ఇప్పటి హీరోలు ఇండివిడ్యువాలిటీ కోరుకుంటున్నారు..మెగాస్టార్ లా ఆలోచిస్తే ఫ్యాన్ వార్స్ ఉండవేమో!
Fan wars: తమ హీరోలను అభిమానులే వివాదాల్లోకి లాగుతున్నారా? చిన్న స్పందనతో పెద్ద దుమారం ఎందుకు రేపుతున్నారు? ఫ్యాన్ వార్స్ అన్నీ ఈ కోవకు చెందినవేనా? ఇది అభిమానమా , అమాయకత్వమా!

కెరీర్ ఆరంభంలో బుడి బుడి అడుగులు వేయించిన హ్యాండ్ ని ఎప్పుడూ వదిలేయకూడదు ఇది ఫ్యాన్స్ మాట
గర్తుపెట్టుకోవడం అంటే అనుక్షణం వారి నామస్మరణ చేయడమేనా? ఇది వారసత్వ హీరోల మాట
అభిమానం , గౌరవం మనసులో ఉండాలి కానీ సందర్భం ఉన్నా లేకున్నా అష్టోత్తర శతనామావళి చేసినట్టు వారి పేరు జపిస్తూనే ఉండాలా?
ఎప్పటికీ అదే నీడన బతికేయడం కాదు..తామేంటో నిరూపించుకోవాలి..తమకో బ్రాండ్ సెట్ చేసుకోవాలన్నది నేటి తరం ఆలోచన..
కానీ ఇదే తీరు నెగెటివ్ గా స్ర్పెడ్ అవుతోంది..కాదు కాదు ఫ్యాన్స్ నెగెటివ్ గా మార్చేస్తున్నారు..
చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ అంటే ట్రోల్ చేశారు
జై బాలయ్య అనలేదని తారక్ ని సోషల్ మీడియాలో ఆడేసుకున్నారు
కూలీ బావుంది వార్ చూడాలని అనుకోవడం లేదన్న నారా రోహిత్ ని వదల్లేదు..
దీన్ని అభిమానం అనాలో, తమ హీరోకి చేటుచేస్తున్నామని కూడా గుర్తించలేని అమాయకత్వం అనాలో సమాధానం మీకే వదిలేస్తున్నాం...
నడకరానప్పుడు తల్లిదండ్రులు చేయిపట్టుకుని నడిచే పిల్లలు పరుగు రాగానే చటుక్కున చేయి వదిలేస్తారు..అంతమాత్రాన వారికి ప్రేమ లేదనా? వారసత్వ హీరోలు కూడా కెరీర్ ఆరంభంలోనూ ఆసరా కోసం కుటుంబ పెద్దల్ని, వంశాన్ని చెప్పుకుంటారు. మమ్మల్ని కూడా ఆదరించండి అని పరిచయం చేసుకుంటారు. అవన్నీ ఓ అడుగు వేసేవరకే..ఆ తర్వాత తమ కష్టంతో ఎదగాలని, ఆరంభంలో తమకున్న ట్యాగ్ నుంచి బయటకు రావాలి అనుకుంటారు. తమకంటూ ఓ ఇమేజ్, స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవాలని భావిస్తారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ముఖ్యంగా ఈ తరం హీరోలు ఇండివిడ్యువాలిటీ కోరుకుంటున్నాు. కానీ అదే వారికి సమస్యగా మారుతోంది.
ఒకప్పుడు..దాసరి నారాయణరావు దగ్గర వర్క్ నేర్చుకున్నవాళ్లంతా..ఆయన కన్నుమూసేవరకూ ఆయన జపమే చేస్తూ వచ్చారు. తమకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడు దాసరి అని చెప్పుకునేవారు. ఇదంతా అప్పటి తరం.. వారి ఆలోచన వేరు. మారుతున్న జనరేషన్ తో పాటూ యువత ఆలోచనా విధానం కూడా మారుతోంది. తమకు సహాయం చేశారనో, చేయందించారనో కృతజ్ఞత చూపించగలరు కానీ అనుక్షణం వారినామస్మరణలో మునిగితేలాలి అనుకోరు. ఇది ఎందుకు తప్పవుతుందన్నది చాలామంది ప్రశ్న..
