(Source: ECI/ABP News/ABP Majha)
Ivana Telugu Debut : తెలుగులో బుజ్జి కన్నా - నిర్మాత తనయుడితో 'లవ్ టుడే' హీరోయిన్
తమిళ సినిమా 'లవ్ టుడే' తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ఆ మూవీలో నటించిన ఇవానా ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తున్నారు.
తెలుగు, తమిళం అని భాషా పరమైన తేడాలు లేవ్... ప్రేక్షకులు అందరినీ 'లవ్ టుడే' సినిమా ఆకట్టుకుంది. భారీ వసూళ్లు సాధించింది. అందులో కథానాయికగా నటించిన అమ్మాయి గుర్తు ఉందా? అసలు పేరు ఇవానా (Ivana Love Today Heroine). అయితే... బుజ్జి కన్నా పాప అంటే ఎక్కువ మంది గుర్తు పడతారు ఏమో!? ఇప్పుడు ఆ అమ్మాయి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అదీ ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సోదరుడు శిరీష్ కుమారుడి సినిమాతో!
ఆశిష్ జోడీగా ఇవానా!
'రౌడీ బాయ్స్' సినిమాతో నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు రెండో సినిమా 'సెల్ఫిష్' చేస్తున్నారు. అందులో ఇవానా హీరోయిన్!
Ivana to romance Asish In Selfish Movie : ఆశిష్ కథానాయకుడిగా విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న సినిమా 'సెల్ఫిష్'. 'దిల్' రాజు (Dil Raju), శిరీష్ నిర్మాతలు. ఇందులో చిత్ర పాత్రలో ఇవానా నటిస్తున్నారు. ఈ రోజు ఆ అమ్మాయి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆమె వెనుక ఆశిష్ కూడా కనిపించారు.
పాతబస్తీ నేపథ్యంలో...
''నా పోరి ‘చైత్ర’ ని రిజర్వేషన్ చేషినా'' అంటూ ఇవానా, ఆశిష్ ఫోటోను 'సెల్ఫిష్' చిత్ర బృందం విడుదల చేసింది. ఆ లుక్ చూస్తే... ఇవానా మెడలో ఉన్న ఐడీ కార్డు చూస్తే... ఆమె ఫైనాన్సియల్ ఎనలిస్ట్ ఉద్యోగం చేస్తున్నట్లు అర్థం అవుతోంది. ఈ సినిమా పాతబస్తీ నేపథ్యంలో జరుగుతుందని తెలిసింది. ఆశిష్ గిరజాల జుట్టు, గడ్డంతో కనిపించారు. సెల్ఫిష్ ఓల్డ్ సిటీ కుర్రాడిగా ఆయన క్యారెక్టర్ ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. అతను జీవితంలోని తీపిని మాత్రమే కోరుకునే వ్యక్తి.
ప్రస్తుతం 'సెల్ఫిష్' చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతోంది. పాతబస్తీలో ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.
Also Read : సల్మాన్ మార్కెట్ పదేళ్ళు వెనక్కి - ఫస్ట్ డే మరీ ఇంత ఘోరమా!?
View this post on Instagram
'దిల్' రాజు మాట్లాడుతూ "మా ఆశిష్ 'రౌడీ బాయ్'తో నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాం. సుకుమార్, నేను 'ఆర్య' సినిమాకు పని చేశాం. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాం. 'ఆర్య' తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు 'సెల్ఫిష్'కు పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఐడియా విన్నప్పుడు బాగా నచ్చింది. మనం సినిమా చేద్దామని కాశీకి చెప్పా. 'రౌడీ బాయ్స్' విడుదలకు ముందు నుంచి 'సెల్ఫిష్' స్క్రిప్ట్ వర్క్ చేశాం" అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మణికందన్ .ఎస్, సంగీతం: మిక్కీ జే. మేయర్, సాహిత్యం: చంద్రబోస్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి.
Also Read : పాపం పూజా హెగ్డే - ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్