Krithi Shetty: గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది, ఆ విషయంలో సంతోషంగానే ఉన్నాను - కృతి శెట్టి
Krithi Shetty: యంగ్ బ్యూటీ కృతి శెట్టి తెలుగు తెరపై కనిపించి చాలాకాలమే అయ్యింది. తన అప్‌కమింగ్ మూవీ ‘మనమే’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అసలు ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో బయటపెట్టింది ఈ భామ.
Krithi Shetty: చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్లు, ఆఫర్లతో కొంతకాలం వరకు టాలీవుడ్‌లో దూసుకుపోయింది కృతి శెట్టి. తను హీరోయిన్‌గా ‘ఉప్పెన’తో ప్రేక్షకుల ముందుకు రాకముందే తనకు తెలుగు నుంచి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చాయి. అలా కొంతకాలం వరకు తన కాల్ షీట్స్ ఖాళీ లేకుండా గడిపేసింది. కానీ గతేడాది కృతి శెట్టి స్పీడ్ చాలా తగ్గిపోయింది. కేవలం ఒకే ఒక్క సినిమాతో థియేటర్లలో సందడి చేసింది. ఇన్నాళ్ల తర్వాత శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’లో హీరోయిన్‌గా కనిపించనుంది. సడెన్‌గా తన కెరీర్‌లో గ్యాప్ రావడానికి కారణమేంటి అని కృతి బయటపెట్టింది.
ఇవ్వలేదు.. వచ్చింది..
కృతి శెట్టి చివరిగా నాగచైతన్య హీరోగా నటించిన ‘కస్టడీ’ మూవీలో హీరోయిన్‌గా కనిపించింది. ఈ మూవీ 2023 మేలో విడుదలయ్యింది. అప్పటినుంచి ఇప్పటివరకు కృతిని మళ్లీ స్క్రీన్ పై చూడలేదు. దీంతో ఇంతలా గ్యాప్ ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు ‘మనమే’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చింది ఈ భామ. ‘‘చాలామంది మీరెందుకు గ్యాప్ ఇచ్చారు అని అడిగారు. నేను ఇవ్వలేదు. వచ్చింది. నేను తమిళం, మలయాళంలో ఎక్కువగా వర్క్ చేయడం వల్ల తెలుగులో ఆ గ్యాప్ నేచురల్‌గానే వచ్చింది. ప్లాన్ చేసింది కాదు’’ అని వివరించింది కృతి శెట్టి. ఇక తనతో పాటు డెబ్యూ చేసిన హీరోయిన్లు తనకంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు అనే ప్రశ్నపై కూడా కృతి స్పందించింది.
శ్రీలీలతో పోలిక..
‘‘ఈ సంవత్సరం నేను 5 సినిమాలు చేస్తున్నాను. నేను ఆ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. అంటే 5 సినిమాలు చేస్తున్నాను అని గొప్పగా చెప్పుకోవడం కాదు. నేను మనస్ఫూర్తిగా చేస్తున్నానంటే నాకు ఒక్క సినిమా అయినా చాలు. అందుకే నేను తక్కువ సినిమాలు చేస్తున్నాను అని చెప్పలేను. నేను చేస్తున్నదాంట్లో సంతోషంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది కృతి శెట్టి. తను హీరోయిన్‌గా పరిచయమయిన కొన్నాళ్లకే శ్రీలీల కూడా నటిగా గ్రాండ్ డెబ్యూ ఇచ్చింది. శ్రీలీల యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్ కూడా అద్భుతంగా చేయడంతో మేకర్స్.. కృతిని పక్కన పెట్టేశారని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ తను కోలీవుడ్, మాలీవుడ్‌లో బిజీగా ఉండడం వల్లే తెలుగులో గ్యాప్ వచ్చిందని క్లారిటీ ఇచ్చింది కృతి శెట్టి.
ఫ్యామిలీ సినిమా..
ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో ‘మనమే’ తప్పా మరో తెలుగు సినిమా లేదు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ శర్వానంద్ కెరీర్‌లో 35వ చిత్రంగా తెరకెక్కింది. జూన్ 7న ‘మనమే’.. థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది. దీంతో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. చాలాకాలం తర్వాత ఫ్యామిలీతో థియేటర్లకు వెళ్లి చూసే సినిమా వస్తుందని పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ‘మనమే’ కాకుండా తమిళంలో మూడు సినిమాలు, మలయాళంలో ఒక మూవీతో బిజీగా ఉంది కృతి శెట్టి. ఇందులో చాలావరకు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Also Read: పిల్లలను పెంచడమంటే యూట్యూబ్‌లో చూసినంత ఈజీ కాదు - ఎమోషనల్‌గా ఆకట్టుకుంటున్న 'మనమే' ట్రైలర్