Nayan Vignesh: నయన్, విఘ్నేశ్ చట్టాలను ఉల్లంఘించారా - కమిటీ నివేదిక ఏం చెప్పింది?
సరోగసీ వివాదంలో నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులకు క్లీన్ చిట్ లభించిందని తెలుస్తోంది.
గత కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్‌ల సరోగసీ వివాదం దాదాపుగా ముగిసిందే. తమిళనాడు ప్రభుత్వం నియమించిన కమిటీ వీరికి క్లీన్‌చిట్ ఇచ్చిందని తెలుస్తోంది.నిబంధనలకు విరుద్ధంగా నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసీ విధానాన్ని ఆశ్రయించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. ఈ సరోగసీ వ్యవహారంపై విచారణ కమిటీకి ప్రభుత్వం ఇంతకు ముందే ఆదేశించింది. ఈ కమిటీ బుధవారం తమ నివేదికను సమర్పించింది.
ఈ విచారణ కమిటీ ఇచ్చిన నివేదికలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నయనతార, విఘ్నేశ్ దంపతుల సరోగసీ వ్యవహారం చట్టబద్ధంగానే జరిగినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సరోగసీ ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని విచారించినట్లు తమ నివేదికలో పేర్కొన్నారు. సరోగసీ ప్రక్రియలో నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు చట్టబద్ధమైన నిబంధనలు అన్ని అనుసరించారని విచారణలో తేలింది. ఈ వివాదంలో అద్దె గర్భం దాల్చిన మహిళకు ఇప్పటికే వివాహమైందని కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది.
2016 మార్చి 11వ తేదీన నయనతార, విఘ్నేశ్ దంపతులకు వివాహం అయినట్లు వారు అఫిడవిట్‌లో తెలిపారు. ఈ సరోగసీ ప్రాసెస్ 2021 ఆగస్టులో మొదలైందని పేర్కొన్నారు. అదే సంవత్సరం నవంబర్‌లో సరోగసీ విధానంపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు తమ విచారణలో తేలింది. దీంతో నయనతార, విఘ్నేశ్ జంటపై వస్తోన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లే. ఈ జంట చట్టబద్ధంగానే వివాహమైన ఐదేళ్లకు సరోగసీ విధానాన్ని అనుసరించినట్లు విచారణలో తేలింది. నయనతార, విఘ్నేశ్ శివన్‌లు అరెస్ట్ అవుతారంటూ వచ్చిన వార్తలకు చెక్ పడింది.
నయనతార ఫ్యామిలీ డాక్టర్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రైవేటు హాస్పిటల్ వైద్యులు సరోగసీ ప్రక్రియని ప్రారంభించినట్లు అధికారులు తమ నివేదికలో తెలిపారు. నయనతార ఫ్యామిలీ డాక్టర్‌ను కమిటీ సభ్యులు విచారించలేకపోయారు. ఆ డాక్టర్ విదేశాలకు వెళ్లిపోవడంతో ఆమెను విచారించడం కుదర్లేదు. ఆ వైద్యురాలు ఫోన్‌లో కూడా అందుబాటులో లేకపోవడం వల్లే విచారించలేకపోయామని కమిటీ తన నివేదికలో తెలిపింది. అయితే ఫ్యామిలీ డాక్టర్ తిరిగొచ్చాక ఈ కథను ఏమైనా మలుపు తిప్పుతుందో లేకపోతే సుఖాంతం చేస్తుందో చూడాలి.