Paruchuri Gopala Krishna: ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై పరుచూరి వ్యాఖ్యలు - అది చాలా కష్టం
Paruchuri Gopala Krishna: ప్రతీ సినిమాను పక్కాగా పరిశీలించి విశ్లేషించే పరుచూరి గోపాలకృష్ణ.. తాజాగా ‘కల్కి 2898 ఏడీ’పై కూడా తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ వీడియోను విడుదల చేశారు.
నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాపై ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక ప్రతీ మూవీని ప్రత్యేకంగా విశ్లేషించే పరుచూరి గోపాలకృష్ణ సైతం తాజాగా ‘కల్కి 2898 ఏడీ’పై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ సినిమా విడుదలయ్యి ఇన్నిరోజులు అవుతున్నా తను ఇంకా చూడలేదని చెప్తూనే తనకు తెలిసిన కథను బట్టి దాని గురించి విశ్లేషించారు. ప్రభాస్, నాగ్ అశ్విన్‌తో పాటు నిర్మాత అశ్విని దత్‌పై కూడా ప్రశంసలు కురిపించారు.
ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు..
‘‘ఇంతకు ముందు హీరోలు సంవత్సరానికి చాలా సినిమాలు చేసేవారు. ఆ తర్వాత ఏడాదికి ఒక సినిమా చేసే పరిస్థితి వచ్చేసింది. ఇక ఇప్పుడు రెండు, మూడేళ్లకు ఒక సినిమా వస్తోంది. కల్కి 2898 ఏడీ అయితే నాలుగేళ్లు పట్టిందట. మధ్యలో సలార్ వచ్చింది. లేకపోతే ప్రభాస్‌ను చూడడానికి ఆడియన్స్ చాలా ఎదురుచూడాల్సి వచ్చేది. కల్కి 2898 ఏడీతో నాగ్ అశ్విన్ ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడు. కథ మొత్తం చదివాను. చదువుతుంటేనే హృదయం ఉప్పొంగిపోయింది. దీనికోసం ఇన్ని సంవత్సరాలు తను కష్టపడ్డాడు. ఒకప్పుడు నిర్మాతను చూస్తే హీరోతో సహా మూవీ యూనిట్ అంతా నిలబడేవారు. అలాంటి నిర్మాతల్లో అశ్విని దత్ ఒకరు’’ అంటూ అశ్విని దత్‌కు, తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.
బాహుబలితో నిరూపించుకున్నాడు..
‘‘నాగ్ అశ్విన్.. అశ్వినిదత్‌కు అల్లుడు అనే విషయాన్ని పక్కన పెడితే ఒక దర్శకుడిగా, ఒక రచయితగా తనను నమ్మి అంత గొప్ప ప్రాజెక్ట్ ఇవ్వడం గొప్ప విషయం. మామూలుగా హీరోను నమ్మి ప్రాజెక్ట్ ఇచ్చారు అని మాట్లాడుతుంటారు. కానీ బాహుబలితోనే తను సినిమాను ఏ రేంజ్‌కు తీసుకెళ్లగలడో ప్రభాస్ నిరూపించాడు. దీంతో హీరో గురించి భయం లేదు. ఒకప్పుడు రాజమౌళి అద్భుతాలు సృష్టించాడు. మొదటిసారి నాగ్ అశ్విన్ కూడా ఆ కేటగిరిలోకి చేరాడు. నేను కూడా ప్రపంచం మెచ్చే సినిమాలు తీయగలను అని నిరూపించుకున్నాడు. ‘కల్కి 2898 ఏడీ’ అనేది ఒక ఎపిక్ సైంటిఫిక్ ఫిల్మ్. జరగనిదాని గురించి ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. కానీ ఒక ఎపిక్‌ను సైంటిఫిక్‌గా మార్చడం చాలా కష్టం. అది నాగ్ అశ్విన్ అద్భుతంగా తీయగలిగాడు’’ అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు పరుచూరి.
నాగ్ అశ్విన్‌కు హ్యాట్సాఫ్..
‘‘కల్కి 2898 ఏడీకి కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ రెండు కళ్లు. మూడో కన్నులాగా ప్రభాస్‌ను తీసుకొచ్చి పెట్టారు. ఈ సినిమా కోసం రైటర్స్‌గా పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు. రూ.600 కోట్లతో ఒక తెలుగు సినిమా తీయడం సాహసం. ఇప్పటికే ఈ మూవీ రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిందని చూస్తున్నాం. ఇది ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగ కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకే పండగ. ‘దేవర’ సినిమా కూడా లైన్‌లో ఉంది. కానీ దాని ఖర్చుల గురించి బయటికి రావడం లేదు. ‘కల్కి 2898 ఏడీ’ కథ రాసినందుకు నాగ్ అశ్విన్‌కు హ్యాట్సాఫ్. మామూలుగా స్టోరీ ప్లాట్ అంటే కొన్ని లైన్స్ ఉంటుంది. కానీ ఈ సినిమా ప్లాట్ అడిగితే అయిదు పేజీలు ఇచ్చారు. మతిపోయింది’’ అని అన్నారు పరుచూరి. కచ్చితంగా వారంలోపు ‘కల్కి 2898 ఏడీ’ చూస్తానని మాటిచ్చారు.
Also Read: అలీ నోట పవన్ కళ్యాణ్ పేరు - ఎట్టకేలకు ఒప్పకున్నాడుగా!