Editor GG Krishna Rao Is No More : 'శంకరాభరణం', 'బొబ్బిలి పులి' చిత్రాల ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత
GG Krishna Rao Passed Away : కె. విశ్వనాథ్ క్లాసిక్ సినిమాలు 'శంకరాభరణం', 'సాగర సంగమం'తో పాటు పూర్ణోదయా మూవీ క్రియేషన్స్, విజయ మాధవి ప్రొడక్షన్స్ సినిమాలకు పని చేసిన ఎడిటర్ జీజీ కృషారావు మరణించారు.
![Editor GG Krishna Rao Is No More : 'శంకరాభరణం', 'బొబ్బిలి పులి' చిత్రాల ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత GG Krishna Rao Passed Away Sankarabharanam Bobbili Puli films editor GG Krishna Rao took his last breath at Bangalore Editor GG Krishna Rao Is No More : 'శంకరాభరణం', 'బొబ్బిలి పులి' చిత్రాల ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/21/79f7053e8d8f52fc53b91206ffd1e6ae1676948257956313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు (GG Krishna Rao) ఈ రోజు ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. రెండు వందలకు పైగా సినిమాలకు ఆయన పని చేశారు. ఎంతో మంది దిగ్గజ దర్శకుల సినిమాలకు ఎడిటింగ్ చేసిన అనుభవం ఆయన సొంతం.
దిగ్గజ దర్శకుల చిత్రాలకు...
దర్శక రత్న దాసరి నారాయణ రావు, కళా తపస్వి కె. విశ్వనాథ్, బాపు, జంధ్యాలతో పాటు తెలుగులో పలువురు దిగ్గజ దర్శకులు తీసిన సినిమాలకు ఎడిటర్ గా జీజీ కృష్ణారావు సేవలు అందించారు. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్, విజయ మాధవి ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలతో ఆయన ఆస్థాన ఎడిటర్ అని చెప్పవచ్చు. కమర్షియల్ సినిమాలతో పాటు కళాత్మక చిత్రాలకు కూడా ఎడిటింగ్ చేసి శభాష్ అనిపించుకున్నారు.
'శంకరాభరణం'...
'బొబ్బిలి పులి'కీ ఆయనే!
విశ్వనాథ్ తీసిన క్లాసిక్ ఫిల్మ్స్ 'శంకరాభరణం', 'సాగర సంగమం', 'స్వాతి ముత్యం', 'శుభలేఖ', 'శృతి లయలు', 'సిరివెన్నెల', 'శుభ సంకల్పం', 'స్వరాభిషేకం' చిత్రాలకు ఎడిటర్ జీజీ కృష్ణరావే. అంతే కాదు... దాసరి నారాయణ రావు తీసిన కమర్షియల్ క్లాసిక్స్ 'బొబ్బిలి పులి', 'సర్దార్ పాపారాయుడు' సినిమాలకూ వర్క్ చేశారు. బాపు తీసిన 'శ్రీరామ రాజ్యం' సినిమాకూ పని చేశారు. జీజీ కృష్ణారావు పలు విజయవంతమైన సినిమాలకు పని చేయడం కాదు... భవిష్యత్ ఎడిటర్లకు మార్గదర్శిగా నిలిచారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
'సప్తపది', 'సాగర సంగమం', 'శుభ సంకల్పం' చిత్రాలకు ఉత్తమ ఎడిటర్ గా మూడుసార్లు ఆయన నంది అవార్డు అందుకున్నారు.
నందమూరి తారక రత్న మరణం నుంచి కోలుకోక ముందు తెలుగు చిత్రసీమ మరో విషాద వార్తను వినాల్సి వచ్చింది. వరుస మరణాలతో సినీ ప్రముఖుల కంటతడి ఆరడం లేదు. ఈ ఏడాది ప్రారంభమైన రెండు నెలలో లెజెండ్స్ కొంత మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.
కళా తపస్వి కె. విశ్వనాథ్ ఫిబ్రవరి 2న మరణించారు. తెలుగు, హిందీ భాషల్లో ఆయన ఎన్ని సినిమాలు తీశారన్నది తెలిసిన విషయమే. కళాత్మక చిత్రాలకు చిరునామాగా మారిన విశ్వనాథ్ మరణం పలువురిని కలచి వేసింది. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన మరుసటి రోజు ఫిబ్రవరి 3న ఆయన సినిమాల్లో పాటలకు గాను రెండుసార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం అందుకున్న లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ కన్ను మూశారు.
Also Read : టాలీవుడ్‌ను వణికించిన జనవరి 27 - ఒక షాక్ తర్వాత మరొక షాక్
జనవరిలో సీనియర్ నటి జమున మరణించారు. కొత్త ఏడాది మొదటి నెలలో 27వ తేదీన ఆమె కన్ను మూశారు. జనవరి 26న ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి, తమిళ ఫైట్ మాస్టర్ జూడో రత్నం మరణించారు. తమిళ హాస్య నటుడు మెయిల్ స్వామి ఫిబ్రవరి 19న మరణించారు. మహా శివరాత్రి రోజున నందమూరి తారక రత్న శివైక్యం చెందారు. జనవరి 3న సీనియర్ జర్నలిస్ట్, లిరిసిస్ట్ పెద్దాడ మూర్తి కన్ను మూశారు. 'కుందనపు బొమ్మ' సినిమాలో ఓ హీరోగా నటించిన యువ నటుడు సుధీర్ జనవరి 24న తిరిగి రాని లోకాలకు వెళ్ళారు.
Also Read : తారకరత్న వారసులు ఎంత మందికి తెలుసు? చిన్న కుమార్తె, కొడుకు కూడా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)