విడుదలకు ముందే రూ.400 కోట్ల బిజినెస్ - ‘లియో’ లెక్కలు చూస్తే మతి పోవాల్సిందే!
తమిళ నటుడు విజయ్ నటిస్తున్న ‘లియో’ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే 400 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘లియో’. ఈ మూవీకు స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘విక్రమ్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో లోకేష్ ఒక కొత్త యూనివర్స్ ను క్రియేట్ చేశాడు. దీంతో లోకేష్ నుంచి రాబోయే తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు విజయ్ తో తీస్తున్న ‘లియో’ మూవీ కూడా లోకేష్ యూనివర్స్ లో భాగమే అని ప్రచారం రావడంతో ఈ సినిమా పై మరింత ఉత్కంఠ పెరిగింది. దీంతో ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ థియేట్రికల్, డిజిటల్, ఆడియో, శాటిలైట్ హక్కులతో సహా 400 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.
విడుదలకు ముందే ‘లియో’ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. విడుదలకు ముందే రికార్డు వసూళ్లు సాధించిన తొలి సినిమా గా ‘లియో’ వార్తల్లోకెక్కుతోంది. ఈ సినిమాను డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ ఏకంగా 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ హక్కులను కొన్నట్లు సమాచారం. శాటిలైట్ హక్కులను సన్ టీవీ 70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా సోనీ మ్యూజిక్ 18 కోట్ల రూపాయలకు హక్కులను కొనుగోలు చేసింది. ఇక హిందీ శాటిలైట్ హక్కుల కోసం పలు ప్రముఖ కంపెనీలు పోటీ పడుతున్నాయని సమాచారం. మరి కొద్ది రోజుల్లో అది కూడా ఫైనల్ అవుతోందని సినీ నిపుణులు చెబుతున్నారు.
నాన్ థియేట్రికల్ నుంచి రికవరీ దాదాపు రూ. 240 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ రూ. 175 కోట్లుగా నిర్ణయించారు. “ఓవర్సీస్ హక్కులకు 50 కోట్ల రూపాయల డిమాండ్ ఉంది, అయితే తమిళనాడు హక్కులు 75 కోట్ల రూపాయలు కాగా కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు అడిగే రూ.35 కోట్లు. రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం రూ.15 కోట్లుగా అంచనా వేయబడిందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే ‘లియో’ సినిమాపై ఊహించిన దానికంటే ఎక్కువే అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో కూడా సంతానం క్యారెక్టర్ ఉందనే వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా పలువురు ప్రముఖ హీరోలు కూడా సినిమాలో కనిపిస్తారు అని వార్తలు కూడా రావడంతో ఈ మూవీ పై ఉత్కంఠ పెరిగిపోయింది.
ఇప్పటికే ఎల్సీయూ(LCU) లో ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలు వచ్చాయి. విక్రమ్ సినిమాతో లోకేష్ యూనివర్స్ లో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా చివర్లో రోలెక్స్ క్యారెక్టర్ ఎండింగ్ తో సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పుడీ ‘లియో’ మూవీ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా విడుదలకు ముందే రూ.400 కోట్లు సాధించిన తొలి సినిమాగా ‘లియో’ రికార్డులు క్రియేట్ చేసింది. ఇక సినిమాకు హిట్ టాక్ వస్తే వసూళ్లు ఎలా ఉంటాయో ఊహించడం కష్టమేనంటున్నారు ఎల్సీయూ ఫ్యాన్స్. ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలే బెస్ట్ - నసీరుద్దీన్ షా సెన్సేషనల్ కామెంట్స్!