(Source: ECI/ABP News/ABP Majha)
Friendship Movies in Telugu: హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే - స్నేహం విలువ చెప్పే టాలీవుడ్ సినిమాలు, మీ ఫ్రెండ్స్‌తో కలిసి చూడండి
Friendship Movies: ప్రతీ ఎమోషన్‌ను ప్రేక్షకుల మనసుకు హత్తుకునే చెప్పే తెలుగు సినిమాలు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా ఫ్రెండ్‌షిప్ గురించి గొప్పగా వివరించిన సినిమాలు కూడా ఉన్నాయి.
Telugu Movies Based On Friendship: కొన్ని బంధాలను మాటల్లో వర్ణించలేం. అలాంటి రిలేషన్‌షిప్స్‌లో ఫ్రెండ్‌షిప్ కూడా ఒకటి. ఎలాంటి ఫీలింగ్ గురించి అయినా ప్రేక్షకులను మెప్పించేలా చెప్పే దర్శకులు కొందరు ఉంటారు. అలాగే ఫ్రెండ్‌షిప్ కాన్సెప్ట్‌పై సినిమాలు తెరకెక్కించి.. హిట్ కొట్టిన మేకర్స్ కూడా ఉన్నారు. అలా తెలుగులో ఫ్రెండ్‌ఫిప్ కాన్సెప్ట్‌పై తెరకెక్కిన చిత్రాలు ఎన్నో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మీ స్నేహితులతో కలిసి ఈ సినిమాలు చూస్తూ చిల్ అవ్వండి..
ప్రేమదేశం
టైటిల్‌లో ఉన్నట్టుగానే ‘ప్రేమదేశం’ సినిమా.. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిల ప్రేమకథ చుట్టూ తిరుగుతుంది. కానీ అంతకంటే ఎక్కువగా ఇందులో ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్‌ను ప్రేక్షకులకు చూపించారు దర్శకుడు కదిర్. 1996లో విడుదలయిన ఈ సినిమాలో అబ్బాస్, వినీత్ బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించారు. మూవీ విడుదలయ్యి దాదాపు 30 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఇందులోని ‘ముస్తఫా ముస్తఫా’ అనే పాటను ప్రతీ ఫ్రెండ్‌షిప్ డేకు పాడుకుంటూనే ఉన్నాం.
స్నేహం కోసం
స్నేహితుల కోసం ఏమైనా చేసే ఫ్రెండ్స్ ఉంటారని ‘స్నేహం కోసం’ సినిమా చూసిన ప్రతీసారి ప్రేక్షకులకు అనిపించక తప్పదు. ఇందులో చిరంజీవి, విజయ్ కుమార్ మధ్య ఫ్రెండ్‌షిప్‌ను అంత గొప్పగా చూపించారు దర్శకుడు కేఎస్ రవికుమార్. ఇప్పటికీ ఈ మూవీ క్లైమాక్స్ చాలామంది ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ఇలాంటి క్లైమాక్స్ ఫ్రెండ్‌షిప్ సినిమాల్లోనే ఎవర్‌గ్రీన్ అని ఇప్పటికీ ఫ్యాన్స్ అంటుంటారు.
వసంతం
ఒకప్పుడు అబ్బాయి, అమ్మాయి ఫ్రెండ్‌షిప్ ఆధారంగా తెరకెక్కిన సినిమాలు గ్యారెంటీగా హిట్ సాధిస్తాయి అని నమ్మకంతో ఉండేవారు మేకర్స్. అలాంటి కాన్సెప్ట్‌తో ముందుగా తెలుగులో తెరకెక్కిన చిత్రం ‘వసంతం’. ఇందులో వెంకటేశ్, కళ్యాణి బెస్ట్ ఫ్రెండ్స్‌గా నటించారు. ఒక అబ్బాయి, అమ్మాయి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. వారి ఫ్రెండ్‌షిప్‌ను వదులుకోకుండా ఉండడం ఎంత కష్టమో ఈ సినిమాలో చూపించారు.
