Kasthuri Shankar: ఆ మూవీలో దారుణమైన అనుభవం, అందుకు చిన్మయి దగ్గర ఆధారాలు లేవు - నటి కస్తూరి శంకర్ వ్యాఖ్యలు
Kasthuri Shankar: సినిమాల్లో హీరోయిన్ నుండి సీరియల్ ఆర్టిస్ట్‌గా మారిన కస్తూరి శంకర్.. మీ టూలో యాక్టివ్‌గా పాల్గొన్నారు. తాజాగా అసలు తనకు అలాంటి అనుభవం ఎక్కడ ఎదురయ్యిందో బయటపెట్టారు.
Kasthuri Shankar about MeToo: వెండితెర నుంచి ఎంతోమంది ఆర్టిస్టులు బుల్లితెరపైకి వచ్చారు. అలా వచ్చి రాణిస్తున్న వారిలో కస్తూరి శంకర్ కూడా ఒకరు. ఒకప్పుడు స్టార్, అప్‌కమింగ్ హీరోలతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన కస్తూరి.. ఇప్పుడు సీరియల్స్‌లోకి వచ్చి, ఒక సీరియల్‌లో లీడ్‌గా చేసి మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే ఆన్ స్క్రీన్ తను ఎలా ఉన్నా.. ఆఫ్ స్క్రీన్ మాత్రం ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్థత్వం తనది. తాజాగా కస్తూరి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో మీ టూ గురించి, ఆ విషయంలో చిన్మయి చేసిన వ్యాఖ్యల గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. అంతే కాకుండా నయనతార సరోగసీపై తను చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు.
తప్పించుకోవడం నా అదృష్టం..
‘మీ టూ’ ఉద్యమం అనేది ప్రారంభం అయినప్పుడు కస్తూరి శంకర్ కూడా తనకు అలాంటి అనుభవాలను ఉన్నాయని చెప్పి షాకిచ్చారు. ఇక తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో అసలు సమస్య ఎక్కడ ఎదురయ్యిందో ఓపెన్‌గా బయటపెట్టారు. ‘‘నాకు సినిమాల్లో అలాంటి అనుభవాలు ఉన్నాయి. సినిమాల నుంచి నన్ను తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా దారుణమైన అనుభవం అంటే ఒక మలయాళం సినిమాలోనే. అందులో నుంచి తప్పించుకోవడం నా అదృష్టం అని ఇప్పటికీ అనుకుంటాను. మలయాళం ఇండస్ట్రీ ఎప్పుడూ అద్భుతంగానే ఉంది. కానీ అందరూ ఒకేలా ఉండరు కదా. ఆ సినిమా టైమ్‌కు నాకు పెళ్లయ్యింది, అది మలయాళంలో నా కమ్ బ్యాక్ మూవీ. దాని ముందు నాకెప్పుడూ ఏ సమస్య రాలేదు. అది పెద్ద ప్రాజెక్టే కానీ స్టార్ హీరోలు లేరు’’ అంటూ మలయాళ ఇండస్ట్రీ నుంచి తను ఎదుర్కున్న ఇబ్బందులను బయటపెట్టారు కస్తూరి శంకర్.
ఇద్దరూ తెలుసు..
‘మీ టూ’లో యాక్టివ్‌గా పాల్గొన్న వారిలో సింగర్ చిన్మయి పేరు ముందుంటుంది. వైరముత్తుపై చిన్మయి ఓపెన్‌గా ఆరోపణలు చేశారు. దానిపై కస్తూరి శంకర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘మీ టూ గురించి మాట్లాడినందుకు నాకు ఎలాంటి ఎఫెక్ట్ రాదు. ఎందుకంటే నేను చెప్పిన విధానం అలాంటిది. చిన్మయి నేరుగా వైరముత్తుపై ఆరోపణలు చేశారు. అలా చేసినప్పుడు నిరూపించగలగాలి. అలా చేయలేనప్పుడు ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయి. నాకు కూడా అలాంటివి జరిగాయి. కానీ నేను వాళ్ల పేర్లు చెప్పలేను. ఎందుకంటే పేర్లు చెప్తే ప్రూఫ్ కావాలి. ప్రూఫ్‌కు ఎక్కడికి పోవాలి? ఆ రిస్క్ చిన్మయి తీసుకుంది. దానికి పరిణామాలు ఉన్నాయి. నాకు వాళ్లిద్దరూ తెలుసు. వైరముత్తుతో నేను ఎన్నోసార్లు కలిశాను, ఫోన్‌లో మాట్లాడాను. అప్పుడు ఆయన నాతో ఎలా ప్రవర్తించారు అని మాత్రమే నేను చెప్పగలను. నన్ను ప్రతీ విషయంలో ప్రోత్సహించారు. చిన్మయి కూడా నాకు 20 ఏళ్లుగా తెలుసు. చిన్న వయసులో తను తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.. క్యారెక్టర్ పరంగా తను బంగారు తల్లి’’ అని చెప్పుకొచ్చారు కస్తూరి.
సామాన్య మనుషులకు సాధ్యం కాదు..
‘‘వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో.. ఆ ఇద్దరికే తెలుసు. దాని గురించి మనం మాట్లాడాలంటే ప్రూఫ్ కావాలి. హాలీవుడ్‌లో ఇలాంటి విషయాల్లో పోరాడడానికి అందరూ కలిసి ముందుకొచ్చారు. కానీ ఇక్కడ చిన్మయి ఒంటరిగా పోరాడుతోంది’’ అని ఇండియాలో ‘మీ టూ’ ఎలా జరిగిందో తెలిపారు కస్తూరి శంకర్. ఇక నయనతార సరోగసీ విషయంలో కూడా కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కాంట్రవర్సీ క్రియేట్ చేయగా.. నయనతార చేసింది తప్పు కాదని, కానీ సెలబ్రిటీలకు దొరికిన సౌకర్యాలు సామాన్య మనుషులకు సాధ్యం కాదని, అంటే చట్టంలోనే తప్పు ఉందని ఆరోపించారు కస్తూరి.
Also Read: టాలీవుడ్‌లోకి మరో వారసుడు - రచ్చ గెలిచి ఇంటికి వస్తున్న గుమ్మడి మనవడు