Naatu Naatu Wins Oscar : 'నాటు నాటు'కు ఆస్కార్ - సరికొత్త చరిత్ర సృష్టించిన 'ఆర్ఆర్ఆర్'
రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చరిత్ర సృష్టించింది. ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా కాలర్ ఎగరేసింది. ఆస్కార్ అందుకున్న తొలి తెలుగు, భారతీయ సినిమా పాటగా 'నాటు నాటు' చరిత్రకు ఎక్కింది.
చరిత్రలో...
భారతీయ చరిత్రలో...
ప్రపంచ సినిమా చరిత్రలో...
ఎప్పటికీ 'నాటు నాటు'ది ప్రత్యేక స్థానం
భారతీయ సినిమా ఆస్కార్ అందుకుంటుందా? తెలుగు సినిమా ఆస్కార్ వరకు వెళుతుందా? వంటి అనుమానాలను 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' పటాపంచలు చేసింది. నామినేషన్ అందుకోవడమే కాదు... సినిమాలోని 'నాటు నాటు...' (Naatu Naatu Song) ఆస్కార్ అందుకుంది.
'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' (ఉత్తమ పాట) విభాగంలో 'నాటు నాటు'కు 95వ ది అకాడమీ అవార్డ్ అందుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా, ఆ మాటకు వస్తే తొలి భారతీయ సినిమా పాటగా 'నాటు నాటు...' చరిత్ర సృష్టించింది. మన దేశానికి వచ్చిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. ఇప్పటి వరకు భారతీయులు అందుకున్న ఆస్కార్ అవార్డులు అన్నీ హాలీవుడ్ సినిమాలు వచ్చినవే. లెజెండరీ దర్శకుడు సత్యజిత్ రేకు గౌరవ ఆస్కార్ ఇచ్చారు.
ఇంతకు ముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన 'జయహో' పాటకు ఆస్కార్ వచ్చింది. అయితే, అది ఇండియన్ సినిమాలో పాట కాదు. హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించిన ఇంగ్లీష్ సినిమా 'స్లమ్ డాగ్ మిలినియర్'లోది.
'నాటు నాటు...' పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా... ఎంఎం కీరవాణి స్వరపరచిన గీతమిది. ఈ పాటలో ఎన్టీఆర్ లిరిక్స్ కీరవాణి తనయుడు కాల భైరవ పాడగా... రామ్ చరణ్ లిరిక్స్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకుంది. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా 'నాటు నాటు...' పాటకు అభిమాని. అమెరికాలో రాజమౌళిని కలిసిన ఆయన ఆ విషయం చెప్పడంతో 'దేవుడికి నాటు నాటు నచ్చింది' అని సంతోషం వ్యక్తం చేశారు.
'ఆర్ఆర్ఆర్' సినిమా తనకు ఎంతగానో నచ్చిందని 'టైటానిక్', 'అవతార్' చిత్రాల దర్శకుడు జేమ్స్ కామెరూన్ చెప్పారు. రెండుసార్లు సినిమా చూశానని ఆయన తెలిపారు. రామ్ చరణ్ పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంకా పలువురు హాలీవుడ్ దర్శకులు, రచయితలు, నిర్మాతలు సినిమా గురించి గొప్పగా చెబుతూ ట్వీట్లు చేశారు.
Also Read : ఇదీ అసలైన 'నాటు నాటు' మూమెంట్ - ఆస్కార్స్‌లో నిలబడి మరీ చప్పట్లు కొట్టారు
ఆస్కార్ కంటే ముందు 'నాటు నాటు...' పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం వచ్చింది. ఆ సమయంలోనే ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అందరికీ అర్థమైంది. ఈ అవార్డు ద్వారా దేశానికి రాజమౌళి గొప్ప గౌరవం తెచ్చారు. 'నాటు నాటు...'కు ఆస్కార్ రావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఆల్రెడీ 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గాను లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ సంగీతానికి గాను ఎం.ఎం. కీరవాణి అవార్డు అందుకున్నారు. ఆయనకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా అవార్డు ఇచ్చారు. అన్ని అవార్డులు ఒక ఎత్తు అయితే... ఆస్కార్ అవార్డు మరో ఎత్తు. దీంతో యావత్ దేశం సంబరాల్లో మునిగింది.
Also Read : వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం