తప్పుగా అర్థం చేసుకున్నారు - పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నటుడు నాజర్ క్లారిటీ!
తమిళ సినిమాల్లో తమిళ ఆర్టిస్టులను మాత్రమే తీసుకోవాలని FEFSI నిబంధనలు జారీ చేసిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ వివరణ ఇచ్చారు.
తమిళ చిత్రాలలో తమిళ ఆర్టిస్టులు మాత్రమే నటించేలా ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. FEFSI ప్రెసిడెంట్ ఆర్.కె. సెల్వమణి నేతృత్వంలో ఈ నిబంధనలు తీసుకోబడ్డాయనే విషయం సినీ ఇండస్ట్రీలో వివాదానికి తెర లేపింది. దీనిపై ఇటీవల టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, తమిళ చిత్ర పరిశ్రమకు కొన్ని సలహాలు, సూచనలు చేయడంతో.. సినీ వర్గాల్లో ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు నడిగర్ సంఘం అధ్యక్షుడు, తమిళ నటుడు నాజర్ స్పందిస్తూ.. FEFSI మార్గదర్శకాలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. అసలు కోలీవుడ్ లో అలాంటి నిబంధనలు ఎక్కడా లేవని క్లారిటీ ఇచ్చారు.
నాజర్ మాట్లాడుతూ “ప్రస్తుతం మీడియాలో ఓ సమాచారం తప్పుగా ప్రచారం అవుతోంది. తమిళ చిత్ర పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన నటీనటులు పని చేయకూడదనే నిబంధనలు పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఇది చాలా రాంగ్ స్టేట్మెంట్.. తప్పుగా అన్వయించబడింది. తమిళ్ ఇండస్ట్రీలో అలాంటి నిబంధనలు తీసుకొస్తే, దానికి వ్యతిరేకంగా గళం విప్పే మొదటి వ్యక్తి నేనే అవుతాను. మనం ఇప్పుడు పాన్ ఇండియన్ చిత్రాలు, గ్లోబల్ ఫిలిమ్స్ యుగంలో ఉన్నాము. ఇక్కడ మనకు ఇతర పరిశ్రమల నుండి ప్రతిభావంతులైన యాక్టర్స్ అవసరం. ఈ పరిస్థితిలో ఎవరూ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు'' అని అన్నారు.
Read Also: 1000 మంది డ్యాన్సర్లతో షారుఖ్ ఆట - ‘జవాన్’ పాటకు పెట్టిన ఖర్చుతో 2 చిన్న సినిమాలు తీయొచ్చు!
“తమిళ చలనచిత్ర పరిశ్రమలోని కార్మికులను రక్షించడానికి, సెల్వమణి గారు కొన్ని సూచనలు చేసారు. తమిళనాడు సరిహద్దుల్లో నిర్మించబడే చిత్రాలలో తమిళ టెక్నీషియన్లు పెట్టుకోమని సూచించారు. ఇది కార్మికుల హక్కులు మరియు రక్షణ గురించి మాత్రమే కానీ, ఇది టాలెంట్ గురించో యాక్టర్స్ గురించో కాదు. తమిళ్ ఇండస్ట్రీలో ఇతర పరిశ్రమలకు చెందిన ప్రతిభావంతులను ప్రోత్సహించడం, వారిని ఆహ్వానించడం, ప్రేమించడం, గౌరవించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఎస్వీ రంగారావు గారి నుండి సావిత్రి గారు, వాణిశ్రీ వరకు మనకు అలాంటి సంప్రదాయం ఉంది. కాబట్టి ఈ సమాచారాన్ని సీరియస్‌గా తీసుకోకండి. అందరం కలిసి గొప్ప సినిమాలు తీద్దాం.. వాటిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్దాం'' అని నాజర్ పేర్కొన్నారు.
కాగా, ఇటీవల 'బ్రో' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ FEFSI నిబంధనలను ఖండించారు. ''తమిళ చిత్ర పరిశ్రమ తమిళ వాళ్ళకే అంటే ఇండస్ట్రీ ఎదగదు. ఈరోజు తెలుగు చిత్రసీమలో అన్ని భాషల నుంచి వచ్చిన వాళ్ళను తీసుకుంటున్నాం. కేరళ నుంచి వచ్చిన సినిమాటోగ్రాఫర్ సుజీత్ వాసుదేవన్, నార్త్ నుంచి వచ్చిన ఊర్వశి రౌతేలా, విభజన సమయంలో పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా లను మేం తీసుకున్నాం. అన్ని భాషలు, అన్ని కలయికలు ఉంటే సినిమా అవుతుంది తప్ప, కేవలం మన భాష వాళ్ళు మాత్రమే ఉండాలని అంటే కుంచించుకుపోతాం'' అని పవన్ అన్నారు. అలాంటి భావన నుంచి బయటకు వచ్చి 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాలు తీయాలని, ప్రపంచ ప్రఖ్యాత సినిమాలు తమిళ ఇండస్ట్రీ నుంచి రావాలని తాను కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు. ఒకవేళ తమిళనాడులో స్థానిక కార్మికులకు సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కరించాలని, వాళ్ళకు ఉపాధి దొరకాలని, పరిష్కారం కోసం మరో ఉపాయం ఆలోచించాలని కోలీవుడ్ పెద్దలకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
Read Also: వాస్తవ సంఘటన ఆధారంగా వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ 'మట్కా'
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial