Yogi Babu: కోలీవుడ్ ‘బ్రహ్మి’ యోగిబాబు - సీరియస్‌గానే కితకితలు పెట్టే ఈ కమెడియన్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
కోలీవుడ్‌లో వడివేలు తర్వాత ఆ రేంజ్ కమెడియన్ ఎక్కడ దొరుకుతాడు అనుకుంటున్న సమయంలో యోగి బాబుకు ఇంత ఫేమ్ రావడం చూసి తనే నెక్స్‌ట్ వడివేలు అంటూ కొందరు కోలీవుడ్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు. చెప్పాలంటే.. కొన్ని సినిమాలను ఆయనే ఒంటి చెత్తో పైకి లేపిన సందర్భాలున్నాయి. అయితే, బ్రహ్మీతో ఎవరినీ సరిపోల్చలేం. ఆయన టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్, నటనకు పోటీ ఇచ్చే కమెడియన్ ఇప్పట్లో దొరకడం కష్టమే. అయితే, ఆయనలా మంచి క్రేజ్‌ను సంపాదిస్తున్న ఈ కమెడియన్ గురించి మాత్రం మనం తప్పకుండా చెప్పుకోవల్సిందే. కామెడీ విషయంలో బ్రహ్మానందంతో పోల్చలేం. కానీ, తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కట్టిపడేయడం ఇతడి ప్రత్యేకత. మనిషి సీరియస్‌గా చూసినా సరే.. ప్రేక్షకులు నవ్వేస్తుంటారు. అతడు ఎంట్రీ ఇస్తే చాలు.. బోరింగ్‌గా సాగుతున్న మూవీ కాస్త.. ఎంటర్‌టైన్మెంట్‌తో నిండిపోతుంది. అతడు మరెవ్వరో కాదు.. కోలీవుడ్ సూపర్ కమెడియన్ యోగి బాబు. ఇప్పుడు ఆయన లేని మూవీ అంటూ లేదు. ఏ మూవీ చూసినా ఇప్పుడు ఆయనే కనిపిస్తున్నారు. అంతేకాదు.. హీరోగా కూడా కొన్ని సామాజిక, కామెడీ సినిమాలతో అలరిస్తున్నారు.
బాబు నుంచి యోగి బాబుగా..
యోగి బాబు అసలు పేరు బాబు. 2009లో ‘యోగి’ అనే తమిళ చిత్రంలో నటించి ఫేమస్ అవ్వడంతో అప్పటినుంచి ప్రేక్షకులు తనను యోగి బాబుగా గుర్తుపెట్టుకున్నారు. అలా కామెడియన్‌గా కెరీర్ మొదట్లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నా కూడా యోగి బాబుకు వెంటవెంటనే అవకాశాలు రావడానికి మాత్రం కాస్త సమయం పట్టింది. దాదాపు 2014 నుంచి యోగి బాబు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రతీ ఏడాది అరడజను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, వారిని నవ్వుల్లో ముంచేసేవాడు. మెల్లగా అవకాశాలు పెరిగాయి. ఇప్పుడైతే ఏకంగా ఏడాదికి 10కు పైగా చిత్రాల్లో నటిస్తున్నాడు యోగి బాబు. ఇక గత రెండు, మూడు సంవత్సరాల్లో యోగిబాబు లేకపోతే సినిమానే లేదు అన్నట్టుగా అయిపోయింది కోలీవుడ్ పరిస్థితి.
వడివేలు తర్వాతి స్థానంలోకి..
తెలుగులో బ్రహ్మానందం లాగా తమిళంలో వడివేలు గొప్ప నటుడిగా, కామెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక కోలీవుడ్‌లో వడివేలు తర్వాత ఆ రేంజ్ కమెడియన్ ఎక్కడ దొరుకుతాడు అనుకుంటున్న సమయంలో యోగి బాబుకు ఇంత ఫేమ్ రావడం చూసి తనే నెక్స్‌ట్ వడివేలు అంటూ కొందరు కోలీవుడ్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. చూడడానికి ఎలా ఉన్నారు అనేది ముఖ్యం కాదు. ఎంత టాలెంట్ ఉంది అన్నది ముఖ్యం, ఆ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి అవకాశాలు ఎలా దక్కించుకుంటున్నారు అన్నది ముఖ్యం, ఎవరు ఎంత అవమానించినా వెనక్కి తగ్గకుండా బలంగా ఎలా నిలబడ్డారు అన్నది ముఖ్యం. ఇవన్నీ మనకు యోగి బాబులో కనిపిస్తాయి.
నయనతార సరసన లీడ్ రోల్‌లో..
2018, 2019 సంవత్సరాల్లో యోగి బాబు దాదాపుగా ఏడాదికి 20 సినిమాల్లో నటించాడు. అందులో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ‘కొలమావు కోకిల’ కూడా ఒకటి. అసలు నువ్వు కామెడియన్ ఏంటి అని యోగి బాబును అవమానించిన వారికి.. ‘కొలమావు కోకిల’లో హీరోగా నటించి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా.. ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రమే అయినా ఇందులో నయనతారకు సమానంగా ప్రాముఖ్యత ఉన్న పాత్రలో యోగి బాబు కనిపించాడు. ఈ కథ తన దగ్గరకు వచ్చినప్పుడు, నయనతారతో సమానమైన పాత్ర అని విన్నప్పుడు అసలు నమ్మలేకపోయానని యోగి బాబు పలు సందర్భాల్లో తన సంతోషాన్ని బయటపెట్టాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలు, సూపర్ స్టార్ల సినిమాల్లో యోగి బాబు కామెడియన్‌గా కనిపించాడు. అంతేకాదు, క్రికెటర్ ధోనీకి కూడా యోగి బాబు అంటే చాలా ఇష్టం.
దాదాపు 200 సినిమాల్లో..
2023.. ఒక్క సంవత్సరంలోనే ఇప్పటికీ 15 సినిమాల్లో నటించాడు యోగి బాబు. ఇంకా వచ్చే నెలలోనే ఎన్నో సినిమాలను విడుదలకు లైన్‌లో పెట్టాడు. యోగి బాబు కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే సినీ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. తను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 ఏళ్లే అయ్యింది. కానీ ఇప్పటికే దాదాపు 200 సినిమాల మార్క్‌కు చేరువయ్యాడు. కామెడియన్‌గా మాత్రమే కాకుండా పలు చిత్రాల్లో లీడ్ రోల్‌లో కూడా కనిపించి మెప్పించాడు యోగి బాబు. కామెడీ చేయగలిగిన వాడు ఏదైనా చేయగలడు అనే విషయాన్ని ఈ నటుడు నిరూపించాడు. కేవలం కామెడీ సీన్స్‌లో నవ్వించడం మాత్రమే కాదు.. ‘లవ్ టుడే’ లాంటి యూత్‌ఫుల్ సినిమాలో తన పాత్రతో అందరిలో ఒక ఆలోచనను కూడా పుట్టించాడు యోగి. ఇలాంటి మరపురాని పాత్రలు తన కెరీర్‌లో ఇంకా ఎన్నో ఉన్నాయి.
Also Read: థ్యాంక్స్ అనే మాట చాలా తక్కువ - రాజమౌళిపై రేణూ దేశాయ్ ప్రశంసలు, ఎందుకంటే..
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial