Happy Birthday Ram Charan: 'మెగా పవర్ స్టార్' నుంచి 'గ్లోబల్ స్టార్' వరకూ - చిరును మించిన చెర్రీ, అదొక్కటే మిగిలి ఉంది!
చిరంజీవి వారసుడగా వచ్చాడు. ఇప్పుడు.. మెగా అభిమానుల మనసు దోచి, తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు రామ్ చరణ్. ఇక హాలీవుడ్ ఛాన్సు కూడా వచ్చేస్తే.. చిరంజీవి చిరకాల స్వప్నం నెరవేరినట్లే.
తన కొడుకు తనను మించినవాడైతే ఏ తండ్రికి సంతోషం ఉండదు చెప్పండి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆస్కార్ వరకు వెళ్లొచ్చిన రామ్ చరణ్‌ను చూసి.. మెగా అభిమానులు తెగ మురిసిపోయారు. త్వరలో ఓ హాలీవుడ్ మూవీలో కూడా చెర్రీ నటించబోతున్నాడని తెలియగానే.. వారి ఆనందానికి అవధుల్లేవు. తండ్రి బాటలో సినీ రంగంలోకి అడుగు పెట్టినా.. ఆయనకు మించి పాపులారిటీతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగి.. మెగా వారసుడిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించిన చరణ్‌ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. 'మెగా పవర్ స్టార్' గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. యాక్టింగ్ - ఫైట్స్ - డ్యాన్స్ - డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతీ దాంట్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అవతరించిన చెర్రీ.. నేడు తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి ఒకసారి చూద్దాం!
కొణిదెల చిరంజీవి, సురేఖ దంపతులకు మూడో సంతానంగా 1985 మార్చి 27న మద్రాస్ లో జన్మించారు రామ్ చరణ్. అందరూ ముద్దుగా చెర్రీ అని పిలుస్తుంటారు. మొదట చెన్నైలో స్కూలింగ్ చేసిన ఆయన.. ఆ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెయింట్ మేరీస్ కాలేజీలలో చదువు కొనసాగింది. తండ్రితో పాటుగా బాబాయిలు కూడా హీరోలుగా నటిస్తుండటం, మరోవైపు తన అమ్మ తరపు ఫ్యామిలీ కూడా ఇండస్ట్రీలో ఉండటంతో.. చిన్నప్పటి నుంచే చరణ్ కు సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ముంబైలోని కిశోర్ నమిత్ కపూర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఇదే క్రమంలో తన 23వ ఏట హీరోగా టాలీవుడ్ లో లాంచ్ అయ్యాడు.
2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'చిరుత' సినిమాతో హీరోగా రామ్ చరణ్ హీరోగా పరిచయమయ్యాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించి, మెగా వారసుడి మొదటి అడుగు సక్సెస్ ఫుల్ గా పడేలా చేసింది. ఇక రెండో సినిమాకే ఇండస్ట్రీ రికార్డ్ అందుకున్నాడు చరణ్. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన 'మగధీర' చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
అయితే మూడో సినిమా 'ఆరెంజ్' తో చెర్రీ తొలి పరాజయాన్ని చవిచూశాడు. ఆ తర్వాత వచ్చిన 'రచ్చ' 'నాయక్' చిత్రాలు కమర్షియల్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలో 2013లో 'జంజీర్' (తెలుగులో ‘తుఫాన్’) వంటి హిందీ రీమేక్ సినిమాతో నేరుగా బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. కానీ ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడమే కాదు, హిందీ జనాలు చరణ్ ను ట్రోల్ చేసేలా చేసింది. దీంతో కొన్నేళ్ళపాటు మళ్లీ బాలీవుడ్ వైపు చూడలేదు.
ఇక 'ఎవడు' 'ధృవ' సినిమాలతో విజయాలు సాధించిన రాంచరణ్.. 'గోవిందుడు అందరివాడేలే' 'బ్రూస్లీ: ది ఫైటర్' వంటి ఫ్లాప్స్ అందుకున్నాడు. అయినా సరే ఏమాత్రం నిరుత్సాహ పడకుండా, 'రంగస్థలం' చిత్రంతో తన సత్తా ఏంటో బాక్సాఫీస్ కు చూపించాడు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడమే కాదు.. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే వెంటనే వచ్చిన 'వినయ విధేయ రామ' వంటి భారీ పరాజయం పలకరించింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న చెర్రీ.. 'ఆర్.ఆర్.ఆర్' తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలసి రామ్ చరణ్ నటించిన RRR సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో మెగా వారసుడు సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. 'జంజీర్' వంటి క్లాసిక్ ను చెడగొట్టాడని విమర్శించిన బాలీవుడ్ జనాల నోళ్ళతోనే.. ఈసారి శభాష్ అనిపించుకున్నాడు.
RRR చిత్రం గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తర్వాత రాంచరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు వెళ్ళిపోయింది. అదే ఆయన్ని అంతర్జాతీయ వేదికల వరకూ తీసుకెళ్ళింది.. గ్లోబల్ స్టార్ గా మార్చేసింది. రామారాజుగా ఆయన నటనకు పలువురు హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. నాటు నాటు స్టెప్పులకు వెస్టర్న్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలో పలు ఇంటర్నేషనల్ అవార్డుల స్టేజీల మీద మెరిసిన చెర్రీ.. 'నాటు నాటు' పాటకు ఆస్కార్ వరించడంతో ప్రతిష్టాత్మక అకాడెమీ పురస్కారాల్లోనూ భాగమయ్యాడు.
ప్రస్తుతం యావత్ సినీ అభిమానులతో ప్రశంసలు అందుకుంటున్న చరణ్.. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన శంకర్ సినిమాలో నటిస్తున్నాడు. బుచ్చిబాబుతో ఓ పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేశాడు. అలానే ఓ హలీవుడ్ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నాడు. త్వరలోనే మెగా హీరో ఇంటర్నేషనల్ డెబ్యూ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇకపోతే హీరోగానే కాకుండా నిర్మాతగానూ చరణ్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి, తన తండ్రితో సినిమాలు నిర్మిస్తున్నాడు. చిరుతో కలసి 'మగధీర' 'బ్రూస్లీ' 'ఖైదీ నెం.150' వంటి చిత్రాల్లో కాసేపు కనిపించిన చిరుత.. 'ఆచార్య' చిత్రంలో తొలిసారి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కాకపోతే ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం ఫ్యాన్స్ తో పాటుగా తండ్రీకొడుకులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
దాదాపు 16 ఏళ్ల సినీ కెరీర్ లో రామ్ చరణ్ ఎన్నో హిట్లు అందుకున్నాడు.. పరాజయాలు కూడా చవిచూశాడు. అయినప్పటికీ కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో పలు అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రెండు నంది అవార్డులతో పాటుగా మూడు ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. RRR చిత్రానికి గాను క్రిటిక్స్ చాయిస్ సూపర్ అవార్డుతో పాటుగా, హలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్ లైట్ అవార్డ్ అందుకున్నాడు చెర్రీ.
ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే, 2012లో తన స్నేహితురాలు ఉపాసన కామినేనిని ప్రేమ వివాహం చేసుకున్నాడు చరణ్. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. అందుకే ఈ బర్త్ డే మరింత ప్రత్యేకంగా మారింది. మెగా అభిమానులు గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా వారసుడి పుట్టిన రోజును సెలబ్రేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో #HBDGlobalStarRamCharan అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ కెరీర్ ఇలానే సక్సెస్ ఫుల్ గా సాగాలని.. మున్ముందు ఇంకా ఎన్నో మైలురాళ్ళు అధిగమించాలని కోరుకుంటూ 'ABP దేశం' ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తోంది. హ్యాపీ బర్త్ డే టూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..!