Prabhu Hospitalized : ఆస్పత్రిలో ప్రభు - ఆందోళన అక్కర్లేదు, ఆయనకు ఏమైందంటే?
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన తమిళ నటుడు ప్రభు ఆస్పత్రిలో చేరారు. అయితే, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు, ఆయనకు ఏమైందంటే?
తెలుగు ప్రేక్షకులకు కూడా తమిళ నటుడు ప్రభు (Actor Prabhu) సుపరిచితులే. సూపర్ స్టార్ రజనీకాంత్ 'చంద్రముఖి'లో కైలాష్ పాత్ర తెలుగు నాట ఆయనకు ఎక్కువ గుర్తింపు తీసుకు వచ్చింది. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ 'డార్లింగ్', యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'శక్తి', మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభవంగా' తదితర సినిమాల్లో హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలు చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన విజయ్ 'వారసుడు' సినిమాలో కూడా కనిపించారు. వరుస సినిమాలు, షూటింగులతో బిజీగా ఉన్న ప్రభు... అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరారు.
అసలు, ప్రభుకు ఏమైంది?
ఎందుకు ఆస్పత్రికి వెళ్ళారు?
రెండు రోజుల క్రితం (ఫిబ్రవరి 20న) కడుపులో నొప్పిగా అనిపించడంతో చెన్నై నగరంలోని ఓ ఆస్పత్రికి ప్రభు వెళ్ళారు. కొన్ని రోజులుగా ఆయనకు కిడ్నీ సమస్య ఉందట. వైద్య పరీక్షలు చేసిన తర్వాత కిడ్నీలో రాళ్ళు కారణంగా నొప్పి వచ్చిందని డాక్టర్లు గుర్తించారు. లేజర్ సర్జరీ చేయడం ద్వారా ప్రభు కిడ్నీలో రాళ్లు తొలగించారు. రెండు మూడు రోజుల్లో ఆయన్ను డిశ్చార్జి చేయవచ్చని సమాచారం. ప్రస్తుతం చెన్నైలోని మెడ్ వే ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులు హెల్త్ బులిటెన్ కూడా విడుదల చేశారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ప్రభు ఆస్పత్రిలో చేరిన తర్వాత సోషల్ మీడియాలో కొందరు అభిమానులు తమ ఫెవరేట్ యాక్టర్ (Prabhu Undergoes Kidney Stones Surgery) కి ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు అయితే ఓ అడుగు ముందుకు వేసి ప్రభు కదల్లేని పరిస్థితిలో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదని చెన్నై సినిమా వర్గాలు చెబుతున్నాయి. రెండు మూడు రోజుల్లో ప్రభు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తారని సమాచారం. మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో ప్రభు కీలక పాత్రలో నటించారు. ఈ ఏడాది విడుదల కానున్న రెండో పార్టులో కూడా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. అది కాకుండా ఇంకా పలు సినిమాలు చేస్తున్నారు.
Also Read : టామ్ క్రూజ్, లియోనార్డో డికాప్రియో, ఇప్పుడు రామ్ చరణ్ - హాలీవుడ్‌లో క్రేజ్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే
తెలుగు, తమిళ చిత్రసీమలను ఈ ఏడాది వరుస మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అందువల్ల, ఎవరైనా ఆస్పత్రికి వెళ్ళారని తెలిస్తే ప్రేక్షకులతో పాటు పరిశ్రమ ప్రముఖులు సైతం కంగారు పడుతున్నారు. నందమూరి తారక రత్న శివరాత్రి రోజు శివైక్యం చెందారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ ఫిబ్రవరి 2న మరణించారు. ఆ మర్నాడు ఫిబ్రవరి 3న లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ కన్ను మూశారు. జనవరి 27న సీనియర్ నటి జమున మరణించారు. జనవరి 26న ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి, తమిళ ఫైట్ మాస్టర్ జూడో రత్నం మరణించారు. తమిళ హాస్య నటుడు మెయిల్ స్వామి ఫిబ్రవరి 19న మరణించారు. జనవరి 3న సీనియర్ జర్నలిస్ట్, లిరిసిస్ట్ పెద్దాడ మూర్తి కన్ను మూశారు. 'కుందనపు బొమ్మ' సినిమాలో ఓ హీరోగా నటించిన యువ నటుడు సుధీర్ జనవరి 24న తిరిగి రాని లోకాలకు వెళ్ళారు.
Also Read : ఇంటికి పంపాలనుకున్నా వెళ్ళను, పవర్ స్టార్ స్థాయికి ఎదుగుతా, మీకెందుకు తొందర? - కిరణ్ అబ్బవరం