Polimera 2: చిరంజీవితో సినిమా చేయను, ఆయన అడిగినా సరే - ‘పొలిమేర’ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు
చిరంజీవి అంటే చాలామంది దర్శకులకు, హీరోలకు అభిమానం ఉంటుంది. కానీ తను ఎంతగానో అభిమానించే చిరును తాను డైరెక్ట్ చేయలేనని ‘పొలిమేర’ దర్శుకుడు అనిల్ వ్యాఖ్యలు చేశాడు.
చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్‌తో విడుదలయ్యి బ్లాక్‌బస్టర్ సాధించిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తెలుగులో ఇలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలే హవా కొనసాగిస్తున్నాయి. తాజాగా విడుదలయిన ‘పొలిమేర 2’ కూడా అదే తోవకు చెందింది. రెండేళ్ల క్రితం విడుదలయిన ‘పొలిమేర’ సినిమాకు సీక్వెల్‌గా ‘పొలిమేర 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకప్పుడు ఏ అంచనా లేకుండా ‘పొలిమేర’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు దర్శకుడు టాలెంట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ప్రేక్షకులను ఎంతగానో ఇంప్రెస్ చేసిన ‘పొలిమేర’ క్లైమాక్స్‌లో డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్‌కు దీని సీక్వెల్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూడడం మొదలుపెట్టాడు. తాజాగా విడుదలయిన సీక్వెల్ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో దర్శకుడు అనిల్ విశ్వనాథ్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. అలా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై తనకు ఉన్న ఇష్టాన్ని బయటపెట్టాడు.
అదే నా ఆఖరి సినిమా కావచ్చు..
మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్‌లో చాలామంది దర్శకులకు, హీరోలకు అభిమానం. అంతే కాకుండా ఆయననే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చినవారు కూడా చాలామంది ఉన్నారు. అలాగే ‘పొలిమేర 2’ దర్శకుడు అనిల్ విశ్వనాథ్‌కు కూడా చిరంజీవి అంటే చాలా అభిమానమని, చూస్తే ఎమోషనల్ అయిపోతానని బయటపెట్టాడు. తనకు చిరు అంటే చాలా ఇష్టమని, బయట కలిసే అవకాశం వచ్చిన చాలాసార్లు కలవలేదని అన్నాడు. చిరంజీవిని కలిసినప్పుడు తనకంటూ స్థాయి ఉండాలని, ఆయన చేత మంచి సినిమా తీశానని చెప్పించుకోవాలని, ఒకవేళ అలా చెప్తే.. అదే తన ఆఖరి సినిమా కూడా అవ్వవచ్చని, ఇంక సినిమాలు తీయడం ఆపేస్తానేమో అని చెప్పాడు అనిల్.
ఆయనతో సినిమా తీయలేను..
‘పొలిమేర 2’తో చిరంజీవి చేత ప్రశంసలు పొందే అవకాశం తనకు దక్కలేదని, ఆయన పిలుపు అందాలంటే ఇంకా పెద్ద బ్లాక్‌బస్టర్ కొట్టాలని అనిల్ చెప్పుకొచ్చాడు. అంత అభిమానం ఉన్నందుకు ఒకవేళ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలాంటి జోనర్ సినిమా తీస్తారు అంటే ఆయనతో నేను సినిమా తీయలేను అని సూటిగా సమాధానం ఇచ్చాడు. అదేంటి అని అడగగా.. ‘‘ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు బాగుంది, బాలేదు అని చెప్పాలి. ఆయన ఏం చేసినా నాకు బాగుంటుంది. నేను జడ్జ్ చేయలేను’’ అని చెప్పాడు అనిల్. ఒకవేళ చిరంజీవినే వచ్చి చేయమని చెప్పినా.. చేయను అని అంటానని తెలిపాడు.
‘ఠాగూర్’ చూస్తూ ఎమోషనల్..
చిన్నప్పటి నుంచి చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని అనిల్ మాటల్లో చెప్పే ప్రయత్నం చేశాడు. మామూలుగా సినిమాలను థియేటర్‌లో చూసినప్పుడు పేపర్లు ఎగరేస్తాము కానీ ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా టీవీలో వచ్చినప్పుడు కూడా పేపర్లు ఎగరేస్తానని, తనకు అంత చిరు అంటే అంత అభిమానమని చెప్పుకొచ్చాడు అనిల్. చిరంజీవి నటించిన ఎన్నో గొప్ప చిత్రాలను గుర్తుచేసుకున్నాడు. అందులోని ఆయన యాక్టింగ్‌ను ప్రశంసించాడు. ‘ఠాగూర్’ చిత్రంలో కొడితే కొట్టాలిరా పాటకు చిరంజీవి.. కెమెరాలో చూస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌కు థియేటర్‌లోనే ఎమోషనల్ అయ్యానని, ఆయన కెమెరాలో చూసి ఏం చెప్పినా.. తనకు చెప్తున్నట్టే ఫీల్ అయ్యేవాడినని అన్నాడు అనిల్ విశ్వనాథ్.
Also Read: స్వాతి కోసం బెంగళూరు కాలేజీకి వెళ్ళిన బన్నీ - అప్పుడు ఏం జరిగిందంటే?