IndiGo Flights Cancelled: నేడు 300కి పైగా ఇండిగో విమానాలు రద్దు.. ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసిన ఎయిర్ లైన్స్
Indigo Airlines | ఇండిగో విమానయాన సంస్థ కార్యకలాపాలను స్థిరీకరించడానికి ప్రయత్నిస్తోంది. కానీ బుధవారం సైతం దేశవ్యాప్తంగా 300కు పైగా విమాన సర్వీసులు రద్దు చేసినట్లు సమాచారం.

Indigo Flights Cancelled Today | ఇండిగో ఎయిర్ లైన్స్ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పార్లమెంటులో మంగళవారం (డిసెంబర్ 9) నాడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇండిగో సంక్షోభం బారిన పడిన వారికి రీఫండ్ ఇస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ ప్రకటన చేసినప్పటికీ, పరిస్థితులు ఇంకా మెరుగుపడలేదు. బుధవారం (డిసెంబర్ 10) నాడు కూడా 300 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేయడమే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. డిసెంబర్ 9న సైతం 400 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేశారు. బుధవారం సైతం భారీ సంఖ్యలో రద్దు కావడం పరిస్థితి సాధారణ స్థితికి రాలేదని సూచిస్తుంది.
DGCA, విమానయాన మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నప్పటికీ ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇప్పటికీ యథాతథంగా కార్యకలాపాలు నిర్వహించే స్థితిలే ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఎయిర్‌లైన్ 10 శాతం వరకు విమానాలను తగ్గించాలని కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రతిరోజూ 2200 నుంచి 2300 వరకు సర్వీసులు నడుపుతోంది. అయితే కేంద్రం ఆదేశాలతో ఇండిగో ప్రతిరోజూ 220 వరకు సర్వీసులు తగ్గించనుంది. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రయాణికులు ముందుగానే బుకింగ్ చేసుకున్న విమానాలు, రాబోయే కొన్ని నెలల పాటు, అంటే ప్రతిరోజూ వందలాది విమానాలు మరికొన్ని రోజులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
బయలుదేరే ముందు స్టేటస్ చెక్ చేసుకోండి
ఇండిగో తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమానం స్టేటస్‌ను తనిఖీ చేయాలని సూచించింది. ఎందుకంటే షెడ్యూల్‌లో చివరి నిమిషంలో కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. PTI ప్రకారం, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం (డిసెంబర్ 9) నాడు ఇండిగో తన విమాన షెడ్యూల్‌లో 10 శాతం కోత విధించాలని ఆదేశించింది. ఇలా చేయడం వల్ల సంక్షోభంలో ఉన్న ఎయిర్‌లైన్ తన కార్యకలాపాలను స్థిరీకరించడానికి వీలవుతుందని డీజీసీఏ, కేంద్రం భావిస్తున్నాయి. .
ఇప్పటివరకు ఎన్ని విమానాలు రద్దు అయ్యాయి
కొత్త విమానయాన సేవా నిబంధనల రెండవ దశ అమలులోకి వచ్చిన తర్వాత ఇండిగో కార్యకలాపాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ సమయంలో 4,000 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేశారు. అయితే వందలాది విమానాలు ఆలస్యంగా నడిచాయి. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో.. ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పీటర్ ఎల్బర్స్‌ను మంత్రిత్వ శాఖకు పిలిపించామని, తద్వారా పరిస్థితి గురించి సమాచారం అందించాలని కోరినట్లు తెలిపారు. డిసెంబర్ 6 వరకు ప్రభావితమైన విమానాలకు 100 శాతం రీఫండ్‌లు పూర్తి చేసినట్లు సీఈవో పీటర్ ఎల్బర్స్ ధృవీకరించారని మంత్రి తెలిపారు.






















