VT14 - Matka Movie : వాస్తవ సంఘటన ఆధారంగా వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ 'మట్కా' - పూజతో మొదలు
'పలాస' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రానికి 'మట్కా' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. తాజాగా మేకర్స్ టైటిల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ (Varun Tej)... తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతున్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలు, విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నారు. ఓ వైపు క్లాస్, మరోవైపు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న మెగా ప్రిన్స్... తాజాగా మరో కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది అతని కెరీర్ లో 14వ చిత్రం. ఈ ప్రాజెక్ట్ ని ఈరోజు గురువారం పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసారు. #VT14 చిత్రానికి 'మట్కా' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సందర్భంగా టైటిల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మేకర్స్... ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు.
'మట్కా' అనేది 1958 - 1982 మధ్య కాలంలో వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేయబడిన పీరియాడిక్ మూవీ. యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టైటిల్ పోస్టర్ ను గమనిస్తే, 1975 సంవత్సరం నాటి రూపాయి నాణెం, కొన్ని కరెన్సీ నోట్లు, పాతకాలపు కారు, 1930లో కట్టిన పురాతన ఇల్లు, వార్తాపత్రికలు కనిపిస్తాయి. వింటేజ్ వైబ్ కలిగిస్తున్న ఈ టైటిల్ పోస్టర్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది.
Read Also: ఆరేళ్లుగా బిగ్ స్క్రీన్ పై కనిపించని ఇద్దరు టాలెంటెడ్ హీరోలు, ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారా?
'మట్కా' మూవీలో వరుణ్ తేజ్ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. అంతేకాదు అతను మొత్తం నాలుగు విభిన్న గెటప్‌లలో కనిపిస్తాడని టాక్. ఇందులో వరుణ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్రలో నటించడమే కాదు, స్పెషల్ సాంగ్ లో ఆడిపాడనుంది. నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
'మట్కా' పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'హాయ్ నాన్న' తర్వాత వీరి ప్రొడక్షన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చనున్నారు. ప్రియా సేత్ సినిమాటోగ్రఫీ అందించే ఈ చిత్రానికి కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు.
'పలాస 1978', 'శ్రీదేవి సోడా సెంటర్' వంటి వైవిధ్యమైన సినిమాలతో కరుణ కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ తో కూడా సరికొత్త కథాంశంతో సినిమా చేయబోతున్నారు. మరోవైపు వరుణ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. అలానే శక్తి ప్రతాప్ సింగ్ అనే డెబ్యూ డైరెక్టర్ తో VT13 సినిమా చేస్తున్నారు. 2019 పాకిస్తాన్ బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియా దాడుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోందని టాక్. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ & రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Also: 1000 మంది డ్యాన్సర్లతో షారుఖ్ ఆట - ‘జవాన్’ పాటకు పెట్టిన ఖర్చుతో 2 చిన్న సినిమాలు తీయొచ్చు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial