Taraka Ratna Final Rites : తారకరత్న అంత్యక్రియలు ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారంటే?
Taraka Ratna Passed Away : తారకరత్న పార్థీవ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన అంత్యక్రియల విషయంలో నందమూరి ఫ్యామిలీ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
![Taraka Ratna Final Rites : తారకరత్న అంత్యక్రియలు ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారంటే? Nandamuri Taraka Ratna final rites to be held on Feb 20th, Monday At Maha Prasthanam Jubilee Hills, Know More Details Taraka Ratna Final Rites : తారకరత్న అంత్యక్రియలు ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/18/17959e23dccd9cc958a8a4d078e24bcc1676743613904313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కథానాయకుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ఎన్టీ రామారావు మనవడు నందమూరి తారక రత్న (Taraka Ratna) కన్ను మూశారు. బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రి నారాయణ హృదయాలయలో గత 23 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన... శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తారక రత్న మరణంతో నందమూరి, నారా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బెంగళూరు నుంచి హైదరాబాదుకు...
తారక రత్న పార్థీవ దేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాదుకు తరలించే ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. ఆదివారం ఉదయానికి భాగ్య నగరంలోని మోకిలాలో గల సొంత ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, పార్టీ టీడీపీ నేతలు, పలువురు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళులు అర్పించనున్నారు.
సోమవారం ఫిల్మ్ ఛాంబర్‌లో...
మోకిలాలోని ఇంటి నుంచి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఫిల్మ్ నగర్‌లో ఫిల్మ్ ఛాంబర్‌కు తారక రత్న భౌతిక కాయాన్ని తీసుకు రానున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ సభ్యులు, ప్రేక్షకుల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఫిల్మ్ నగర్ లోని మహాప్రస్థానానికి అంతిమ యాత్ర మొదలు కానుంది. అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Also Read : తారకరత్న ఫ్యామిలీ రేర్ ఫోటోలు - వైఫ్ అలేఖ్య, కుమార్తె నిష్కతో బాండింగ్ చూశారా?
తారకరత్న వయసు 39 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులో తిరిగిరాని లోకాలకు తారకరత్న వెళ్ళిపోవడం నందమూరి అభిమానులను, తెలుగు దేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలచివేస్తోంది. తాతయ్య ఎన్టీఆర్ నట వారసత్వం అందుకుని 2002లో తారక రత్న చిత్రసీమలోకి వచ్చారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా సుమారు 25 సినిమాలు చేశారు.
Also Read : తారకరత్న పెళ్ళి ఎంత సింపుల్‌గా జరిగిందో - అందుకే ఈ ఫొటోలే సాక్ష్యం
హీరోగా ఆశించిన రీతిలో తారక రత్న విజయాలు అందుకోలేదు. ప్రతినాయకుడిగా తొలి చిత్రం 'అమరావతి'తో నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు విరామం ఇచ్చారు. సినిమాల ఎంపికలో ఆయన ఆచితూచి అడుగులు వేసేవారు. గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ '9 అవర్స్'లో సీఐ రోల్ చేశారు. హీరోగా 'ఒకటో నంబర్ కుర్రాడు', 'యువ రత్న', 'భద్రాద్రి రాముడు', 'నందీశ్వరుడు' తదితర చిత్రాలు చేశారు. అయితే, ఇటీవల నటన కంటే ఎక్కువ రాజకీయాలపై దృష్టి పెట్టారు.
విజయ సాయి రెడ్డి మరదలి కుమార్తె అలేఖ్యా రెడ్డిను తారక రత్న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ అమ్మాయి ఉంది. పాప పేరు నిష్క. అలేఖ్యా రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్. తారకరత్న 'నందీశ్వరుడు' చిత్రానికి పని చేశారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువ గళం' పాదయాత్రలో పాల్గొనడానికి జనవరి 27న తారకరత్న కుప్పం వెళ్ళారు. అక్కడ లక్ష్మీపురంలో గల మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేష్ (Nara Lokesh) తో పాటు నందమూరి బాలకృష్ణతో పాటూ ఆయన కూడా పాల్గొన్నారు. మసీదు నుంచి త్వరగా బయటకు వచ్చిన తారకరత్న... కింద పడిపోయారు. చుట్టుపక్కల తెలుగు దేశం పార్టీ శ్రేణులు వెంటనే కుప్పంలో కేసీ ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అదే రోజు అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తీసుకు వెళ్ళారు. సుమారు 23 రోజులు మృత్యువుతో పోరాడిన ఆయన, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)