Nagababu Vs YCP Govt: పవన్ సినిమాపై వైసీపీ ప్రభుత్వం పగబట్టింది! ఇండస్ట్రీ నుంచి మద్దతు ఏది? చంపేస్తారా? - నాగబాబు సంచలన వ్యాఖ్యలు
'భీమ్లా నాయక్'లో పవన్ కల్యాణ్ హీరో కావడంతో వైసీపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్ సినిమాపై పగ పట్టిందని నాగబాబు వ్యాఖ్యానించారు.
టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని 'రిపబ్లిక్' వేడుకలో కల్యాణ్ బాబు (పవన్ కల్యాణ్) బాహాటంగా విమర్శించడంతో... పవన్ కల్యాణ్ సినిమాలపై ప్రభుత్వం వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నాగబాబు వ్యాఖ్యానించారు. 'వకీల్ సాబ్' నుంచి తాజాగా విడుదలైన 'భీమ్లా నాయక్' వరకూ జరిగిన పరిణామాలు చూస్తే అదే విధంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
"రిపబ్లిక్' వేడుకలో 'మీకు నాపై కోపం ఉంటే నా మీద తీర్చుకోండి. అంతే కానీ, ఇండస్ట్రీని మీ విధానాలతో ఇబ్బంది పెట్టకండి' అని ఓపెన్ గా మాట్లాడారు. ఏపీ మంత్రులు, కొంతమంది సినీ ప్రముఖుల నుంచి చాలా విమర్శలు వచ్చాయి. టికెట్ ధరల విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని గ్రహించిన పెద్దలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఫిబ్రవరి 20న జీవో వస్తుందన్నారు. కానీ, రాలేదు. కల్యాణ్ బాబు సినిమా (భీమ్లా నాయక్) 25న విడుదల అని ప్రకటన రాగానే ఆలస్యం చేశారు. పాత రేట్లు అమలు చేశారు. దీన్ని బట్టి పవన్ కల్యాణ్ అనే హీరోని టార్గెట్ చేశారని మాకు క్లియర్ కట్ గా అర్థం అయ్యింది" అని నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు.
పవన్ కల్యాణ్ వంటి హీరోకి ఈ విధంగా జరిగితే, సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని నాగబాబు ప్రశ్నించారు. ఇండస్ట్రీ నుంచి ఒకరిద్దరు ఇది సరికాదని చెప్పడం తప్ప పెద్దవాళ్ళు కల్యాణ్ బాబుకు మద్దతుగా మాట్లాడకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తోటి హీరోలు, దర్శకులు, నిర్మాతలు మాట్లాడితే చంపేస్తారా? అని ఆయన సూటిగా అడిగారు. అలాగే, వాళ్ళ భయాలను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలమన్నారు.
'భీమ్లా నాయక్' మాసివ్ హిట్ అయ్యింది కాబట్టి, ప్రజలు ఆదరించారు కాబట్టి సరిపోయిందని, లేదంటే నిర్మాత - పంపిణీదారులు నష్టపోయేవారని నాగబాబు వివరించారు. అదృష్టం కొద్దీ సినిమా భారీ విజయం సాధించిందని ఆయన అన్నారు. ఇవాళ కల్యాణ్ బాబుకు జరిగినట్టు రేపు మరొకరికి జరిగితే? ఇదే సమస్య మరొకరికి ఏ ప్రభుత్వం ద్వారా వచ్చినా? తాను గానీ, తన తమ్ముడు కల్యాణ్ అండగా ఉంటామని నాగబాబు తెలిపారు. 'మీరు మమ్మల్ని వదిలేసినా... మీకు మా సపోర్ట్ ఉంటుంది' అని చిత్ర పరిశ్రమ ప్రముఖులకు నాగబాబు చెప్పారు.
Also Read: పవన్ కల్యాణ్ - 'భీమ్లా నాయక్'పై మహేష్ ప్రశంసల జల్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'భీమ్లా నాయక్' సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లపై ప్రభుత్వ అధికారులు, పోలీసులు నిఘా పెట్టారనేది బహిరంగ రహస్యం. టికెట్ రేట్స్ ఎక్కువ అమ్మకుండా, అదనపు ఆటలు ప్రదర్శించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని కొందరు వీడియోలు తీసి పోస్ట్ చేశారు. 'భీమ్లా నాయక్' కంటే ముందు విడుదలైన సినిమాల విషయంలో చూసీ చూడనట్టు వ్యవహరించిన అధికార వైసీపీ ప్రభుత్వం, కేవలం పవన్ కల్యాణ్ సినిమా అనే కారణంతో 'భీమ్లా నాయక్' విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందనే విమర్శలు పవర్ స్టార్ అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. నాగబాబు కూడా అదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read: 'భీమ్లా నాయక్' రివ్యూ: కమర్షియల్ కిక్ ఇచ్చే నాయక్! సినిమా ఎలా ఉందంటే?