Kamakshi Bhaskarla: బోల్డ్ పాత్రలు చేస్తున్నానని.. బయట కూడా అలాంటి అమ్మాయినే అనుకుంటున్నారు: ‘పొలిమేర’ నటి కామాక్షి భాస్కర్ల
Kamakshi Bhaskarla: తెలుగమ్మాయి కామాక్షి భాస్కర్ల.. బోల్డ్ సినిమాల్లో నటించడానికి వెనకాడదు. అది తన సినిమా సెలక్షన్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అయినా కూడా తనకు అవకాశాలు రాకపోవడంపై తాజాగా స్పందించింది.
Kamakshi Bhaskarla: టాలీవుడ్‌లో తెలుగమ్మాయిల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. అందులోనూ ఒకవైపు డాక్టర్ ప్రొఫెషన్‌లో ఉంటూ మరోవైపు యాక్టర్‌గా కెరీర్‌ను నిలబెట్టుకుంటున్న తెలుగమ్మాయిల్లో కామాక్షి భాస్కర్ల ఒకరు. కామాక్షి.. పలు మంచి సినిమాలతో ప్రేక్షకుల్లో గుర్తింపు దక్కించుకుంది. అయితే తన సినిమాల్లో చాలావరకు బోల్డ్ సీన్స్ ఉన్నా కూడా వెనక్కి తగ్గకుండా నటించి అందరినీ ఇంప్రెస్ చేసింది ఈ భామ. ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో తను బోల్డ్ సీన్స్‌పై నటించడం గురించి, ఇండస్ట్రీలో తనకు వచ్చిన గుర్తింపు గురించి వ్యాఖ్యలు చేసింది కామాక్షి.
ఇదే నా స్టేట్‌మెంట్..
‘‘2018 నుంచి ఎన్నో చూశాను. ఇక్కడ సూపర్ స్టార్ అయినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. లీడ్ క్యారెక్టర్లు అనగానే ముంబాయ్, ఢిల్లీకి ఫోన్ చేసేస్తారు. అది మారేవరకు ఇక్కడ యాక్టర్ల పరిస్థితి ఇంతే. నా పరంగా యాక్టింగ్ విషయంలో నేనేం లిమిట్స్ పెట్టుకోను. నేను ఎంచుకునే కథలు కూడా అలాగే ఉంటాయి. ఈ స్టేట్‌మెంట్ నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. థియేటర్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నప్పుడు మా సార్ నాకు చెప్పిన మాట ఇది. నువ్వు యాక్టర్ కావాలంటే నీ శరీరంలోని ప్రతీ అణువును ఆ క్యారెక్టర్‌లోకి తీసుకెళ్లాలి. నీ పర్సనల్ నమ్మకాలు అనేవి పాత్రకు అడ్డు అవ్వకూడదు. ఒక సీన్ చేయమంటే చేయను అని నువ్వు అనకూడదు అన్నారు. నేను అలాంటి నటినే’’ అంటూ తాను నమ్మే విషయాన్ని బయటపెట్టింది కామాక్షి.
మైండ్‌సెట్ మారాలి..
‘‘మనవాళ్లు ఏంటంటే బోల్డ్ కంటెంట్ చేయగానే ఈ అమ్మాయి బోల్డ్ కంటెంట్ చేసింది అని అవకాశాలు ఇవ్వరు. ఈ అమ్మాయి బయట కూడా అలాగే ఉంటుందేమో అని చాలా తప్పుగా ఆలోచిస్తారు. అదే మొదట్లో సాఫ్ట్ క్యారెక్టర్లు చేస్తూ తర్వాత బోల్డ్ పాత్రలు చేస్తే మంచి పర్ఫార్మర్ అంటారు. మొదటి నుంచి బోల్డ్ పాత్రలు చేస్తే మాత్రం తప్పుగా అనుకుంటారు. ఆ మైండ్‌సెట్ ముందు మారాలి. యాక్టర్లను యాక్టర్లుగా చూడాలి. మనకు ఇన్ని స్టూడియోలు ఉన్నాయి. అన్నింటికి ఒక క్యాస్టింగ్ ఏజెన్సీ అనేది ఏర్పాటు చేస్తే ఇక్కడ కూడా యాక్టర్లు దొరుకుతారు. మనం అంత కష్టపడం. పొలిమేర సమయంలో ఎక్కువగా నార్త్ అమ్మాయిల ప్రొఫైల్సే వచ్చాయి. ఇక్కడ అమ్మాయిలను చూపించమంటే వాళ్ల దగ్గర ఒక్క ప్రొఫైల్ కూడా లేదు’’ అని చెప్పుకొచ్చింది కామాక్షి.
అందరూ మగవారే..
‘‘తెలుగమ్మాయిలు వచ్చినా కూడా వాళ్లను సైడ్ క్యారెక్టర్లకే పరిమితం చేస్తున్నారు. వాళ్లు ఎంతో కష్టపడుతున్నారు, సినిమాల్లో ఆ కష్టం కనిపిస్తుంది, ఎలాంటి క్యారెక్టర్లు అయినా చేస్తాం అంటున్నారు అయినా కూడా అవకాశాలు ఇవ్వడం లేదు. ఈమధ్యే నా ప్రొఫైల్ చూసి అమ్మాయి గ్లామర్‌గా లేదు అన్నారంట. పర్ఫార్మ్ చేస్తున్నా కూడా గ్లామర్ గురించే మాట్లాడుతున్నారు. యాక్టింగ్ చేయకపోతే చేయలేదు అంటారు. చేస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఎలాంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం? కానీ ఈ రియాలిటీని నేను యాక్సెప్ట్ చేశాను. ఇది ఒక్కరోజులో మారే విషయం కాదు. పైగా ఈ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేవారంతా మగవారే’’ అంటూ వాపోయింది కామాక్షి భాస్కర్ల.
Also Read: మహిళలకు ఫ్రీగా మూవీ టికెట్స్- ‘సత్యభామ’ టీమ్ బంఫర్ ఆఫర్