Mission Impossible:'మిషన్: ఇంపాజిబుల్' సినిమాల్లోని ఈ ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఏయే దేశాల్లో చిత్రీకరించారో తెలుసా?
‘మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకొనింగ్ పార్ట్-1’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో MI సిరీస్ లో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లోని ఐకానిక్ సీన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
యాక్షన్ ప్రియులను విశేషంగా అలరించే స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలలో ‘మిషన్: ఇంపాజిబుల్’ సిరీస్ ఒకటి. భారీ యాక్షన్ సీన్లు, ఒళ్లు గగుర్పొడిచే ఛేజింగ్‌లు, థ్రిల్లింగ్ సన్నివేశాలతో తెరకెక్కించే ఈ గూఢచారి సినిమాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తాయి. ఇందులో హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ సిరీస్‌లో 6 సినిమా రాగా, ఆఖరి చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించారు. వాటిలో మొదటి భాగం ‘మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకొనింగ్ పార్ట్-1’ పేరుతో ఇటీవలే విడుదలైంది.
‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్‌లో భాగంగా వచ్చిన 'డెడ్ రెకొనింగ్ పార్ట్ 1' మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. స్పై ఏజెంట్ ఈథన్ హంట్ గా టామ్ క్రూజ్ చేసిన అద్భుతమైన విన్యాసాలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నిజానికి ఈ పాత్రలో క్రూజ్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఎందుకంటే ఈ సిరీస్ కోసం ఆయన తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేస్తున్న సాహసాలు సినీ చరిత్రలో నిలిచిపోతాయి. ముఖ్యంగా 61 ఏళ్ల వయసులో లేటెస్ట్ మిషన్ కోసం టామ్ చేసిన రిస్కీ స్టంట్స్ చూస్తే, ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మిషన్ ఇంపాజిబుల్ లలో క్రూజ్ చేసిన హెల్ రైజింగ్ స్టంట్స్, బంగీ జంప్ లేదా ఫ్రీ ఫాల్ వంటి రిస్కీ సాహసాలను అనేక ఐకానిక్ నగరాలు, ఆకట్టుకునే ప్రదేశాలలో చిత్రీకరించారు. MI సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకూ వచ్చిన 7 సినిమాలు, అవి చిత్రీకరించిన లొకేషన్స్ ఏంటో చూద్దాం.
'మిషన్: ఇంపాజిబుల్' (1996)
'మిషన్: ఇంపాజిబుల్' సిరీస్ లో మొదటి సినిమా 1996లో వచ్చింది. 1966లో బ్రూస్ గెల్లర్ రూపొందించిన మిషన్ టీవీ సిరీస్ ఆధారంగా తెరకెక్కింది. దీనికి బ్రియాన్ డిపాల్మా దర్శకత్వం వహించారు. హీరో టామ్ క్రూజ్ అన్ని సినిమాల నిర్మాణంలోనూ భాగం పంచుకున్నారు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ భాగం చెక్ రిపబ్లిక్ క్యాపిటల్ సిటీ ప్రేగ్ లో జరిగింది. హైలైట్ గా నిలిచిన ఎంబసీ డూమ్డ్ మిషన్ సన్నివేశాలను నగరంలోని అత్యంత ఆకర్షణీయమైన భవనాలలో ఒకటైన లీచ్‌టెన్‌స్టెయిన్ ప్యాలెస్ మరియు నరోడ్నీ మ్యూజియంలలో చిత్రీకరించారు. 80 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 457.7 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది.
'మిషన్: ఇంపాజిబుల్ II' (2000)
'మిషన్: ఇంపాజిబుల్ 2' చిత్రానికి జాన్ వూ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో క్రూజ్ చేసిన రాక్ క్లైంబింగ్ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉటాలోని ఐకానిక్ డెడ్ హార్స్ పాయింట్ స్టేట్ పార్క్‌లో ఈ సన్నివేశాన్ని షూట్ చేసారు. రోప్స్ సపోర్ట్ తీసుకున్నప్పటికీ, ఈ రిస్కీ స్టంట్ లో ప్రతీ షాట్ ఎలాంటి డూప్ సహాయం లేకుండా టామ్ క్రూజ్ రియల్ గా చేసారు. దాదాపు 120–125 మిలియన్ డాలర్లతో తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్, దాదాపు 546.4 మిలియన్ డాలర్ల వరకూ వసూలు చేసింది.
'మిషన్: ఇంపాజిబుల్ III' (2006)
'మిషన్: ఇంపాజిబుల్ 3' చిత్రానికి J. J. అబ్రమ్స్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఒక సీన్ కోసం టామ్ షాంఘైలో 55 అడుగుల ఎత్తు ఉన్న బ్యాంక్ ఆఫ్ చైనా బిల్డింగ్ పై నుంచి దూకాడు. అలానే ల్యాండింగ్‌కు ముందు ఒక కేబుల్ ద్వారా పక్కనే ఉన్న బోకామ్ ఫైనాన్షియల్ టవర్స్ కిటికీ నుండి జారిపడే సీన్ అందరినీ అబ్బురపరుస్తుంది. ఇది టామ్ క్రూజ్ చేసిన లైఫ్ రిస్కీ స్టంట్స్ లో ఒకటని చెప్పొచ్చు. 150–186 మిలియన్ డాలర్లతో రోపొందించిన ఈ సినిమా, 398.5 మిలియన్ డాలర్స్ రాబట్టగలిగింది.
Read Also: బాలయ్య Vs రవితేజ Vs విజయ్ - ఈసారి బాక్సాఫీస్ బరిలో నిలిచేదెవరు? గెలిచేదెవరు?