హ్యాపీ డేస్
‘హ్యాపీ డేస్’ మూవీ గురించి ఈతరం ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. దీంతో జీవితాంతం యూత్‌కు గుర్తుండిపోయే సినిమాను అందించారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా వచ్చి 17 ఏళ్లు అయినా కూడా ఇప్పటికీ ‘హ్యాపీ డేస్’ చూసే ఇంజనీరింగ్‌లో జాయిన్ అయ్యాం అని చెప్పుకునేవారు చాలామంది ఉంటారు. 8 మంది స్నేహితులు, వారి జీవితాల చుట్టూ తిరిగే కథే ‘హ్యాపీ డేస్’.
ఉన్నది ఒకటే జిందగీ
రామ్ కెరీర్‌లో తన ఫ్యాన్స్ చాలామందికి ఫేవరెట్‌గా నిలిచిన మూవీ ‘ఉన్నది ఒకటే జిందగీ’. ఒక అమ్మాయి వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య మనస్పర్థలు రావడం అనే కాన్సెప్ట్‌తో పలు చిత్రాలు వచ్చినా కూడా ఈ సినిమాను ఈతరం యూత్‌కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు కిషోర్ తిరుమల. ఇప్పటికీ ఈ సినిమా, ఇందులోని పాటలు, రామ్ - శ్రీ విష్ణు నటన చాలామందికి ఫేవరెట్‌గా నిలిచిపోయింది.
ఓ మై ఫ్రెండ్
ఒక అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్‌గా ఉండలేరు. ఏదో ఒకరోజు వారిద్దరూ ప్రేమికులుగా మారుతారు అని చెప్తూ అప్పట్లో వరుసగా సినిమాలు వచ్చాయి. కానీ ఆ స్ట్రీక్‌ను బ్రేక్ చేస్తూ అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్‌గా ఉండగలరు అని చూపించిన సినిమా ‘ఓ మై ఫ్రెండ్’. ఈరోజుల్లో యూత్‌కు కనెక్ట్ అయ్యే డైలాగ్స్‌తో సిద్ధార్థ్, శృతి హాసన్ ఫ్రెండ్స్‌గా నేచురల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కేరింత
‘హ్యాపీ డేస్’ తర్వాత అదే తరహాలో కాలేజ్ స్టోరీతో పలు చిత్రాలు వచ్చాయి. కానీ అవేవి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. ఆ రేంజ్‌లో కాకపోయినా దానికి కాస్త చేరువగా వచ్చిన సినిమా ‘కేరింత’. ఇది కూడా 8 మంది స్నేహితులు, వారి జీవితాలకు సంబంధించిన కథ. కాలేజ్ అనేది ఫ్రెండ్స్‌ను ఎలా దగ్గర చేస్తుంది, జీవితం అంటే ఏంటో ఎలా నేర్పిస్తుంది అని ఈ సినిమాలో చూపించారు.
స్నేహితుడు
చెప్పడానికి ఇది ఒక డబ్బింగ్ చిత్రమే అయినా ‘స్నేహితుడు’ సినిమా చాలామంది ప్రేక్షకుల మనసులకు దగ్గరయ్యింది. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ అయిన ‘3 ఇడియట్స్’కు రీమేక్‌గా తెరకెక్కింది ఈ చిత్రం. హిందీలో ఈ సినిమాను చూడని చాలామంది తెలుగులో చూసి ఫిదా అయ్యారు. ఫ్రెండ్స్ అనేవారు మనకు మంచి మార్గాన్ని చూపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తారన్నదే ‘స్నేహితుడు’ సినిమా కాన్సెప్ట్.
ఇక ఈ ఆగస్టు నెలలో రిలీజ్ కానున్న ‘ఆయ్’, ‘కమిటీ కుర్రాళ్లు’ సినిమాలు కూడా ఫ్రెండ్‌షిప్ నేపథ్యంతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాబట్టి.. ఆ సినిమాలను కూడా మీ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చెయ్యండి.
Also Read: ‘ఐబొమ్మ’ పేరు మారిందట.. ఇకపై కొత్త సినిమాలన్నీ అందులోనే!