Hreem Movie: పవన్ తాత జంటగా చమిందా వర్మ... సందీప్ కిషన్ క్లాప్‌తో 'హ్రీం' షురూ!
Sundeep Kishan: యువ కథానాయకుడు సందీప్ కిషన్ క్లాప్‌తో 'హ్రీం' సినిమా మొదలైంది. ఇందులో హీరో హీరోయిన్లతో పాటు దర్శకుడికీ ఇదే తొలి సినిమా. ఆ వివరాల్లోకి వెళితే...

తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడూ కొత్తవాళ్ళకు వెల్కమ్ చెబుతుంది. ప్రతి ఏడాది కొత్త హీరోలు, హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వస్తుంటారు. ఈ ఏడాది కొత్త జంటతో మరో సినిమా మొదలైంది. అది 'హ్రీం'
పవన్ తాత జంటగా చమిందా వర్మ
యువ కథానాయకుడు, పీపుల్ స్టార్ సందీప్ కిషన్ క్లాప్‌తో ప్రారంభమైన తెలుగు సినిమా 'హ్రీం'. ఇందులో పవన్ తాత హీరో. చమిందా వర్మ హీరోయిన్. వాళ్ళిద్దరికీ ఇదే తొలి సినిమా. శివమ్ మీడియా పతాకంపై శ్రీమతి సుజాత సమర్పణలో శివ మల్లాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేశ్ రావూరి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

'హ్రీం' సినిమా ప్రారంభోత్సవంలో హీరో సందీప్ కిషన్ క్లాప్ ఇవ్వగా... నటులు అలీ, బెనర్జీతో పాటు ప్రముఖ ఆడిటర్ విజయేంద్ర రెడ్డి, జర్నలిస్ట్ - నిర్మాత రాంబాబు పర్వతనేని కలిసి దర్శకుడు రాజేశ్‌కి స్క్రిప్ట్ అందించారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన సన్నివేశానికి రాజీవ్ కనకాల కెమెరా స్విఛాన్ చేశారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ... ''నటుడిగా నా మొదటి సినిమా నుండి ఈ సినిమా శివ మల్లాలతో పరిచయం ఉంది. నాకున్న అతికొద్ది మంది మీడియా మిత్రులలో శివ ముఖ్యమైన వ్యక్తి. ఆయన నిర్మాతగా తీస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'' అని అన్నారు. నటుడు ఆలీ మాట్లాడుతూ... ''ఈ చిత్ర నిర్మాతలు శివ మల్లాల - సుజాత దంపతులు నాకు కుటుంబ సభ్యులు. ఈ సినిమాతో వాళ్ళు మంచి విజయం సాధించాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నా'' అని అన్నారు. నటుడు బెనర్జీ మాట్లాడుతూ... ''ఈ సినిమాలో నేను చాలా మంచి పాత్ర చేస్తున్నా. తమ్ముడు శివ మల్లాలతో పాటు యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్'' అని అన్నారు.
రాజీవ్ కనకాల మాట్లాడుతూ... ''ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషిస్తున్నా. 'హ్రీం' హీరోయిన్ చమిందా వర్మ దుబాయ్ నుంచి తెలుగు సినిమాల్లో నటించటానికి వచ్చిన తెలుగు అమ్మాయి. ఆమె డాక్టర్ కూడా! హీరో పవన్ తాతా, దర్శకుడు రాజేశ్ రావూరితో నాకు ముందు నుంచి పరిచయం ఉంది. నాకు వయసు 50 ఏళ్లు అయితే నాకు 25 ఏళ్లు ఉన్నప్పటి నుంచి నిర్మాత శివ మల్లాల తెలుసు. ఈ సినిమాతో తనకు నిర్మాతగా పెద్ద విజయం రావాలి'' అని అన్నారు. దర్శక - రచయిత జనార్థన మహర్షి, నిర్మాత కె. బాబురెడ్డి, తమిళ నిర్మాత జి. సతీష్ కుమార్, 'ట్రెండింగ్ లవ్' దర్శకుడు హరీష్ నాగరాజ్, 'బిగ్ బాస్' బెజవాడ బేబక్క, వనిత, శ్రీవాణి త్రిపురనేని తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
Hreem Movie Cast And Crew: పవన్ తాత, చమిందా వర్మ జంటగా... బెనర్జీ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'హ్రీం' చిత్రానికి కూర్పు: ప్రణీత్ కుమార్, కళ: సుధీర్ మాచర్ల, వీఎఫ్‌ఎక్స్: రాజ్ పవన్ కొమ్మోజు, సౌండ్ డిజైనర్: సాయి మనీంధర్, డీఐ: ఎస్‌జె కార్తీక్ (డి.ఎఫ్.టెక్), ఛాయాగ్రహణం: అరవింద్, సంగీతం: మార్కస్ యం, కథ - కథనం - దర్శకత్వం: రావూరి రాజేష్, నిర్మాత: శివ మల్లాల.





















