Ashwin Comments: భారత టీమ్ మేనేజ్మెంట్ పై అశ్విన్ ఫైర్... ఆ విషయంలో ఫెయిర్ గా లేదని వ్యాఖ్య
ఆస్ట్రేలియా టూర్లో టెస్టుల్లో ఆకాశ్ దీప్ సింగ్ చక్కగా బౌలింగ్ చేసినా, వికెట్లేమీ రాలేదు. అయితే వికెట్లు రానందున మళ్లీ మరో మ్యాచ్ అతనికి దక్కే అవకాశాలు తక్కువని వ్యాఖ్యానించాడు.

Team India News: బౌలర్లను బ్యాక్ చేసే విషయంలో భారత టీమ్ మేనేజ్మెంట్ పై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. ఒక సిరీస్ లో వికెట్లు తీయలేకపోతే అతడిని మరో మ్యాచ్ కు ఎంపికయ్యే అవకాశముండదని పేర్కొన్నాడు. తాజాగా ఆస్ట్రేలియా టూర్లో టెస్టుల్లో ఆకాశ్ దీప్ సింగ్ చక్కగా బౌలింగ్ చేసినా, వికెట్లేమీ రాలేదు. అయితే వికెట్లు రానందున మళ్లీ మరో మ్యాచ్ అతనికి దక్కే అవకాశాలు తక్కువని వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో ఆస్ట్రేలియా వ్యవహార శైలి చాలా ఉన్నతంగా ఉంటుందని, వాళ్లు బౌలర్లను బాగా చూసుకుంటారని పేర్కొన్నాడు. బౌలర్లను బ్యాక్ చేసే విధానం బాగుంటుందని, అందుకే టెస్టుల్లో వాళ్ల ఆధిపత్యం కొనసాగుతోందని వ్యాఖ్యానించాడు. మన టీమ్ మేనేజ్మెంట్ ఆలోచన ధోరణి కూడా మారాల్సి ఉంటుందని అశ్విన్ పరోక్షంగా తెలిపాడు. అప్పుడే అన్ని ఫార్మాట్లలో టీమిండియా ఆధిపత్యం ప్రారంభం అవుతుందని తెలిపాడు.
ఆసీస్ టూర్లో మ్యూజికల్ చైయిర్..
కీలకమైన ఆసీస్ టూర్లో భారత టీమ్ మేనేజ్మెంట్ బౌలర్ల విషయంలో మ్యూజికల్ చెయిర్ ఆట ఆడింది. ఒక్కో టెస్టుకు ఒక్కో బౌలర్ ను తీసుకుని కంగాళీ చేసింది. తొలి టెస్టులో వాషింగ్టన్ సుందర్, రెండో టెస్టులో అశ్విన్, మూడో టెస్టులో రవీంద్ర జడేజాను ఆడించారు. అయితే తనను పక్కన పెట్టడంతో మూడో టెస్టు ముగిశాక అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో బౌలర్ల పట్ల టీమ్ మేనేజ్మెంట్ స్పందన సరిగ్గా ఉండదని తేలుస్తోంది. ఎన్ని మ్యాచ్ ల్లో విఫలమైనా, సరిగ్గా పరుగులు సాధించకున్నా కూడా కొంతమంది బ్యాటర్లకు అవకాశాలు లభిస్తాయని, అద బౌలర్ల విషయంలో మాత్రం అలా ఉండదని పేర్కొన్నాడు. బౌలర్లకు తగిన ప్రాధాన్యత ఇచ్చి, వారిని బ్యాక్ చేసినప్పుడే భారత డామినేషన్ ప్రారంభమవుతుందని అశ్విన్ పేర్కొన్నాడు.
దిగ్గజ బౌలర్ కానీ..
భారత టెస్టులకు సంబంధించి అశ్విన్ ను దిగ్గజ బౌలర్ గా భావిస్తారు. అయితే విదేశాల్లో మాత్రం అతనికి అంతగా చాన్సులు రాలేదనే చెప్పుకోవచ్చు. జట్టులో ఒక స్పిన్నర్ కు చోటు ఉన్న క్రమంలో తను చాలాసార్లు రిజర్వ్ కే పరిమితమయ్యాడు. టెస్టుల్లో ఈ జనరేషన్లో గోట్‌గా తను ఖ్యాతి కెక్కిన సంగతి తెలిసిందే. 106 టెస్టుల్లో 537 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన భారత టెస్టు బౌలర్‌గా అశ్విన్ ఘనత వహించాడు. ఇందులో 8 సార్లు పది వికెట్ల ప్రదర్శన, 37 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనతో దుమ్ము రేపాడు. ఓవరాల్ గా అత్యధిక వికెట్లు తీసిన ఎనిమిదో బౌలర్ గా నిలిచిన అశ్విన్.. లీడింగ్ వికెట్ టేకర్ స్పిన్నర్ల లో ఐదో స్థానంలో నిలిచాడు. అశ్విన్ ను పరిమిత ఓవర్ల క్రికెట్లో మరింత బాగా వాడుకుని ఉంటే బాగుండేదని పలువురు మాజీలు వ్యాఖ్యానించారు. 106 టెస్టులాడిన అశ్విన్.. 116 వన్డేలు, 65 టీ20లు మాత్రమే ఆడాడు. .
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