'మిషన్: ఇంపాజిబుల్ - ఘోస్ట్ ప్రోటోకాల్' (2011)
MI సిరీస్ లో వచ్చిన నాల్గవ చిత్రం 'మిషన్: ఇంపాజిబుల్ - ఘోస్ట్ ప్రోటోకాల్'. ఇందులో టామ్ క్రూజ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్ బుర్జ్ ఖలీఫాను ఎక్కే సీన్ చరిత్రలోనే నిలిచిపోతుంది. ఫ్రాంచైజీని ఒక మెట్టు పైకి తీసుకువెళ్లిన ఘనత సాధించారు. అలానే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఇండియాలో షూట్ చేసారు. మైఖేల్ నిక్విస్ట్ కర్ట్ హెండ్రిక్స్‌ను టామ్ ఛేజ్ చేసే సీన్ ను ముంబైలో తీశారు. బ్రాడ్ బర్డ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి దాదాపు 145 మిలియన్ డాలర్లు ఖర్చు అయింది. ఇది బాక్సాఫీస్ వద్ద 694.7 మిలియన్ డాలర్లు ఖర్చు వసూలు చేయగలిగింది.
'మిషన్: ఇంపాజిబుల్ - రోగ్ నేషన్' (2015)
మిషన్: ఇంపాజిబుల్ సిరీస్ లో 5వ సినిమా 'రోగ్ నేషన్'. ఇందులో కొన్ని కీలకమైన సన్నివేశాలను లండన్ లో షూట్ చేసారు. హార్డ్ డ్రైవ్ డేటా సీక్రెట్ హ్యాండ్‌ఓవర్ సీన్ ను సౌత్ లండన్‌లోని బ్రోంప్టన్ స్మశానవాటికలో చిత్రీకరించారు. ఇది 18వ శతాబ్దానికి చెందిన అత్యంత పురాతనమైన స్మశానవాటిక. దీంట్లో 35,000 స్మారక చిహ్నాలు, సమాధులు ఉన్నాయి. 150 మిలియన్ డాలర్లతో తీసిన ఈ స్పై థ్రిల్లర్, 682.7 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రానికి క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించారు.
'మిషన్: ఇంపాజిబుల్ - ఫాల్అవుట్' (2018)
MI సిరీస్ లో వచ్చిన 6వ చిత్రం 'మిషన్: ఇంపాజిబుల్ - ఫాల్అవుట్'. ఇది ఈ ప్రాంచైజీలో బెస్ట్ మూవీగా, అత్యుత్తమ యాక్షన్ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్యారిస్, న్యూజిలాండ్, లండన్ లలో షూటింగ్ చేసారు. ఇందులో టామ్ క్రూజ్ - హెన్రీ కావిల్ మధ్య ఛేజ్, రూఫ్ టాప్ చేజ్ సీన్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ చిత్రానికి కూడా క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వచ్చిన మిగతా సినిమాలను కూడా ఆయనే తెరకెక్కించారు.
'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' (2023)
'మిషన్: ఇంపాజిబుల్' సిరీస్ లో లేటెస్టుగా వచ్చిన చిత్రమిది. ఇందులోని యాక్షన్ సీన్స్, ఛేజింగ్‌లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా టామ్ క్రూజ్ చేసిన ఎయిర్ పోర్ట్ చేజ్ సీన్ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. దీన్ని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తీశారు. అలానే నమ్మశక్యం కాని మోటార్ సైకిల్ జంప్ సీన్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. 61 ఏళ్ల క్రూజ్ కెరీర్ లోనే కాదు, సినిమా చరిత్రలో ఇది అతిపెద్ద లైఫ్ రిస్క్ స్టంట్ అని చెప్పాలి. క్రూజ్ ఎత్తైన పర్వత ప్రదేశంలో స్కీ స్లోప్ మీద బైక్ నడుపుతూ, అక్కడి నుంచి జంప్ చేసి పారాచూట్ సహాయంతో నేలపైకి వచ్చే సన్నివేశం అది.
బైక్ జంప్ సీన్ ప్రిపరేషన్ కోసం టామ్ క్రూజ్ ముందుగా 500 టెస్ట్ స్కైడైవ్‌లు, 13,000 మోటార్ సైకిల్ జంప్స్ చేసారు. అంతేకాదు షూటింగ్ కు వెళ్లిన తర్వాత ఆ సీన్ కోసం పెద్ద స్కీ స్లోప్ మీద 6 సార్లు బైక్ నడిపాడు. నార్వేలోని హెల్ సెట్ కోపెన్‌లోని లొకేషన్‌లో చిత్రీకరించబడిన ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోని టామ్ క్రూజ్ ఆ మధ్య సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాంటి రిస్కీ స్టంట్స్ చేసాడు కాబట్టే, ఇప్పుడు 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ 1' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'M:I 8' (మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ 2) వచ్చే ఏడాది 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇకపోతే MI సిరీస్ లో వచ్చిన ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘మిషన్ ఇంపాజిబుల్ 2’, ‘మిషన్ ఇంపాజిబుల్ 3’, ‘ఎంఐ: ఘోస్ట్ ప్రోటోకాల్’, ‘ఎంఐ: రోగ్ నేషన్’, ‘ఎంఐ: ఫాల్ అవుట్’ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. దాదాపు అన్ని చిత్రాలకూ తెలుగు వెర్షన్ ఆడియో అందుబాటులో ఉంది. సో టామ్ క్రూజ్ యాక్షన్ ను ఇష్టపడే ప్రేక్షకులు థియేటర్లలో 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెకనింగ్ పార్ట్ 1' తో పాటుగా ఓటీటీలో ఈ సినిమాలను కూడా చూసెయ్యెచ్చు.
Read Also: భయపెడుతోన్న ప్రభాస్, అయోమయంలో యశ్ - పాన్ ఇండియా స్టార్స్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial