Kantara Chapter 1 vs OG Movie: 'కాంతార' వర్సెస్ 'ఓజీ'... కర్ణాటకలో ఆటంకాలు & టికెట్ రేట్ ఇష్యూపై స్పందించిన పవన్
Pawan Kalyan On Kantara: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'కాంతార చాప్టర్ 1' టికెట్ రేట్స్ పెంచుతారని వచ్చిన వార్తలపై ఇండస్ట్రీ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.

కన్నడ కథానాయకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించిన తాజా సినిమా 'కాంతార చాప్టర్ 1'. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ చిత్రానికి ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్స్ హైక్ ఇవ్వనుంది. ఈ అంశంలో తెలుగు సినిమా వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే?
'కాంతార'కు టికెట్ రేట్ హైక్ వద్దనేది ఎందుకు?
'కాంతార' టికెట్ రేట్స్ పెంపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి తెలుగు చిత్రసీమ వర్గాల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందుకు కారణం ఏమిటి? అంటే... పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'ఓజీ' చిత్రాన్ని కర్ణాటకలో ప్రదర్శిస్తున్న థియేటర్ల దగ్గర కొందరు ఆటంకాలు సృష్టించారు. బ్యానర్లు చింపేశారు. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'ఆర్ఆర్ఆర్'తో పాటు 'గేమ్ ఛేంజర్', 'హరిహర వీరమల్లు' విడుదల సమయంలో ఆటంకాలు సృష్టించారని, తెలుగు సినిమాలకు కర్ణాటకలో టికెట్ రేట్స్ పెంచడాన్ని సవాల్ చేస్తూ అక్కడ హైకోర్టుకు కొందరు వెళ్లారని ఏపీ ప్రభుత్వం దృష్టికి సినిమా వర్గాలు తీసుకు వెళ్లాయి.
తెలుగు సినిమాల పట్ల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గానీ, కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి గానీ సానుకూలంగా స్పందన రావడం లేదని, ఇటువంటి తరుణంలో కన్నడ సినిమాకు టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలని తెలుగు చిత్రసీమలో కొందరు ప్రశ్నించారు. 'కాంతార చాప్టర్ 1'తో పాటు కన్నడ సినిమాలకు టికెట్ రేట్ హైక్ ఇచ్చే విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు.
భాష, ప్రాంతం పేరుతో కళను విడదీసి చూడొద్దు!
కళ అనేది మనసుల్ని హత్తుకుని మనుషుల్ని కలిపేదిగా ఉండాలి తప్ప... అంతే గానీ భాష, ప్రాంతాల పేరుతో విడదీసి మనుషుల్ని దూరం చేసేదిగా ఉండకూడదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సినిమా అనేది భిన్న కళల సమాహారమని తెలిపారు. అందుకే పర భాషా సినిమా పేరుతో కన్నడ చిత్రాలను మన రాష్ట్రంలో వేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు.
Also Read: పవన్ సినిమాకు చిరంజీవి ఇచ్చిన రివ్యూ ఇదే... 'ఓజీ' చూసిన మెగా ఫ్యామిలీ
కర్ణాటకలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కన్నడ సినిమాలకు ఇక్కడ ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని, పెద్ద మనసుతో ముందుకు వెళ్లాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ, హోమ్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఈ అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సంబంధిత శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. ఇంకా ఆయన స్పందిస్తూ... ''మంచి మనసుతో, జాతీయ భావనలతో ఆలోచనలు చేయాలి. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి నుంచి ఇప్పటి 'కిచ్చా' సుదీప్, ఉపేంద్ర, శివరాజ్ కుమార్, రిషబ్ శెట్టి వరకూ అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సోదర భావంతో మెలుగుతున్నారు. మన సినిమాలకు కర్ణాటకలో వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను తెలుగు, కన్నడ ఫిల్మ్ ఛాంబర్స్ చర్చించాలి. అప్పుడు ప్రభుత్వపరంగా స్పందిద్దాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళతా. కర్ణాటకలో ఎదురైన తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని 'కాంతార చాప్టర్ 1'కి ఆటంకాలు కల్పించవద్దు'' అని అన్నారు.
Also Read: మళ్ళీ మెగా పవర్ స్టారే... గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసిన రామ్ చరణ్!





















