Pavan Thanks KTR : మీ ఆత్మీయతకు కృతజ్ఞతలు.. కేటీఆర్‌కు పవన్ ధ్యాంక్స్ !
కేటీఆర్‌కు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ గొడలను కళలు, సంస్కృతికి అంటనీయలేదన్నారు. ఇది తెలంగాణ నేతల శైలిలోనే ఉందన్నారు.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన కేటీఆర్‌కు పవన్ కల్యాణ్ ( Pavan Kalyan ) కృతజ్ఞతలు తెలిపారు. " కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి కుల, మత, భాష, ప్రాంతీయ బేధాలుండవు. అంతే కాదు భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు. ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజెప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) గారికి నిండైన హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని పవన్‌కల్యాణ్ లేఖ విడుదల చేశారు.
బయో ఏషియా అంతర్జాతీయ సదస్సులో బిల్ గేట్స్ తో కీలకమైన వర్చువల్ మీట్ కు సన్నద్థమవుతూ బిజీగా ఉన్నా సమయం వెసులుబాటు చేసుకొని భీమ్లా నాయక్ ( Bheemla Naik ) ప్రి రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంత భావ వైరుధ్యాలున్నా.. రాజకీయ విమర్శలు చేసుకున్నా వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉందన్నారు. ప్రస్తుత హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా నిర్వహించే అలయ్ బలయ్ ( Alai Balai ) కార్యక్రమంలో అన్ని పక్షాలవారు ఆత్మీయంగా ఉండటాన్ని చూశాం. అటువంటి ఆత్మీయత కె.టి.ఆర్. లో ప్రస్పుటంగా కనిపిస్తుందన్నారు పవన్ కల్యాణ్. సృజనాత్మకత, సాంకేతికత, మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ.. ఈ రంగం అభివృద్థికి ఆలోచనలను కె.టి.ఆర్. చిత్తశుద్థితో పంచుకున్నారన్నారు.
భీమ్లా నాయక్ సినిమాకు తెలంగాణలో ( Telangana ) ప్రోత్సాహం లభిస్తోంది. అదనపు షోకు అనుమతి ఇస్తూ ప్రత్యేక జీవో ఇచ్చింది. దీంతో పలు చోట్ల బెనిఫిట్ షోలు వేసుకునే అవకాశాలు కూడా వచ్చినట్లయింది. టిక్కెట్ ధరలను ( Ticket Rates ) పెంచుకునేందుకు గతంలోనే అనుమతి ఇచ్చారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ప్రోత్సాహం లభించడమే కాకుండా కేటీఆర్ కూడా వేడుకకు హాజరవడంతో భీమ్లా నాయక్ యూనిట్ సంతోషపడింది.
అదే సమయంలో ఏపీలో మాత్రం భీమ్లా నాయక్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అతి తక్కువ టిక్కెట్ ధరలతోపాటు ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వలేదు. రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలని ఆదేశించారు. రూల్స్ ఉల్లంఘిస్తే ధియేటర్లు సీజ్ చేస్తామని ముందుగానే నోటీసులు ఇచ్చారు. ఇ పరిణామాలతో రాజకీయ వైరుధ్యాలు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఉంది. తన లేఖ ద్వారా పవన్ కూడాఅదే తరహా సందేశాన్ని ఇచ్చారనుకోవచ్చు.