Lokah Row: కన్నడిగులకు క్షమాపణలు చెప్పిన దుల్కర్ సల్మాన్, వివాదాన్ని రేకెత్తించిన డైలాగ్ ఇదే!
Dulquer Salmaans: నిర్మాత దుల్కర్ సల్మాన్, వేఫేరర్ ఫిల్మ్స్ క్షమాపణలు చెప్పారు. సినిమా నుంచి ఆ డైలాగ్ తొలగిస్తామని హామీ ఇచ్చారు. అసలేం జరిగిందంటే...

Dominic Arun’s Lokah: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. మహానటితో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్.. ఈ మధ్య వరుస హిట్స్ తో జోరుమీదున్నాడు. లక్కీ భాస్కర్ తో క్రేజీ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. దుల్కర్ నిర్మించిన మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోకా: చాప్టర్ 1 చంద్రలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా సూపర్ హీరో స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది...కానీ..ఓ డైలాగ్ కారణంగా ఈ మూవీపై వివాదం చెలరేగింది. దీనిపై స్పందించిన నిర్మాత దుల్కర్ సల్మాన్ , ఆయన నిర్మాణ సంస్థ వేఫారర్ ఫిల్మ్స్ బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటూ ఆ డైలాగ్ ను సినిమా నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు.
వివాదాన్ని రేపిన డైలాగ్ ఇదే
లోకా సినిమాలో విలన్ ఇన్స్పెక్టర్ నాచియప్ప గౌడ పాత్రలో కనిపించిన నటుడు సాండీ చెప్పిన డైలాగ్ కారణంగా ఈ వివాదం మొదలైంది. ఒక సన్నివేశంలో, బెంగళూరుకు చెందిన ఒక మహిళను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను తిరస్కరిస్తూ, "నేను పెళ్లి చేసుకోనని చెప్పడం లేదు. కానీ నేను ఈ నగరానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోను, ఎందుకంటే వారంతా చెత్త." అని అంటాడు. బెంగళూరు మహిళల గురించి చేసిన ఈ కామెంట్ సినిమా రిలీజైన క్షణాల్లో వైరల్ అయింది. దీనిపై కన్నడిగులు భగ్గుమన్నారు. ఓ ప్రాంతానికి చెందిన మహిళలను అవమానించడం సరైన చర్యేనా అని నిలదీశారు. ఈ డైలాగ్ ను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేశారు కన్నడిగులు. అలాగే నస్లెన్ పాత్ర సన్నీ పార్టీలు చేసుకోవడం, డ్రగ్స్ వాడటం వంటి సన్నివేశాలపైనా విమర్శలు వెల్లువెత్తాయ్
వేఫారర్ ఫిల్మ్స్ క్షమాపణలు
ఈ మొత్తం వివాదంపై స్పందించిన దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. "లోకా: చాప్టర్ వన్ సినిమాలో ఓ క్యారెక్టర్ చెప్పిన డైలాగ్ కర్ణాటక ప్రజల మనోభావాలను గాయపరిచిందని మా దృష్టికి వచ్చింది. వేఫారర్ ఫిల్మ్స్‌లో, మేం ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాం..ఇలాంటి డైలాగ్ ద్వారా మిమ్మల్ని బాధపెట్టినందుకు చింతిస్తున్నాం..ఎవరినీ బాధపెట్టాలనే ఉద్దేశం మాకు లేదు అందుకే ఈ డైలాగ్ ను తొలగిస్తాం. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం... దయచేసి మా క్షమాపణను స్వీకరించాలని కోరుతున్నాము." అని చెప్పారు.
మలయాళం , తెలుగు భాషల్లో ఆగస్టు 28న విడుదలైన లోకా: చాప్టర్ 1 చంద్ర సెప్టెంబర్ 4న హిందీలో విడుదల కానుంది. చంద్ర అలియాస్ నీలి గా నటించిన కల్యాణి ప్రియదర్శన్ సూపర్ పవర్స్ కలిగి ఉంటుంది. ఓ మిషన్‌లో ఆమె శత్రువుల నుంచి తృటిలో తప్పించుకుంటుంది. దీంతో రహస్యంగా ఉండాలనే హెచ్చరికలు వస్తాయి. బెంగళూరుకి షిఫ్ట్ అవుతుంది చంద్ర. అక్కడ పక్కింట్లో ఉండే సన్నీతో స్నేహం ఏర్పడుతుంది. ఇలాంటి టైమ్ లో ఇన్‌స్పెక్టర్ నాచియప్ప గౌడకు చంద్రపై అనుమానం వస్తుంది. అసలు చంద్ర ఎవరు? చంద్రపై ఇన్స్స్పెక్టర్ కి ఎందుకు అనుమానం వచ్చింది? ఆమెకు సంబంధించిన నిజాలు ఎందుకు భయపెడతాయ్? ఇదే లోకా: చాప్టర్ 1 చంద్ర సినిమా స్టోరీ. కళ్యాణి ప్రియదర్శన్ టైటిల్ పాత్ర చంద్రగా నటించింది. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది ఈ సినిమా.






















