Pooja Hegde Trivikram : పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇస్తున్న త్రివిక్రమ్ - ఈసారి హీరో ఎవరంటే?
త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న 'గుంటూరు కారం'లో పూజా హెగ్డే నటించాల్సింది. కానీ, కుదరలేదు. ఇప్పుడు ఆమెకు త్రివిక్రమ్ మరో ఛాన్స్ ఇస్తున్నారని టాక్. అది మహేష్ సినిమా కాదు గానీ..
బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)లది సూపర్ హిట్ కాంబినేషన్. గురూజీ తీసిన 'అరవింద సమేత వీర రాఘవ', 'అల వైకుంఠపురములో' సినిమాల్లో పూజ నటించారు. నిజం చెప్పాలంటే... వాళ్ళ కలయికలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం' హ్యాట్రిక్ సినిమా! అయితే, కొన్ని కారణాల ఆ సినిమాలో ఇప్పుడు పూజా హెగ్డే లేరు. తప్పుకున్నారు.
'గుంటూరు కారం'లో బుట్ట బొమ్మ ప్రత్యేక గీతం చేస్తున్నారని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని తెలిసింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... త్రివిక్రమ్, పూజా హెగ్డే కలయికలో మరో సినిమా రానుంది. ఆ సినిమా వివరాల్లోకి వెళితే...
త్రివిక్రమ్ నిర్మాణంలో సాయి ధరమ్ తేజ్
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రమిది. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకుడు. త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారట.
సాయి తేజ్ జోడీగా త్రివిక్రమ్ నిర్మాణంలో పూజ!
ఇప్పటి వరకు మెగా కుటుంబంలోని ముగ్గురు హీరోలతో పూజా హెగ్డే నటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జోడీగా 'ఆచార్య'లో నటించారు. 'రంగస్థలం'లో ప్రత్యేక గీతం చేశారు. వరుణ్ తేజ్ సరసన 'ముకుంద', 'గద్దలకొండ గణేష్' చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలోనూ నటించారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ జోడీగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందే సినిమాలో నటించనున్నారని సమాచారం.
''సాయి తేజ్ సినిమా కోసం పూజా హెగ్డేను త్రివిక్రమ్ శ్రీనివాస్ సంప్రదించిన మాట వాస్తవమే. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇదొక మాస్ ఎంటర్టైనర్. ఈ ఏడాది షూటింగ్ స్టార్ట్ అవుతుంది. త్వరలో అధికారిక ప్రకటన రానుంది'' అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
Also Read : 'రంగబలి' దర్శకుడి జోకులకు భయపడిన సుమ - జనాలు అపార్థం చేసుకుంటే?
సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej), పూజా హెగ్డేలకు తొలి చిత్రమిది. వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. సంపత్ నందికి మరోసారి మెగా కుటుంబంలోని యువ హీరోతో సినిమా చేసే అవకాశం వచ్చింది. గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'రచ్చ' తీశారు. ఇప్పుడు సాయి తేజ్‌తో సినిమా ఓకే అయ్యింది. గత ఏడాది సంపత్ నంది పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ చేశారు.
Also Read : గొప్ప మనసు చాటుకున్న 'కాంతార' రిషబ్ శెట్టి - చిన్నారుల చదువు కోసం ఫౌండేషన్
గోపీచంద్ 'సీటీమార్' తర్వాత సంపత్ నంది చేస్తున్న చిత్రమిది. ఇది కాకుండా గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ కోసం ఆయన ఒక కథ రెడీ చేశారు. అలాగే, 'విక్రమార్కుడు' సీక్వెల్ చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. ఇక, మామా అల్లుళ్లు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో' ఈ నెల 28న విడుదల కానుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial