Guntur Kaaram OTT: ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'గుంటూరు కారం' హిందీ వెర్షన్!
Guntur Kaaram OTT: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'గుంటూరు కారం'. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబడిన ఈ చిత్రం, ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది.
Guntur Kaaram OTT: సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'గుంటూరు కారం'. అతడు, ఖలేజా తర్వాత ఈ క్రేజీ కాంబోలో తెరక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా, అంచనాలను అందుకోలేకపోయింది. మహేశ్ స్టార్ పవర్ తో రూ. 250 కోట్ల గ్రాస్ వరకూ లాక్కొచ్చారు కానీ, ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇది ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఈ మూవీకి డిజిటల్ రిలీజ్ లో అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
జనవరి 12న థియేటర్లలో రిలీజైన 'గుంటూరు కారం' సినిమా.. ఫిబ్రవరి 9న నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ చేయబడింది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది OTT వీక్షకుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. స్ట్రీమింగ్ కాబడిన మొదటి రోజు నుంచే ట్రెండింగ్ లో కొనసాగుతోంది. హిందీ, ఇంగ్లీష్ లో ఇతర పెద్ద సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ, మహేష్ బాబు సినిమా గ్లోబల్ చార్ట్స్‌లో ఆధిపత్యం చలాయిస్తోంది. తెలుగు వెర్షన్ కంటే మిన్నగా హిందీ వెర్షన్‌కు వ్యూస్ వస్తున్నాయి. ఒకరకంగా హిందీ వెర్షన్ ఓటీటీలో విధ్వంసం సృష్టిస్తోందని చెప్పాలి.
'గుంటూరు కారం' హిందీ వెర్షన్ వరుసగా రెండు వారాల పాటు టాప్ 10 నాన్-ఇంగ్లీష్ కేటగిరీలో నిలిచింది. ఈ సినిమాకు మొదటి వారంలో 2,800,000 గంటల వీక్షణలు వచ్చాయి. రెండో వారంలో 4,800,000 లక్షల గంటల వ్యూస్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ తెలుగు, తమిళ, హిందీ వెర్షన్స్ ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'యానిమల్' మూవీ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన టాప్ -10 మూవీస్ లో లేదు. కానీ 'గుంటూరు కారం' హిందీ వెర్షన్ మాత్రం 8వ స్థానంలో ఉంది. ఇక షారుక్ ఖాన్ నటించిన 'డుంకీ' చిత్రం 13,000,000 వాచ్ అవర్స్ తో 5వ స్థానంలో నిలిచింది.
నార్త్ లో మహేష్ క్రేజ్ కు ఇదే నిదర్శనం...
'గుంటూరు కారం' సినిమా థియేటర్లలో రిలీజైన తర్వాత వచ్చిన నెగిటివిటీని బట్టి చూస్తే, ఇది ఓటీటీలో బ్లాక్ బస్టర్ హిట్టయినట్లుగానే పరిగణించాలి. హిందీలో ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందంటే, నార్త్ లో మహేశ్ బాబు క్రేజ్ ఎలా ఉందనేది తెలుస్తుంది. ఓవరాల్ గా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినంత దారుణంగా ఈ సినిమా లేదని హిందీ జనాలు భావిస్తున్నట్లు అర్థమవుతుంది. మహేశ్ యాక్టింగ్, డ్యాన్సులు, ఫైటింగ్స్, త్రివిక్రమ్ మేకింగ్ ను ఓటీటీ ఆడియన్స్ లైక్ చేస్తున్నారని తెలుస్తోంది.
'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ నిర్వహించారు. హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.