Sivalenka Krishna Prasad: నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం..!
Sivalenka Krishna Prasad: ‘ఆదిత్య 369’ వంటి సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌తో నిర్మాతగా తన ప్యాషన్‌ని తెలియజేసిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘సారంగపాణి జాతకం’ విడుదలకు సిద్ధమైంది.

Producer Sivalenka Krishna Prasad Interview: ‘ఆదిత్య 369’ వంటి కళాఖండాన్ని నిర్మించిన సంస్థ శ్రీదేవి మూవీస్. ఈ బ్యానర్‌లో చేసిన సినిమాలు తక్కువే అయినా, గుర్తిండిపోయే సినిమాలు రూపుదిద్దుకున్నాయి. అభిరుచి గల నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ బ్యానర్‌లో ఎంతో ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించారు. ఇప్పుడాయన సెన్సిబుల్ దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూపా కొడువయూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 25న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మీడియాకు ఈ చిత్ర విశేషాలను తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
‘సారంగపాణి జాతకం’ చిత్ర మా బ్యానర్‌లో వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం. ఇందులో అన్ని రకాల అంశాలు ఉంటాయి. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, లవ్ ఇలా అన్ని రకాల అంశాలతో ఇంద్రగంటి రూపొందించారు. ఆయన ఈ కథను చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. థియేటర్లో అందరూ హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆ లోటు ఈ చిత్రంతో తీరిపోయింది. జంధ్యాలతో ఇలాంటి ఓ పూర్తి వినోదాత్మక సినిమా చేయలేదే? అనే లోటు ఇప్పుడు తీరిపోయింది. కొన్ని సినిమాలు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. అలా ఈ ‘సారంగపాణి జాతకం’ కూడా చాలా కాలం పాటు గుర్తుండే చిత్రమవుతుందని నమ్ముతున్నాను.
Also Read: సినిమాల్లోకి రంభ రీఎంట్రీ! - ఇండస్ట్రీకి దూరం కావడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘జెంటిల్ మ్యాన్, సమ్మోహనం’ తర్వాత మా కాంబోలో వస్తున్న సినిమా ఇది. కచ్చితంగా హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుంది. మోహనకృష్ణ రాసిన కథ, కథనం అందరినీ ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో పాటు యూత్ ఆడియెన్స్ అందరినీ మెప్పిస్తుంది. ఇప్పటికి కొన్ని సార్లు సినిమాను వాయిదా వేయడానికి కారణం, సరైన థియేటర్లు దొరకాలనే ఉద్దేశ్యంతోనే. అందుకే కాస్త లేటుగా వస్తున్నాం. మంచి సీజన్ దొరకాలనే ఇప్పటి వరకు ఆగాం. సమ్మర్ హాలీడేస్ స్టార్ట్ అయ్యాయి. ఇంతకంటే మంచి సీజన్ ఏముంటుంది. అందుకే ఏప్రిల్ 25న వస్తున్నాం. సమ్మర్‌లో ప్రతి ఒక్కరికీ వినోదాన్ని పంచేందుకు ‘సారంగపాణి’ వస్తున్నాడు.
ఈ సినిమాను ఇప్పటి వరకు చాలా మందికి చూపించాం. అందరూ అద్భుతంగా ఉందని అన్నారు. ఫస్టాఫ్ పూర్తిగా వినోదాత్మకంగా సాగుతుంది. ద్వితీయార్ధం నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. జాతకం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా, సస్పెన్స్‌గా ఉంటుంది. అలా అని మరీ అంత అన్ ప్రిడిక్టబుల్‌గా ఏమీ ఉండదు. అందరినీ హాయిగా ఎంటర్‌టైన్ చేసేలా మాత్రం ఉంటుంది. కథలో భాగంగానే అన్ని పాత్రలు కుదిరాయి. ఏదో కావాలని ఇరికించినట్టుగా ఎక్కడా అనిపించదు. ప్రతీ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్ గారు, అవసరాల శ్రీనివాస్ ఇలా అన్ని పాత్రలు అద్భుతంగా నవ్విస్తాయి.
ఈ కథ వింటున్నప్పుడే ప్రియదర్శి అయితే బాగుంటుందని మేం అనుకున్నాం. ఇప్పుడు ‘కోర్ట్’ మూవీ వచ్చి ప్రియదర్శికి మరింత ఇమేజ్ పెరిగింది. ఈ చిత్రంలో అందరినీ హాయిగా నవ్విస్తారు. ఇంద్రగంటి మార్క్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలుసు. ఆయన కామెడీ టైమింగ్ ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. పైసా వసూల్ సినిమా అవుతుందని అనుకుంటున్నాను. ఓవర్సీస్‌లో 220 థియేటర్లకు పైగానే ఈ సినిమా విడుదలవుతుంది.
ఒకప్పుడు మూడు నెలల్లో సినిమా పూర్తయ్యేది. ఒక హీరోతో చేసిన పూర్తయిన తర్వాత ఇంకో హీరోతో సినిమాను చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగైదు ప్రాజెక్టులని లైన్‌లో పెడుతున్నారు. కాంబినేషన్స్ చుట్టూ తిరుగుతూ కథల గురించి పట్టించుకోవడం లేదు. నాకు సినిమాల పట్ల ఎక్కువ ప్యాషన్ ఉంటుంది. అందుకే నేను తీసిన ఆదిత్య 369, జెంటిల్‌మెన్, సమ్మోహనం, యశోద ఇలా ఏవైనా సరే, నా మార్క్ కనిపించాలని కోరుకుంటాను. ‘సారంగపాణి జాతకం’ గురించి కూడా అంతే గొప్పగా మాట్లాడుకుంటారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మలిచాం. జంధ్యాల కామెడీ, ఈవీవీ స్టైల్, ఇంద్రగంటి మార్క్ ఇలా అన్నీ ఉండేలా, అందరికీ రీచ్ అయ్యేలా సినిమాను రూపొందించాం.
Also Read: 'రామాయణ' షూటింగ్‌కు యశ్! - ఉజ్జయినీ మహాకాళేశ్వర్‌ను దర్శించిన కేజీఎఫ్ స్టార్
ప్రస్తుతం కొన్ని కథలపై చర్చలు నడుస్తున్నాయి. నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం. అందుకే నేను వాటికి దూరంగా ఉంటాను. కానీ బాలకృష్ణ ‘ఆదిత్య 369’ సీక్వెల్ పనులు స్టార్ట్ చేస్తే మాత్రం అందులో భాగమవుతాను. ‘యశోద’ డైరెక్టర్లు చెప్పిన రెండు కథలు నాకు నచ్చాయి. అలాగే పవన్ సాధినేని చెప్పిన ఓ కథ కూడా చాలా ఆసక్తిగా అనిపించింది. మళ్లీ మోహనకృష్ణ ఇంద్రగంటితో ఇంకో సినిమా చేయబోతున్నాను. అన్నీ ఫైనల్ అయ్యాక అధికారికంగా ప్రకటిస్తాను’’ అని చెప్పుకొచ్చారు.





















