Vasthavvam Movie: ఓయో రూములు దొరకలేదా - పెళ్లికి ముందు ఏకాంతంగా గడుపుతున్న ప్రేమ జంట రౌడీలకు చిక్కితే?
మేఘశ్యాం, రేఖ నిరోష జంటగా రూపొందిన లవ్ రొమాంటిక్ థ్రిల్లర్ 'వాస్తవం'. త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల టీజర్ విడుదల చేశారు.
'మనం ఇద్దరం కలిసి బయటకు వెళ్లి సిటీ మొత్తం జాలీగా తిరిగొద్దామా?' - అమ్మాయి ప్రశ్న. 'డేట్ అడుగుతున్నావా?' - అబ్బాయి బదులు. 'దానికి నువ్వు ఏ పేరు అయినా సరే పెట్టుకో! మనిద్దరం బయటకు వెళ్లాలి. అది కూడా పెళ్లికి ముందు' అని అమ్మాయి ఆర్డర్ వేసింది. ఆమె కోరిక తీర్చడానికి అబ్బాయి అంగీకరించాడు. పెళ్లికి ముందు ఇద్దరూ సిటీకి దూరంగా వెళ్లారు. ఏకాంతంగా గడుపుతున్న సమయంలో అల్లరి మూక చేరింది.
'ఏం చేస్తున్నావ్ రా అమ్మాయిని వేసుకుని సిటీకి ఇంత దూరంలో! ఓయో రూములు దొరకలేదా? లేదంటే పైసలు లేవా?' అని హీరోని అడిగాడో రౌడీ. అక్కడ గొడవ జరిగింది. ఆ తర్వాత ఏమైంది? అనేది చూడాలంటే 'వాస్తవం' థియేటర్లలోకి రావాలి. మేఘశ్యాం, రేఖ నిరోష జంటగా నటించిన చిత్రమిది. అంజని సూట్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య ముద్గల్ నిర్మించారు. జీవన్ బండి దర్శకత్వం వహించారు. పీఆర్ సంగీతం అందించారు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదల చేశారు. దానికి మంచి స్పందన వస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది.
లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ ఇది!
లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ సినిమా 'వాస్తవం' అని దర్శక నిర్మాతలు చెప్పారు. నిర్మాత ఆదిత్య ముద్గల్ మాట్లాడుతూ... ''మేం ఇష్టంతో చాలా కష్టపడి తీసిన చిత్రమిది. దర్శకుడు జీవన్ చెప్పిన కథ, తీసిన విధానం బాగుంది. హీరో హీరోయిన్లు చాలా బాగా నటించారు. పి.ఆర్ (పెద్దపల్లి రోహిత్) అందించిన సంగీతానికి మంచి స్పందన లభిస్తోంది. సినిమా సక్సెస్ అవ్వాలని, ప్రేక్షకుల ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నా'' అని అన్నారు. సిటీకి దూరంగా వెళ్లిన ప్రేమ జంటకు రౌడీల నుంచి ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? అనేది కథాంశం అని తెలుస్తోంది.
దర్శకుడు జీవన్ బండి మాట్లాడుతూ... ''నేను చెప్పిన కథను, నన్ను నమ్మి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన ఆదిత్య గారికి స్పెషల్ థాంక్స్. 'వాస్తవం'లో ప్రతి చిన్న క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు నాకు చాలా సపోర్ట్ చేశారు. పీఆర్ మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. కచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుంది'' అని అన్నారు.
Also Read: బ్రహ్మానందం కమెడియన్ కాదు... అంతకు మించి - ఆయనకు నవ్వించడమే కాదు... కంటతడి పెట్టించడమూ వచ్చు!
హీరో మేఘశ్యాం మాట్లాడుతూ... ''నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కాలేజ్ రోజుల నుంచి థియేటర్ ఆర్ట్స్ స్టార్ట్ చేశా. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నా. కథ నుంచి డీవియేట్ అవ్వకుండా దర్శకుడు జీవన్ గారు సినిమా తీశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత ఆదిత్య గారికి, దర్శకుడికి థాంక్స్'' అని అన్నారు. హీరోయిన్ రేఖ నిరోషా మాట్లాడుతూ... ''మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. చాలా కష్టపడి సినిమా తీశాం. అందరికీ నచ్చుతుంది. అతి త్వరలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాం'' అని చెప్పారు.