UI Teaser: విజువల్స్ లేకుండానే ‘UI’ మూవీ టీజర్ - చీకటి, శబ్దాలతోనే ఉపేంద్ర మ్యాజిక్
ఇప్పటివరకు డైలాగులు లేని, మ్యూజిక్ లేని టీజర్లు ఎన్నో చూసుంటాం. కానీ మొదటిసారి అసలు విజువల్స్ లేని, పూర్తిగా చీకటిలో శబ్దాలతో నిండిన టీజర్‌ను చూడబోతున్నాం.
కన్నడ నటుడు ఉపేంద్ర సినిమా అంటేనే ఏదో కొత్తదనం ఉంటుందని ఊహించుకోవచ్చు. తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘UI’ చిత్రం కూడా ఆ కోవకు చెందినదే. సినిమా సంగతి ఎలా ఉన్నా.. ఆయన టైటిల్, టీజర్‌తోనే ఎన్నో అంచనాలు పెంచేశారు. సోమవారం ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే.. తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇది చూశాక.. ఇదేంటీ డైలాగులు వస్తున్నాయి.. మనుషులు కనపడటం లేదు.. స్క్రీన్ పోయిందా? లేదా ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వచ్చిందా అని అనుకోవద్దు. ఎందుకంటే.. ఈ టీజర్ మొత్తం చీకటిగానే ఉంటుంది. కేవలం మ్యూజిక్‌తో మాటలతో మ్యాజిక్ చేస్తూ ఈ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని లేదా.. హోమ్ థియేటర్‌లో చూసినా.. భలే థ్రిల్ కలుగుతుంది.
ఇది ఏఐ వరల్డ్ కాదు.. యూఐ వరల్డ్..
‘యూఐ’ టీజర్ అంతా చీకటిగానే ఉంటుంది. ‘చీకటి.. అంతా చీకటి.. అసలు ఎలాంటి చోటు?’ అన్న డైలాగుతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నీళ్ల శబ్దం, గుర్రాల పరుగుల శబ్దం, ఆకలి అంటూ కొందరి ఆర్తనాదాలు, ఏడుపులు, తుపాకీ శబ్దం.. ఇలా అన్ని శబ్దాలతోనే ఈ టీజర్ నిండిపోయింది. ‘ఈ చీకటి నుండి తప్పించుకోవడం ఎలా?’ అంటూ డైలాగ్ కూడా వినిపిస్తుంది. చివరిగా ఏదో గొడవ అవుతున్నట్టుగా, మనిషిని మనిషి చంపుకుంటున్నట్టుగా కూడా శబ్దాలు వినిపిస్తాయి. ‘ఇది ఏఐ వరల్డ్ కాదు.. ఇది యూఐ వరల్డ్. ఇక్కడ నుండి తప్పించుకోవాలంటే నీ బుద్ధి బలాన్ని ఉపయోగించాలి’ అని ఒక అమ్మాయి గొంతుతో డైలాగ్ వినిపిస్తుంది. అక్కడితో టీజర్ అయిపోతుంది. ‘ఈ టీజర్ మీ ఊహకోసమే’ అంటూ టీజర్‌ను ముగించింది మూవీ టీమ్. ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు టీజర్‌ను ఇక్కడ చూడండి.
ఫ్యాన్స్‌తో ఉప్పీ సందడి..
ఉపేంద్ర ఒకప్పుడు కన్నడలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకొని ఎప్పుడూ తన ఫ్యాన్స్‌కు ఏదో కొత్తదనాన్ని పరిచయం చేయాలన్నదే ఉపేంద్ర ఆలోచన. అందుకే అప్పట్లోనే కొన్ని బోల్డ్ కథలను ఎంచుకొని సినిమాలను తీశాడు. యాక్టర్‌గా మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లలో ఉపేంద్ర.. వెండితెరపై అంత యాక్టివ్‌గా లేరు. చాలాకాలం తర్వాత మళ్లీ ఆయనే దర్శకత్వం వహిస్తూ.. నటిస్తున్న చిత్రం ‘యూఐ’. తన పుట్టినరోజు సందర్భంగా బెంగుళూరులోని ఊర్వశి థియేటర్‌లో తన ఫ్యాన్స్‌ను కలిసిన ఉపేంద్ర.. ‘యూఐ’ టీజర్‌ను విడుదల చేశారు.
సినిమా మొత్తం చీకటేనా..?
‘యూఐ’ టీజర్ చూసిన ప్రతీ ఒక్కరూ ఇది చాలా వైవిధ్యభరితంగా ఉంది అంటూ టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఒక కమర్షియల్ సినిమా అనుకోవాలా? లేక యాక్షన్ సినిమా అనుకోవాలా? లేదా సినిమా కూడా మొత్తం ఇలా చీకటిగానే ఉంటుందా? అంటూ ప్రేక్షకుల్లో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. మొత్తానికి ఒక్క టీజర్‌తోనే అందరిలో ఒక రకమైన ఆసక్తిని రేకెత్తించే విషయంలో మూవీ టీమ్ పూర్తిగా సక్సెస్ సాధించింది. ఉపేంద్ర డైరెక్ట్ చేసి, నటించిన ఈ చిత్రాన్ని లహరీ ఫిల్మ్స్ పతాకంపై జీ మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ కోసం ఉప్పీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: హీరో నాగార్జున సోదరిపై పోలీస్ కేసు - సుశాంత్ సినిమాల వల్లే గొడవలు అంటూ ప్రచారం!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial