Jr NTR : క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి తారక్ వీడియో కాల్... కుటుంబ సభ్యులకు ధైర్యం ఇచ్చిన మ్యాన్ ఆఫ్ మాసెస్
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన తిరుపతి అభిమాని కౌశిక్, అతని తల్లితో వీడియో కాల్ మాట్లాడారు. క్యాన్సర్ తో పోరాడుతున్న కౌశిక్ కు, ఆయన కుటుంబానికి ఈ క్లిష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు ఎంతమంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక తాజాగా క్యాన్సర్ తో పోరాడుతూ ఆసుపత్రి బెడ్ పై ఉన్న అభిమాని దేవర మూవీని చూసేదాకా బ్రతికించండి అంటూ బాధ పడ్డ వీడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం ఎన్టీఆర్ దాకా చేరడంతో ఆయన సదరు అభిమానితో వీడియో కాల్ మాట్లాడడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.
క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి అండగా
ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ దేవర పార్ట్ 1 పేరుతో సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఓవైపు ఎన్టీఆర్ ప్రమోషన్లలో బిజీగా ఉంటే, మరోవైపు తాజాగా కౌశిక్ అనే డై హార్డ్ ఫ్యాన్ క్యాన్సర్ తో పోరాడుతూ ఆసుపత్రి బెడ్ పై ఉండి కూడా తన అభిమాన నటుడైన ఎన్టీఆర్ దేవర మూవీని చూడాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని ఆయన అభిమానుల సంఘం ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, తాజాగా ఫోన్ చేసి ఆ యువకుడికి ధైర్యం చెప్పారు ఎన్టీఆర్.
Read Also: ఈ వీక్ ఎలిమినేషన్ కత్తి ఆ ఇద్దరి మీదే... ఇది ఊహించలేదు భయ్యా
కుటుంబ సభ్యులకు ధైర్యమిచ్చిన తారక్
వీడియో కాల్ లో ఎన్టీఆర్ కౌశిక్ అనే తిరుపతి అభిమానితో మాట్లాడుతూ "ఎలా ఉన్నావు? నవ్వితే బాగున్నావు" అంటూ కుశల ప్రశ్నలు వేసి అతని ఆరోగ్యం గురించి కనుక్కున్నారు. అయితే "మీతో మాట్లాడతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు" అంటూ కౌశిక్ ఆనందంలో మునిగిపోగా, "నువ్వు క్యాన్సర్ ను దాటి రావాలి. దేవర మూవీని చూడాలి. కానీ అంతకంటే ముందు మీ ఆరోగ్యం బాగుండాలి. కచ్చితంగా నువ్వు కోలుకుంటావు. నీకోసం నేను ప్రార్థిస్తాను" అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కౌశిక్ తల్లితో మాట్లాడుతూ "అతన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు ధైర్యంగా ఉంటే అతను కూడా ధైర్యంగా ఉంటాడు" అని తల్లి కొడుకులు ఇద్దరికి సపోర్ట్ ఇచ్చారు. అయితే తన కొడుకు చికిత్స కు సహాయం కావాలంటూ ఆ తల్లి అర్దించగా, ఎన్టీఆర్ మేమంతా మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటామని మాటిచ్చారు. ఇక కౌశిక్ మిమ్మల్ని కలవాలని ఉందంటూ ఎన్టీఆర్ ముందు తన మనసులోని మాటను బయట పెట్టాడు. వెంటనే ఎన్టీఆర్ "తప్పకుండా కలుద్దాం" అంటూ ఆయనకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్ ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన యువకుడు. అతనికి ఇప్పుడు కేవలం 19 సంవత్సరాలు. అయితే చనిపోయేలోగా దేవర మూవీని చూడాలనుకుంటున్నాను అంటూ వార్తల్లో నిలిచిన ఈ యువకుడు తాజాగా ఎన్టీఆర్ తో మాట్లాడి పట్టరాని సంతోషంలో మునిగిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తనతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అభిమానులు ఎన్టీఆర్ మంచి మనసును చూసి ఫిదా అవుతున్నారు.