బాలనటుడిగా మెప్పించిన ఎన్టీఆర్..నిన్నుచూడాలని సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత వచ్చిన స్టూడెంట్ నంబర్ వన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వాస్తవానికి ఎన్టీఆర్ కెరీర్ మలుపుతిప్పిన సినిమాలన్నీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చినవే. అంతెందుకు టాలీవుడ్ ని అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టిన RRR సినిమా తెరకెక్కించిందీ రాజమౌళినే. తనని దర్శకుడిగా నమ్మి డేట్స్ ఇవ్వడం తారక్ మంచితనం అని రాజమౌళి అంటే.. తనకు ఇండస్ట్రీ హిట్స్ అందించిన జక్కన్న అంటే ఎంతో అభిమానం తారక్ కి. అంటే.. తారక్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న స్టార్ స్టేటస్ తనిచ్చిందే అని రాజమౌళి అనుకోలేదు.. ఎన్టీఆర్ ప్రతి సినిమా వేదికపైనా జక్కన్నకి హారతులు ఇవ్వలేడు. అదో బాండింగ్ అంతే.
మొదటి సినిమాకోసం ఫ్యామిలీ ఇమేజ్ వాడుకుంటారు, వంశం పేరు చెప్పి తొడకొడతారు అప్పుడు తప్పులేదా అంటే.. ఇమేజ్ ను తప్పనిసరిగా వాడుకుంటారు, సినిమాల్లోనూ పాటల్లోనూ ఆ అభిమానం చూపిస్తారు...ఆ తర్వాత ఆ ఇమేజ్ దాటి ఎదుగుతున్నారు. అంతమాత్రాన పదే పదే మా హీరోని తలుచుకోవడం లేదని సినీ వేడుకల్లో టార్గెట్ చేయడం ఎంతవరకూ సమంజసం? వాళ్లలో వాళ్లకి పరస్పరం గౌరవం, అభిమానం, కృతజ్ఞత ఉంటే చాలు. ఒకవేళ వ్యక్తిగత కారణాలతో అయినా, వృత్తిపరంగా అయినా కొన్నాళ్లకు వాళ్లమధ్య ఒకప్పటి బాండింగ్ లేకపోయినా అది పూర్తిగా వారి వ్యక్తిగత వ్యవహారమే అవుతుంది.
మా అభిమాన హీరో చెప్పాడు కాబట్టి నీ సినిమా చూశాం..అందుకే ప్రతి వేదికపై ఆ పేరు తల్చుకోవాల్సిందే అంటే..నిజంగానే కాలుతుంది.. చెప్పను బ్రదర్ అనొచ్చు లేదంటే మైక్ వదిలేసి వెళ్లిపొమ్మంటారా అని కూడా అడగొచ్చు. ఆ హీరో సినిమా చూడను ఈ హీరో సినిమా చూస్తాను అనడం.. వారి ఇండివిడ్యువాలిటీ.
ఓవరాల్ గా చెప్పేదేంటంటే మెగాస్టార్ చిరంజీవి తరహాలో మిగిలిన హీరోలు... అభిమానులు కూడా పెద్దరికం వహించాలి.
" పిల్లలు మన చేయి వదిలి బుడి బుడి అడుగులు వేయటం మొదలు పెట్టి ఈరోజు వేగంగా పరుగులు పెడుతుంటే మనకు ఆనందమే కదండీ. మనల్ని గుర్తు పెట్టుకోవాలా లేదా అన్నది మన ప్రేమ తాలుకూ స్పందన తప్ప...వాళ్ల జీవితాలు వాళ్లవి వాళ్ల హడావిడి వాళ్లది" అల్లు అర్జున్ బ్రాండ్ టాపిక్ వచ్చినప్పుడు ఓ ఇంటర్యూలో చిరంజీవి స్పందించిన విధానం ఇది.
అంతే హుందాగా అందరి అభిమానులు ఉండాలి..ఇదే మిస్సవుతోంది..అందుకే ఈ ఫ్యాన్ వార్ లు..
ఇంతకీ ఎవరు మారాలంటారు?






















