Vikranth Reddy Interview: 'సంతాన ప్రాప్తిరస్తు'తో కొత్త అవతారంలో విక్రాంత్... 'స్పార్క్' ఫెయిల్యూర్ తర్వాత ఏం నేర్చుకున్నారంటే?
Santhana Prapthirasthu Release Date: 'స్పార్క్'తో హీరోగా, దర్శక - నిర్మాతగా పరిచయం అయ్యారు విక్రాంత్. ఇప్పుడు 'సంతాన ప్రాప్తిరస్తు'తో హీరోగా మారారు. ఈ సందర్భంగా ఏబీపీ దేశంతో ఇంటర్వ్యూ...

'స్పార్క్' సినిమాతో హీరోగా, దర్శక - నిర్మాతగా పరిచయం అయ్యారు విక్రాంత్ రెడ్డి. అయితే ఆ సినిమా ఆశించినట్టు ఆడలేదని ఆయన ఓపెన్‌గా చెబుతున్నారు. ఈ శుక్రవారం (నవంబర్ 14న) విడుదల కానున్న 'సంతాన ప్రాప్తిరస్తు'తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరి ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకుడు. చాందినీ చౌదరి హీరోయిన్. నవంబర్ 14న రిలీజ్ సందర్భంగా ఏబీపీ దేశంతో హీరో విక్రాంత్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయన ఇంటర్వ్యూ విశేషాలు...
- రిలీజ్ డేట్ విషయంలో మాకు మూడు ఆప్షన్స్ వచ్చాయి. నవంబర్ 14 చిల్డ్రెన్స్ డే కదా అని.. మా కథకు కరెక్ట్ డేట్ అని ఫిక్స్ అయ్యాం. అందుకే నవంబర్ 14న 'సంతాన ప్రాప్తిరస్తు' మూవీని రిలీజ్ చేస్తున్నాం. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అనే పాయింట్ బాగుంది.. కానీ పూర్తి స్క్రిప్ట్ ఎలా ఉంటుందో.. లైన్ దాటితే కష్టం కదా అని అనుకున్నాను. కానీ పూర్తి కథ విన్న తరువాత ఫ్యామిలీ మొత్తం చూసి ఎంటర్టైన్ అయ్యేలా ఉందని అనిపించడంతో వెంటనే ఓకే చెప్పాను.
- 'స్పార్క్' తర్వాత మధుర శ్రీధర్ గారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన వద్ద ఉన్న కథల్ని నా వద్దకు పంపించారు. అందులోంచి విన్నదే ఈ కథ. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా అద్భుతంగా స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. నా వద్దకు వచ్చిన తరువాతే ఈ కథ చాందినీ వద్దకు వెళ్లింది.
- 'స్పార్క్' రిలీజ్ అయిన తర్వాత చాలా మంది నాకు ఫోన్స్ చేసి అభినందించారు. ఓ కొత్త వాడు.. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా అంత పెద్ద ప్రాజెక్ట్ చేసి రిలీజ్ చేయడమే పెద్ద విజయం అని అంతా ప్రశంసించారు. భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో తీసిన 'స్పార్క్'ని చూసి చాలా మంది నిర్మాతలు అభినందించారు. 'స్పార్క్' ఆడలేదు కానీ... అశ్వనీదత్ వంటి వారు కూడా నా కష్టాన్ని, ప్రయత్నాన్ని ప్రశంసించారు. అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ మీద ఎన్నో కోర్సులు చేశాను. 'స్పార్క్' తరువాత యాక్టింగ్ స్కూల్స్‌లో జాయిన్ అయ్యాను. స్టేజ్ మీద ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. నా మీద నాకు నమ్మకం ఏర్పడిన తరువాత ఇతర ప్రాజెక్టుల గురించి వెతికాను.
Also Read: ధర్మేంద్రను అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్లిన ఫ్యామిలీ... లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏమిటంటే?
- హీరోగానో, దర్శకుడిగానో ఏదో ఒకటే చేయాలి. రెండూ ఒకే సారి చేస్తామంటే కుదరకపోవచ్చు. అందుకే నేను కొన్ని రోజులు దర్శకత్వం అనే దాన్ని పక్కన పెట్టి నటన మీదే ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. మామూలుగా అయితే ముందుగా 'స్పార్క్' స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. కానీ ప్రతీ ఒక్కరూ సలహాలు ఇవ్వడం, పాటలు యాడ్ చేయడం, ఎలివేషన్స్ పెట్టడం ఇవన్నీ చేయడంతో అసలు స్క్రిప్ట్ ఏటో పోయినట్టుగా అనిపించింది. 'స్పార్క్' జర్నీతో నాకు చాలా విషయాలు అర్థం అయ్యాయి. మనం అనుకున్నదే తీయాలి.. ఎవరో ఏదో చెబితే మార్చుకోకూడదు.. అని తెలుసుకున్నాను.
- 'సంతాన ప్రాప్తిరస్తు'లో విక్రాంత్ కాదు... చైతన్య కనిపించాలి. ఇష్టం ఉన్నట్టుగా తినేవాడు.. ఎప్పుడూ కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తుండేవాడు.. సిగరెట్లు, మందు ఇలా అన్ని అలవాట్లు ఉండే ఓ మిడిల్ క్లాస్ మ్యాన్‌గా కనిపించాలి.. దాని కోసం ఓ ఐదు కిలోల బరువు పెరగాలి.. క్రాఫ్ కూడా మార్చుకోవాలి అని దర్శకుడు చెప్పారు. కొన్ని రోజులు టైం తీసుకుని అన్నీ చేసి విక్రాంత్ నుంచి చైతన్యలా మారి సెట్ మీదకు వెళ్లాను.
- చాందినీతో కలిసి వర్క్ షాప్ చేశాను. ఆమె ఎంతో సరదాగా ఉంటారు. అందరూ సెట్‌లో సరదాగా ఉండేవారు. దాంతో నాక్కూడా ఎక్కువ ఇబ్బంది పడిన సందర్భాలు రాలేదు. 'కలర్ ఫోటో' లాంటి ఎమోషనల్ సీన్ కూడా ఇందులో ఉంటుంది. ఆ సీన్‌లో చాందినీ అద్భుతంగా నటించారు.
- నాకు సంగీత దర్శకుడు హేషమ్‌తో మంచి అనుబంధం ఉంది. ఈ కథలో ఓ పాటకు ఆయన వాయిస్ అయితే బాగుంటుందని అడిగాను. కథ, సాంగ్ విని పాడేందుకు ఆయన ముందుకు వచ్చారు. హేషమ్ పాడిన ఆ పాట అద్భుతంగా వచ్చింది. వెన్నెల కిషోర్ గారితో మాత్రం దర్శకుడే పాడించారు. సినిమాలో కూడా ఆయన పాత్ర మీదుగానే ఆ సాంగ్ వస్తుంది. అందుకే వెన్నెల కిషోర్ గారితోనే పాడించారు.
- దర్శకుడు సంజీవ్ గారి మేకింగ్ అద్భుతంగా ఉంది. ఆయన రాసిన స్క్రిప్ట్, తీసిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిత్రంతో ఆయనకు మరింత మంచి పేరు, మంచి విజయం లభిస్తుంది.
Also Read: 'కాంత'ను కోర్టుకు లాగిన సూపర్ స్టార్ ఫ్యామిలీ... అసలు ఇష్యూ ఏమిటంటే?






















