ విషయాన్ని మెమరబుల్ గా మార్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బేబీ క్లిన్ కారా కోసం ఇంట్లో సరికొత్త టెంపుల్ ట్రీ నర్సరీని డిజైన్ చేయించారు.
రామ్ చరణ్ - ఉపాసనల నర్సరీకి సంబంధించిన విశేషాలను గురువారం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఉపాసన గ్రే అండ్ వైట్ బర్నింగ్ సూట్ మాదిరిగానే, క్లిన్ కారా నర్సరీ కూడా ఇదే కలర్ థీమ్ తో డిజైన్ చేయబడింది. ఎక్కువ కలర్ ఫుల్ గా లేకుండా జంతువులు, చెట్లతో ప్రకృతిని ప్రతిబింబించేకా వుంది. ఇందులో జింకలు, ఏనుగుల దగ్గర నుంచి చెట్లు, పువ్వుల వరకు పొందుపరిచబడి వున్నాయి. నర్సరీలో తెల్లటి సోఫాలు, కర్టెన్‌లు, కార్పెట్‌లు ఉన్నాయి. ఇది అన్ని విధాలుగా ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది.
టెంపుల్ ట్రీ నర్సరీలో ఉపాసన - రామ్ చరణ్ లు సేకరించిన బొమ్మలు.. అడవులు వన్యప్రాణుల పట్ల వారి ప్రేమను తెలియజేసే వాల్ పేపర్లు ఉన్నాయి. AD100 ఆర్కిటెక్ట్ పవిత్రా రాజారామ్ దీన్ని డిజైన్ చేశారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. ఈ గదిలో తనకు చెర్రీకి ఇష్టమైన వస్తువులను పొందుపరిచామని తెలిపారు. ఇందులో గొర్రెలు, పెంగ్విన్, కుందేలు, ఏనుగు వంటి అనేక బొమ్మలు ఉన్నాయని.. ఈ వాల్ పేపర్స్ తనతో పాటు తన భర్త వ్యక్తిత్వాలను ప్రతిబింబిస్తుందని ఉపాసన అన్నారు.
View this post on Instagram
ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియాతో ఉపాసన మాట్లాడుతూ.. “మేమిద్దరం వన్యప్రాణులను ప్రేమిస్తాం. భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్‌లలో ఒకటైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌తో నా ఫౌండేషన్ పనిచేస్తుంది. కాబట్టి, కస్టమ్ ప్రింట్‌లో ఈ ప్రాంతం నుంచి జంతువులు ఉన్నాయి. మేం ఏనుగుల పట్ల గాఢమైన ప్రేమను కలిగి ఉన్నాం. అవి వాల్ ప్రింట్‌లో ఉల్లాసాన్ని అందిస్తున్నాయి. వృక్షాలు, పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. అలాగే దేవతల ఆశీర్వాదాలను సూచిస్తూ మల్లెపూలను కురిపించడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ బ్యూటీఫుల్ నేచురల్ వరల్డ్ ని మా బేబీ చూడాలని మేం కోరుకుంటున్నాం” అని తెలిపారు.
‘క్లిన్ కారా’ అనే పేరుని లలితా సహస్ర నామం నుండి పెట్టినట్టు చిరంజీవి తెలిపారు. ‘క్లిన్ కారా’ ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుందని, చాలా శక్తిగలదని అర్ధం వస్తుందని పేర్కొన్నారు. ఇప్పుడు టెంపుల్ ట్రీ నర్సరీని ప్రకృతిని ప్రతిబింబించేలా, బేబీ చుట్టూ నేచర్ ప్రవహించే ఆలోచనతో డిజైన్ చేయించారని తెలుస్తోంది. దీని కోసం ఉపాసన తెలుపు, బూడిద, గులాబీ, గోధుమ రంగుల ప్యాలెట్ ను ఎంచుకున్నారని ఆర్కిటెక్ట్ పవిత్ర రాజారామ్ తెలిపారు.
"పవర్ కపుల్ రామ్ చరణ్ - ఉపాసన కామినేని కొణిదెల ఎల్లప్పుడూ వారి సున్నితమైన మనసులకు, సామాజిక స్పృహకు ప్రసిద్ధి చెందారు. ఉపాసన అమ్మగారి ఇంటి వద్ద ఉన్న టెంపుల్ ట్రీ నర్సరీకి, అపోలో హాస్పిటల్ వింగ్‌లోని బర్నింగ్ సూట్ రూపకల్పనకు పెద్దగా తేడా లేదు. బౌద్ధ వాస్తుశిల్పం యొక్క ముఖ్య సిద్ధాంతాలలో ఒకటైన శూన్యంలో సంపూర్ణత్వం అనే ఆలోచనలో ఇవి రూపొందాయి. ప్రశాంతత, అపరిమితమైన సంతోషం తీసుకురావాలనేదే మా టీం ఫిలాసఫీ" అని ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియా పేర్కొంది.
కాగా, రామ్ చరణ్ ఉపాసనలు 2012 జూన్ 14న ప్రేమ వివాహం చేసుకున్నారు. పదేళ్ల తర్వాత 2022 డిసెంబర్ లో మెగా కోడలు గర్భం దాల్చినట్లు ప్రకటించారు. 2023 జూన్ 20న వారు తమ ఫ్యామిలీలోకి మొదటి బిడ్డకు స్వాగతం పలికి, తల్లిదండ్రులుగా మారారు. వీరు తమ కుమార్తె క్లిన్ కారాతో ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తమ బేబీకి ఆశీర్వాదాలు అందజేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: తమిళ దర్శకుడితో నాని సినిమా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial