KGF Chapter2 Trailer: రాకీ భాయ్ రెండో ఛాప్టర్ ట్రైలర్ వచ్చేది ఆ రోజే - 'కె.జి.యఫ్ 2' ట్రైలర్ విడుదల తేదీ ఖరారు
కన్నడ రాక్ స్టార్ యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో హోంబలే ఫిలింస్ నిర్మిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీ KGF Chapter 2 విడుదల తేదీ ఖరారు అయ్యింది.
యష్ కథానాయకుడిగా హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమా 'కె.జి.యఫ్ 2'. సూపర్ డూపర్ హిట్ 'కె.జి.యఫ్: చాప్టర్ 1'కి ఇది కొనసాగింపు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్, ఈ రెండో భాగానికి కూడా దర్శకుడు. ఏప్రిల్ 14న సినిమా విడుదల కానుంది. మార్చి 27న సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు KGF Chapter 2 ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు దర్శకుడు వెల్లడించారు.
'కె.జి.యఫ్ 2' ట్రైలర్ విడుదల గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. భారీ సినిమా విడుదల రోజున ట్రైలర్ థియేటర్లలో విడుదల చేయనున్నట్టు కొందరు రాసుకొచ్చారు. వాటికి తెర దించుతూ... మార్చి 27న ట్రైలర్ విడుదల చేయనున్నట్టు నేడు ప్రకటించారు.
'కె.జి.యఫ్' విడుదల ముందు వరకు యష్ అంటే కన్నడ హీరో మాత్రమే. ఇప్పుడు అతడు పాన్ ఇండియా హీరో. 'కె.జి.యఫ్' విజయంతో యష్‌కు పాన్ ఇండియా లెవల్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడ్డాయి. 'కె.జి.యఫ్ 2' మీద మంచి అంచనాలు కూడా ఉన్నాయి. 'కె.జి.యఫ్' విజయంతో రెండో పార్ట్ కోసం బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్, టాలీవుడ్ నటుడు రావు రమేష్ తదితరులను కీలక పాత్రలకు ఎంపిక చేసుకున్నారు. తొలి పార్ట్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి రెండో పార్ట్ లో కూడా నటిస్తున్నారు.
కరోనా కారణంగా పలు సినిమాల షూటింగులు అనుకున్నట్టు జరగలేదు. ముందు అనుకున్న తేదీకి థియేటర్లలోకి రాలేదు. ఆ సినిమాల జాబితాలో 'కె.జి.యఫ్ 2' కూడా ఉంది. అయితే... కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తేదీ నుంచి వెనక్కి తగ్గేది లేదని రెండు మూడుసార్లు ఖరారు చేశారు.