Skanda: విడుదలకు ముందే ‘పుష్ప 2’ రికార్డులు, తానూ తగ్గేదేలే అంటున్న‘స్కంద’
‘పుష్ప 2’ మూవీ 2024లో ఆగస్ట్ 15న విడుదల అవుతుందని ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో బయటపెట్టింది టీమ్.
ఇటీవల టాలీవుడ్‌లో సినిమాల మధ్య పోటీ ఎక్కువయిపోతోంది. స్టార్ హీరో సినిమా అయినా, యంగ్ హీరో సినిమా అయినా.. చాలావరకు ప్రేక్షకులు అన్నింటిని సమానంగా ఆదరిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్స్, ట్రైలర్స్ చూసి సినిమాలో కంటెంట్ ఉంది అనిపిస్తే చాలు.. అది థియేటర్లలో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అలా వారు చూపిస్తున్న క్రేజ్‌ను బట్టి సినిమాలు విడుదల అవ్వకముందే కొన్ని రికార్డులు బద్దలుకొడుతున్నాయి. తాజాగా ‘పుష్ప 2’ అలాంటి ఒక రికార్డ్‌నే బద్దలుకొట్టింది. ఆ తర్వాత ‘స్కంద’ చిత్రం కూడా ‘పుష్ప 2’ పక్కన వచ్చి నిలబడింది. అసలు ఈ రెండు సినిమాలు సాధించిన రికార్డ్ ఏంటంటే..
‘పుష్ప 2’ రికార్డులు..
దేశమంతటా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నా సినిమా ‘పుష్ప 2’. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో చాలా ఏళ్ల క్రితం ‘ఆర్య’, ‘ఆర్య 2’ లాంటి ప్రేమకథలు వచ్చాయి. కానీ వాటికి పూర్తి భిన్నంగా ఒక మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘పుష్ప’.. 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదలయిన మొదటిరోజు మిక్స్‌డ్ టాక్ అందుకున్నా కూడా మెల్లగా ‘పుష్ప’.. ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ముఖ్యంగా ఈ మూవీలో ‘తగ్గేదే లే’ అనే అల్లు అర్జున్ మ్యానరిజంకు ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా ఫిదా అయిపోయారు. అందుకే ‘పుష్ప 2’కు క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోయింది. ఈ సీక్వెల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం ఇప్పటివరకు మూవీ టీమ్ పెద్దగా అప్డేట్ ఇవ్వలేదు. అందుకే తాజాగా ‘పుష్ప 2’ రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు.
పాన్ ఇండియా హీరోలకు పోటీగా..
‘పుష్ప 2’ మూవీ 2024లో ఆగస్ట్ 15న విడుదల అవుతుందని ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో బయటపెట్టింది టీమ్. ఈ పోస్టర్‌కు అతి తక్కువ సమయంలోనే బుక్ మై షోలో 100 వేల ఇంట్రెస్ట్స్ వచ్చాయి. అంటే లైక్స్ వచ్చాయి. ఇంతకు ముందు ప్రభాస్ నటించిన ‘సలార్’కు కూడా ఇదే విధంగా లైక్స్ వచ్చాయి. అయితే ‘పుష్ప 2’కు పోటీగా రామ్ పోతినేని నటించిన ‘స్కంద’కు కూడా ఇదే రేంజ్‌లో బుక్ మై షోలో లైక్స్ రావడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది. ‘పుష్ప 2’, ‘సలార్’లాంటి చిత్రాలను పాన్ ఇండియా హీరోలు చేస్తున్నారు కాబట్టి ఆ రేంజ్‌లో లైక్స్ రావడం సహజమని, కానీ బోయపాటి తెరకెక్కించిన ‘స్కంద’కు కూడా ఆ రేంజ్‌లో లైక్స్ వచ్చాయంటే.. మూవీ కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డ్ సృష్టించే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు అనుకుంటున్నారు.
విడుదల పోస్ట్‌పోన్..
బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమే ‘స్కంద’. ఈ మూవీలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన సాంగ్స్.. చాలామంది ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి. అంతే కాకుండా ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని అర్థమవుతోంది. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘స్కంద’ ముందుగా సెప్టెంబర్ 15న విడుదల అవుతుందంటూ ప్రకటించింది మూవీ టీమ్. కానీ ఆ తేదీని సెప్టెంబర్ 28కు పోస్ట్‌పోన్ చేశారు. ఇక ఇప్పటికే బుక్ మై షోలో 100 వేలకు పైగా లైక్స్ పొందడంతో ‘స్కంద’కు మంచి ఓపెనింగ్స్ వస్తాయని మూవీ టీమ్ ఆశపడుతోంది.
Also Read: వైరస్‌తో ఇండియా యుద్ధం - ‘ది వ్యాక్సిన్ వార్’ ట్రైలర్ చూశారా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial