Radhe Shyam Movie Release Trailer: నాకు రెండోసారి చూసే అలవాటు లేదంటున్న ప్రభాస్! ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ చూసేలా 'రాధే శ్యామ్' రిలీజ్ ట్రైలర్
'రాధే శ్యామ్' సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల రిలీజ్ ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. అది ఎలా ఉంది? ఏంటి?
యంగ్ రెబల్ స్టార్, అభిమానుల గుండెల్లో డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సినిమా 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించారు. ఆల్రెడీ సినిమా ట్రైలర్ విడుదలైంది. మార్చి 11న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిలీజ్ ట్రైలర్ అంటూ మరొకటి విడుదల చేశారు. దానిని చూడండి.
'మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం. మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి' అని ప్రభాస్ చెప్పే డైలాగ్ తో రిలీజ్ ట్రైలర్ మొదలైంది. ఎగసి పడే మంటల్లో ప్రభాస్ కనిపించడం... ఆ దృశ్యం చూస్తే, ఒళ్ళు గగుర్పాటుకు గురి కావడం ఖాయం. ఆ తర్వాత ప్రభాస్ పాత్ర గురించి డైలాగ్ ఉంది. 'చెయ్యి చూసి ఫ్యూచర్ ను, వాయిస్ విని పాస్ట్ ను కూడా చెప్పేస్తావా?' అని ఒకరు ప్రశ్నించడం... 'ఈయన ఎలా, ఎప్పుడు చనిపోతాడో చెప్పనా?' అని ప్రభాస్ అనడం... ఆ తర్వాత దృశ్యాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. 'నాకు రెండోసారి చూసే అలవాటు లేదు' అని ప్రభాస్ చెప్పే డైలాగ్ అతడి క్యారెక్టర్, అతడి క్యారెక్టర్ మీద అతడికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.
'ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు' అని పూజా హెగ్డే చెప్పే డైలాగ్ ఆసక్తి పెంచేలా ఉంది. 'ప్రేమకి, విధికి మధ్య జరిగే యుద్ధం...'లో అని రాజమౌళి చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ అయ్యింది. నాకు రెండోసారి చూసే అలవాటు లేదని ప్రభాస్ డైలాగ్ చెప్పినా... ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ చూసేలా 'రాధే శ్యామ్' రిలీజ్ ట్రైలర్ ఉందని చెప్పాలి.
గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన చిత్రమిది. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
View this post on Instagram