Kanguva - Oscar: బెస్ట్ పిక్చర్ కోటాలో 5 ఇండియన్ సినిమాలు... ఆస్కార్ నామినేషన్స్‌లో ఇండియన్ డిజాస్టర్ ఫిల్మ్
Oscars 2025: ఈసారి అకాడమీ అవార్డులకు 323 చిత్రాలు అర్హత సాధించగా.. అందులో 207 చిత్రాలు మాత్రమే అన్ని రకాలుగా పోటీకి అర్హతను పొందాయి. ఈ 207 చిత్రాలలో మన ఇండియన్ సినిమాలు 5 చోటుని దక్కించుకున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆస్కార్ అవార్డ్‌ను చూసే కోణమే మారిపోయింది. అదో గొప్ప అవార్డు అని అందరికీ తెలిసింది. అంతకు ముందు ఏఆర్ రెహమాన్ వంటి వారు రెండేసి సార్లు ఈ అవార్డు పొందినా.. అంతగా దీని ప్రాముఖ్యం ఎవరికీ తెలియదు కానీ.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఈ అవార్డు రావడంతో.. ఒక్కసారిగా ఆస్కార్ అవార్డ్ రేంజే మారిపోయింది. అదొక పెద్ద అవార్డు అని, ఆ అవార్డ్‌ని తెలుగు సినిమాలు కూడా సాధించగలవని ఆర్ఆర్ఆర్ సినిమా నిరూపించింది. అంతే అప్పటి నుండి ఆస్కార్ అనౌన్స్‌మెంట్ వస్తే చాలు.. మన ఇండియన్ సినిమాలు ఏమైనా ఉన్నాయా? అని భారతీయులందరూ ఈ అవార్డ్స్‌పై దృష్టి పెడుతున్నారు. తాజాగా 97వ అకాడమీ అవార్డ్స్‌కు సంబంధించి నామినేషన్స్ విడుదలయ్యాయి. ఈసారి అకాడమీ అవార్డులకు 323 చిత్రాలు అర్హత సాధించగా.. అందులో 207 చిత్రాలు మాత్రమే అన్ని రకాలుగా పోటీకి అర్హతను పొందాయి. ఈ 207 చిత్రాలలో మన ఇండియన్ సినిమాలు 5 ఉండటం విశేషం. ఆ ఐదు సినిమాలు ఏమేంటంటే..
1. ఆడుజీవితం (ది గోట్ లైఫ్) (హిందీ)
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో బ్లేస్సి దర్శకత్వంలో వచ్చి రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని రాబట్టిన ‘ఆడుజీవితం’ (ది గోట్ లైఫ్) సినిమా ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్‌లో చోటును దక్కించుకుంది. థియేటర్లలో మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా న్యాచురాలిటీకి చాలా దగ్గరగా చిత్రీకరించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోవడంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉంది. ఖచ్చితంగా అవార్డును సొంతం చేసుకుంటుందనే నమ్మకాన్ని చిత్రయూనిట్ వ్యక్తం చేస్తోంది.
2. కంగువా (తమిళ్)
కోలీవుడ్ హీరో సూర్య నటించిన ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కించారు. ఎన్నో భారీ అంచనాల నడుమ దాదాపు 10 భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. నిర్మాతను కోలుకోనీయకుండా చేసింది. కానీ ఇందులో సబ్జెక్ట్, జంగిల్ బ్యాక్‌డ్రాప్, విజువల్ ఎఫెక్ట్స్ అకాడమీని ఆకర్షించాయి. అందుకే నామినేషన్ లిస్ట్‌లోకి ఈ సినిమాను చేర్చారు. థియేటర్లలో దారుణమైన రిజల్ట్‌ని అందుకున్న ఈ చిత్రం ఊహించని విధంగా ఆస్కార్ రేసులోకి వచ్చేయడంతో.. ఒక్కసారిగా ఈ సినిమాపై సెర్చింగ్ మొదలైంది. ఈ సినిమా నామినేషన్స్‌లో చోటు దక్కించుకోవడంతో యూనిట్‌కు ఆశ్చర్యపోతుంది.
3. సంతోష్ (హిందీ చిత్రం)
షహానా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సంధ్యా సూరి దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ క్రైమ్ డ్రామా చిత్రం. తన భర్త మరణంతో అతని కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందిన పాత్రలో షహానా గోస్వామి నటించారు. గ్రామీణ నేపథ్యంలో అడుగడుగునా ఉత్కంఠ భరితంగా తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్‌లో నిలవడంతో చిత్రయూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.
4. స్వాతంత్య్ర వీర సావర్కర్ (హిందీ)
వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితంపై తెరకెక్కిన చిత్రం ‘స్వాతంత్య్ర వీర సావర్కర్’. హిందీ భాషలో తెరకెక్కిన ఈ సినిమాకు రణదీప్ హుడా దర్శకత్వం వహించడమే కాకుండా టైటిల్ పాత్రలోనూ నటించారు. అంతేకాదు ఈ సినిమాకు ఆయన సహ-రచయిత మరియు సహ-నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం సావర్కర్ చిన్ననాటి నుండి అతని జీవిత చరిత్ర మొత్తాన్ని వివరణాత్మకంగా తెలియజేస్తుంది. ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలవడంతో.. ఖచ్చితంగా అవార్డ్ వస్తుందనే ధీమాని యూనిట్ ప్రదర్శిస్తోంది.
5. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం-హిందీ)
పాయల్ కపాడియా రచించి దర్శకత్వం వహించిన డ్రామా చిత్రం ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’. కని కుశృతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృదు హరూన్ వంటివారు నటించారు. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, ఇటలీ సంస్థలతో కూడిన అంతర్జాతీయ సహకారంతో ఈ సినిమా రూపొందింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ 2024లో టాప్ 5 అంతర్జాతీయ చిత్రాలలో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. అలాగే 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రం, ఉత్తమ దర్శకురాలు కేటగిరీలో రెండు నామినేషన్లను ఈ సినిమా అందుకుంది. ఫైనల్ రేసులో ఈ సినిమా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంటుందని అంతా భావిస్తున్నారు.
ఇప్పుడు నామినేషన్ పొందిన సినిమాలన్నింటికీ 8 జనవరి, 2025 నుండి 12 జనవరి, 2025 వరకు ఓటింగ్ జరుగుతుంది. జనవరి 17న ఫైనల్ నామినేషన్స్‌ని అకాడమీ అనౌన్స్ చేస్తుంది. ఫైనల్ నామినేషన్‌లో విజేతలుగా నిలిచిన చిత్రాలకు మార్చి 2న జరిగే ఆస్కార్ 2025 అవార్డ్స్ వేడుకలో అవార్డ్స్‌ని ప్రధానం చేయనున్నారు.
Also Read: : బ్రహ్మి తనయుడి సర్వైవల్ థ్రిల్లర్‌కు రెండేళ్ల తరువాత మోక్షం... ఓటీటీలో 'బ్రేక్ అవుట్', స్ట్రీమింగ్ ఎప్పుడో తెల్సా?