Krishnam Raju No More: పెద్దన్నలా కృష్ణంరాజు ప్రోత్సహించారు, ఆ లోటు తీర్చలేనిది - చిరు, పవన్ భావోద్వేగం
Chiranjeevi Condolences Krishnam Raju Death: సినీ పరిశ్రమలో పెద్దన్న లాంటి వ్యక్తిని కోల్పోయామని, తమ గ్రామానికి చెందిన వ్యక్తి అంటూ కృష్ణంరాజుతో తమ అనుబంధాన్ని చిరంజీవి, పవన్ గుర్తుకు చేసుకున్నారు.
ప్రముఖ నటుడు, రెబల్‌స్టార్ కృష్ణంరాజు మరణంపై మెగా బ్రదర్స్ భావోద్వేగానికి లోనవుతున్నారు. సినీ పరిశ్రమలో పెద్దన్న లాంటి వ్యక్తిని కోల్పోయామని, తమ గ్రామానికి చెందిన వ్యక్తి అంటూ కృష్ణంరాజుతో తమ అనుబంధాన్ని మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తుకు చేసుకున్నారు. కృష్ణంరాజు ఇకలేరని తెలియగా, ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు రెబల్ స్టార్‌తో తమ అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు మెగా బ్రదర్స్. సినీ పరిశ్రమలో ఎంతో మందితో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, తమ సొంత గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో కృష్ణంరాజు మరణంతో భావోద్వేగానికి లోనయ్యారు చిరంజీవి, పవన్ కళ్యాణ్.
పెద్దన్నలా అప్యాయంగా ప్రోత్సహించారు: చిరంజీవి
కృష్ణం రాజు ఇకలేరనే మాట ఎంతో విషాదకరం అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘మా ఊరి (పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు) హీరో, చిత్ర పరిశ్రమలో నా తొలి రోజుల నుంచి పెద్దన్నాలా ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు గారితో నాటి ‘మనవూరి పాండవులు’ దగ్గర నుంచి నేటి వరకు నా అనుబంధం ఎంతో ఆత్మీయమైనది. ఆయన ‘రెబల్ స్టార్’ కు నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రిగా కూడా ఎన్నో సేవలు అందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ, లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడి లాంటి ప్రభాస్ కీ, నా సంతాపాన్ని తెలియజేస్తున్నానంటూ’ ట్వీట్ చేశారు చిరంజీవి.
Rest In Peace Rebel Star ! pic.twitter.com/BjSKeCbIMR
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 11, 2022
మొగల్తూరు కావడంతో చాలా ఆప్యాయంగా ఉండేవారు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు కృష్ణంరాజు అని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో, కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు కృష్ణంరాజు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన వ్యక్తి కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవల ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. దిగ్గజ నటుడు కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ’ పవన్ ట్వీట్ చేశారు.
శ్రీ కృష్ణంరాజు గారి మరణం దిగ్భ్రాంతికరం - JanaSena Chief Shri @PawanKalyan garu#KrishnamRaju pic.twitter.com/WQj8q2v2cU
— JanaSena Party (@JanaSenaParty) September 11, 2022
తమ కుటుంబంతో కృష్ణంరాజుతో స్నేహ సంబంధాలు ఉన్నాయని.. 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో కృష్ణంరాజుతో కలిసి అన్నయ్య చిరంజీవి నటించారని గుర్తు చేసుకున్నారు పవన్. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ‘భక్త కన్నప్ప’లో కృష్ణంరాజు అభినయం ప్రత్యేకం. అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారు. బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం లాంటి చిత్రాలు ఆయన శైలి నటనను చూపాయన్నారు. ప్రజా జీవితంలోనూ సీనియర్ నటుడు ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరఫున బరిలో నిలిచారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. కృష్ణంరాజు కుటుంబానికి తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేశారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.