Meera Chopra Wedding Card: 'బంగారం' హీరోయిన్ వెడ్డింగ్ కార్డ్ వైరల్ - కాబోయే వరుడు ఎవరంటే?
Meera Chopra Marriage: 'బంగారం' హీరోయిన్ మీరా చోప్రా పెళ్ళి పీటలెక్కబోతోంది. గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న ప్రియుడిని వివాహం చేసుకోబోతోంది. వీరి వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
Meera Chopra Wedding Card: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో మూడు పదుల వయుస్సు దాటిన ముద్దుగుమ్మలంతా ఒక్కరొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు పెళ్లి చేసుకొని వివాహ బంధంలో అడుగుపెట్టగా, ఇప్పుడు బాలీవుడ్ నటి మీరా చోప్రా కూడా పెళ్లికి రెడీ అయింది. అగ్ర కథానాయికలు ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రాల కజిన్ అయిన మీరా.. 40 ఏళ్ళ వయసులో తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రేమించిన వ్యక్తితో ఈ నెలలోనే ఆమె వివాహం జరగనుంది. ప్రస్తుతం చోప్రా గర్ల్ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మీరా చోప్రా గత కొన్నేళ్లుగా ఓ బిజినెస్ మ్యాన్ తో సీక్రెట్ డేటింగ్ చేస్తోంది. కానీ ప్రేమాయణం విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. అతడికి సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేకపోవడంతో, వివరాలేమీ పెద్దగా బయటకు పొక్కలేదు. అయితే దాదాపు ఆరేళ్ల సహవాసం తర్వాత, మీరా అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని.. జైపూర్ ప్యాలెస్ లో మార్చి నెలలోనే ఆమె డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లి పత్రిక నెట్టింట చక్కర్లు కొట్టడంతో, మీరాకి కాబోయే వరుడి వివరాలతో పాటుగా పెళ్లి విశేషాలు బయటకొచ్చాయి.
ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ ప్రకారం, మీరా చోప్రా పెళ్లాడబోతున్న వ్యక్తి పేరు రక్షిత్ కేజ్రీవాల్. ఇంతకు ముంబైకి చెందిన వ్యాపారవేత్త. మార్చి 11-12 తేదీల్లో హిందూ సంప్రదాయం ప్రకారం రెండు రోజుల పెళ్లి వేడుక జరగనుంది. జైపూర్‌లోని బ్యూనా విస్తా లగ్జరీ గార్డెన్ స్పా రిసార్ట్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈనెల 11వ తేదీన మెహందీ ఫంక్షన్ తో మీరా చోప్రా పెళ్లి సంబరాలు ప్రారంభం అవుతాయి. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులందరికీ సంగీత్ & కాక్టెయిల్ పార్టీ నిర్వహించబడుతుంది.
Also Read: తల్లి మీద ప్రేమతో మరోసారి పేరు మార్చుకున్న మెగా హీరో!
మార్చి 12వ తేదీన ఉదయం 10 గంటలకు హల్దీ ఫంక్షన్ తో మీరా చోప్రా పెళ్లి తంతు మొదలవుతుంది. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు మీరా చోప్రా, రక్షిత్ వైవాహిక బంధంలోకి అడుగుపెడతారు. అదే రోజు రాత్రి 9 గంటల నుంచి విందు, రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా 2 రోజుల పాటు చాలా గ్రాండ్ గా పెళ్లి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు శ్రేయోభిలాషులు ఈ వివాహానికి హాజరవుతారని అంటున్నారు. కజిన్ పెళ్లికి ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రా కూడా హాజరుకానున్నారు.
View this post on Instagram
మీరా చోప్రా 2005లో 'అన్‌బే ఆరుయిరే' అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసింది. కోలీవుడ్ లో నీలా అనే ఆన్ స్క్రీన్ నేమ్ తో పరిచయమైన ఈ బ్యూటీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'బంగారం' చిత్రంలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎంఎస్ రాజు తెరకెక్కించిన 'వాన' సినిమాతో అలరించింది. నితిన్ తో కలిసి 'మారో' మూవీ చేసింది. తెలుగులో చివరగా 2013లో కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'గ్రీకు వీరుడు' చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. ఆమె నటించిన 'సఫేద్' మూవీ గతేడాది జీ5 ఓటీటీ వేదికగా రిలీజ్ అయింది.
Also Read: ప్రేమపై కామం గెలుస్తుందా? - ట్రైలరే ఇంత బోల్డ్ గా ఉంటే మూవీ ఎలా ఉంటోందో!