NBK For Skanda: రామ్ కోసం రంగంలోకి దిగనున్న బాలయ్య?
రామ్ - బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్కంద'. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ నెల 26న జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'స్కంద'. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, మాస్ మేకర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. తన హీరోలను మునుపెన్నడూ చూడని మాస్ గెటప్‌లలో ప్రెజెంట్ చేసే బోయపాటి.. ఈసారి రామ్ ని కూడా పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో చూపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రానున్న రోజుల్లో మరింత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేసిన మేకర్స్.. గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకకు రాబోయే గెస్టు గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది.
'స్కంద' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఆగస్టు 26న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమానికి నటసింహం నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్టుగా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. రామ్ డెబ్యూ మూవీ 'దేవదాస్' నుంచి పలు చిత్రాల వేడుకలకు బాలయ్య అథితిగా హాజరై, తన విషెస్ అందజేశారు. మరోవైపు బాలయ్యను బాబాయ్ అని పిలిచే రామ్ కూడా 'సింహా' సహా పలు సినిమా ఈవెంట్స్ కు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఇప్పుడు 'స్కంద' ట్రైలర్ లాంచ్ కు నటసింహ రానున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత బాబాయ్ - అబ్బాయి కలిసి ఒకే వేదికను పంచుకోబోతున్నారని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
Also Read: Mega156 - కల్యాణ్ కృష్ణతో పాటుగా తెర మీదకి మరో దర్శకుడు!
నిజానికి బాలయ్యతో హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను లకు మధ్య మంచి ర్యాపో ఉంది. వీరి మధ్య సాన్నిహిత్యం కారణంగానే తమ మూవీ రిలీజ్ ప్రీపోన్ చేసుకున్నారనే టాక్ ఉంది. ముందుగా 'స్కంద' చిత్రాన్ని దసరా పండక్కి విడుదల చేయాలని భావించారు. ఈ మేరకు పోస్టర్లు కూడా వదిలారు. అయితే బాలకృష్ణ నటిస్తున్న 'భగవంత్ కేసరి' సినిమాను అక్టోబర్ 19న విడుదల చేయాలని నిర్ణయించున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ - బోయపాటి తమ సినిమా విడుదల తేదీని సెప్టెంబర్ 15వ తేదీకి మార్చుకున్నారని టాక్. ఇందుకు గాను బాలయ్య ఇప్పుడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్టుగా రాబోతున్నారని అంటున్నారు.
'స్కంద' పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి దేశవ్యాప్తంగా దూకుడుగా ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే టీజర్ - టైటిల్ గ్లింప్స్‌కు అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన లభించింది. 'నీ చుట్టు చుట్టు', 'గండరబాయి' సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ నిర్వహించారు. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
జీ స్టూడియోస్ సౌత్ & పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో 'స్కంద' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భగవంత్ కేసరి' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ సోషల్ మీడియాలో సంచనలం సృష్టించగా, ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.
Also Read: వామ్మో! యంగ్ టైగర్ పెట్టుకున్న వాచ్ అన్ని కోట్లా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial