Naga Chaitanya Sobhita Wedding: ఈ రోజే నాగ చైతన్య - శోభిత పెళ్లి... ముహూర్తం, వేదిక నుంచి అతిథులు వరకు - ఈ వివరాలు తెల్సా?
Naga Chaitanya Sobhita Dhulipala Wedding: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నారు. ముహూర్తం నుంచి పెళ్లి వేదిక వరకు, ఇంకా అతిథుల వరకు... మీకు ఈ వివరాలు తెల్సా?
అక్కినేని కుటుంబం అంతా పెళ్లి సందడిలో మునిగింది. ఈ రోజు యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya) వివాహం శోభిత ధూళిపాళతో జరగనున్న సంగతి తెలిసిందే. అసలు వీళ్ళిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? వీళ్ళ పెళ్లి కథ ఏమిటి? పెళ్లి ముహూర్తం ఎన్ని గంటలకు? ఈ వివాహ వేడుకకు వచ్చే అతిథులు ఎవరు? అనేది తెలుసుకోండి.
రెస్టారెంట్ ఫోటో బయటకు వచ్చిన తర్వాత...
సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు నాగ చైతన్య ఒంటరిగా ఉన్నారు. ఆయన మళ్లీ ప్రేమలో పడతారని గానీ, మరొక వివాహం చేసుకుంటారని గానీ ఎవరు ఊహించలేదు. అయితే, ఒక రోజు లండన్ సిటీలోని ఒక రెస్టారెంట్ షెఫ్ చైతుతో దిగిన ఫోటో షేర్ చేశారు. అందులో శోభిత కనిపించడంతో అందరిలో అనుమానం మొదలైంది. నాగ చైతన్యతో శోభిత ఏం చేస్తున్నారు? అని! తర్వాత కొన్ని రోజులకు అనుమానం కాదని, వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నది నిజమే అని తెలిసింది.
ఆగస్టు 8న నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించిన నాగ్
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ప్రేమలో ఉన్న విషయం స్పష్టమైన తరువాత పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అసలు వీళ్ళిద్దరి బంధం పెళ్లి పీటల వరకు వెళుతుందా? లేదా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. నాగార్జున ప్రకటనతో వాటికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. తన కుమారుడు నాగ చైతన్యతో శోభిత నిశ్చితార్థం జరిగిందని ఆగస్టు 8న కింగ్ అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. అక్కినేని కుటుంబంలోకి శోభితను సాధారంగా ఆహ్వానించారు.
అక్టోబర్ 21న విశాఖలో మొదలైన పెళ్లి పనులు
శోభిత తల్లిది గుంటూరు జిల్లాలోని తెనాలి అయినప్పటికీ... తండ్రి నేవి ఆఫీసర్ కావడంతో విశాఖలో ఉన్నారు. విశాఖలో ఆమె కుటుంబం స్థిరపడింది. తండ్రి వేణుగోపాల రావు మర్చంట్ నేవీ ఇంజనీర్. ఆవిడ తల్లి కామాక్షి స్కూల్ టీచర్. అందుకని విశాఖలోనే శోభిత పెళ్లి పనులు మొదలుపెట్టారు. అక్టోబర్ 21న గోధుమ రాయి కట్టి పసుపు దంచారు. నవంబర్ 29న మంగళ స్నానం చేయించారు శోభిత, నాగ చైతన్యలకు. ఆ తరువాత రోజున పెళ్ళికొడుకు పెళ్ళి కుమార్తెను సిద్ధం చేశారు.
డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 8.13 గంటలకు...
వివాహం జరగడానికి ముందే శోభితకు అక్కినేని కోడలు హోదా కల్పించింది నాగార్జున కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ అవార్డు ఇచ్చిన సందర్భంలో కుటుంబం అంతా కలిసి దిగిన ఫోటోలో శోభితకు చోటు కల్పించింది. ఆ వేడుకకు వచ్చిన ప్రముఖులు అందరికీ శోభితను పరిచయం చేసింది అక్కినేని ఫ్యామిలీ.
డిసెంబర్ 4వ తేదీ... గురువారం సాయంత్రం 8.13 గంటలకు శుభ ముహూర్తంలో నాగ చైతన్య, శోభిత ఏడు అడుగులు వేయనున్నారు. అక్కినేని కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ ఈ వివాహానికి వేదిక కానుంది. స్టూడియోలోని నాగేశ్వరరావు విగ్రహం ముందు పెళ్లి మండపం సిద్ధం చేశారు. ఏఎన్ఆర్ ఆశీస్సులతో తమ కుమారుడి వివాహం జరిపించాలని నాగార్జున నిశ్చయించారు.
చైతన్య, శోభిత వివాహానికి వస్తున్నది ఎవరు?
నాగ చైతన్య, శోభిత వివాహానికి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా పలువురు రాజకీయ, సినిమా ప్రముఖులు హాజరు కానున్నట్లు సమాచారం. చైతన్య మేనమామలు సురేష్ బాబు, వెంకటేష్, బావ రానాతో పాటు అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు అతిథులను రిసీవ్ చేసుకోనున్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?