పవన్ బంగారు బిడ్డ, దెబ్బతిన్న పులిలా మళ్లీ వస్తున్నాడు: పరుచూరి గోపాలకృష్ణ
'బ్రో' సినిమాలో పవన కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. సమాజం మారాలని పవన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడని చెప్పారు.
Paruchuri Gopalakrishna : పవర్ స్టార్ పవన కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా గురించి తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పవన్ దెబ్బతిన్నా.. మళ్లీ దెబ్బతిన్న పులిలా వస్తున్నారని, ఆయన రాజకీయాల్లో ఉంటూనే.. అప్పుడప్పుడైనా సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
"బ్రో సినిమా గురించి తెలిసినపుడు అసలు దీంట్లో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ ఉండడమేంటీ అనుకున్నాను. ఈ మూవీకి ఒక ఆర్టిస్ట్ అయిన సముద్ర ఖని డైరెక్టర్ చేయగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే రాయడం.. ఇది వినోద సీతమ్ అనే సినిమాకు రిమేక్.. అని తెలిసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బ్రోలో పవన్, తేజ్ కలిసి నటించడం చూసి.. సాయి ధరమ్ ప్రమోషన్ కోసం పవన్ చేశాడా అనిపించింది. అయినా ఇలాంటివి మామూలే. చిరంజీవి, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లినపుడు కూడా ఇలాంటివి జరిగాయి. ఎందుకంటే రాజకీయాల్లో నా ఓటు నేను పొందాలంటే ఏం చేయాలి.. అనేటువంటిది ఒకటుండాలి. ఇక పవన్ గురించి చెప్పాలంటే ఆయన బంగారు బిడ్డ. అంత మంచి పిల్లాడు సినిమాల్లోనే ఉంటే.. ఇంకా పదో, పదిహేనేళ్ల తర్వాత ఒక అన్నగారిలా, ఒక మెగాస్టార్ లా ఎదుగుతాడని మనందరం అనుకుంటాం. ఆయనకి సమాజం మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు అని మనందరికీ తెలిసిన వాస్తవం" అని పరుచూరి చెప్పారు.
సమాజం మారాలంటే అధికారం చేతులు మారుతూ ఉండాలని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. కమ్యూనిస్టులు చేసే పోరాటం కూడా అదేనని, ఎప్పుడూ అధికారం ఒకరి చేతుల్లోనే ఉంటే.. ప్రజలు ఆ పరిపాలనకు అలవాటైపోయి నిస్సహాయతకు గురవుతుంటారన్నారు. కాబట్టి పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నాడని తెలిపారు. ఒకసారి దెబ్బతిన్నా.. దెబ్బతిన్న పులిలా ఎంటర్ అవుతున్నాడని ఆయన అన్నారు. మనమంటే ఇష్టమున్నా.. వాళ్లను ఓటు వేయించుకునేందుకు ఎలా రప్పించుకోవాలన్న విషయం తెలిసి ఉండాలి అని చెప్పారు. కాబట్టి మనకు ఇవన్నీ మామూలేనని, భీష్ముడికి బాణాలు ఎలా తగులుతూ ఉంటాయో, ఎలా బాణాలొచ్చినా ఎదుర్కొని నిలబడినప్పుడే రాజకీయం చేతుల్లోకి వస్తుందని పరుచూరి తెలిపారు.
తాను చెప్పాలనుకుంటున్నదేమిటంటే.. పవన్ కేవలం రాజకీయాలకో, సినిమాలకో పరిమితం కాకుండా.. నటుడిగా, రాజకీయ నాయకుడిలా ఉండాలని తన కోరిక అని పరుచూరి అన్నారు. ఎందుకంటే సమాజం గురించి రాజకీయ నాయకుడు చెప్తున్నపుడు వినే వాళ్ల కంటే.. ఒక నటుడు చెప్తున్నపుడు వినే వాళ్లు ఎక్కువగా ఉంటారని ఆయన చెప్పారు. లేదంటే అన్న గారు అప్పుడప్పుడు సినిమాలు చేసినట్టయినా చేయండని కోరారు. మీ జీవితం బాగుండాలని కోరుకునే వాళ్లలో ముందు వరుసలో తానొకడినని అన్నారు.
Read Also : Bholaa Shankar: ‘భోళా శంకర్’ సక్సెస్‌పై మెహర్ నమ్మకం, ‘గ్యాంగ్ లీడర్’, ‘ఘరానా మొగుడు’ రేంజ్‌లో ఉంటుందట!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial