పిల్లలతో కలిసి ఓటీటీ కంటెంట్ ని చూడలేకపోతున్నాం : జెనీలియా
టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా తాజాగా 'ట్రయల్ పీరియడ్' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓటీటీ కంటెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన జెనీలియా బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ముఖ్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత సుమారు ఆరేళ్ల గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. తన భర్తతో కలిసి 'వేద్' అనే సినిమాలో నటించింది. తెలుగులో నాగచైతన్య, సమంత కాంబినేషన్లో తెరకెక్కిన 'మజిలీ' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. తెలుగులో 'మజిలీ' ఎంత పెద్ద హిట్ అయిందో హిందీలో 'వేద్' కూడా అంత పెద్ద హిట్ని అందుకుంది. ఇక తాజాగా జెనీలియా 'ట్రయల్ పీరియడ్' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ రంగంలో ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ జియో సినిమాలో జూలై 21 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో జెనీలియా ఓటీటీ కంటెంట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే ముందుగా సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడుతూ.." నేను మళ్లీ హిందీలో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు నా దగ్గరికి ఈ స్క్రిప్ట్ వచ్చింది. సాధారణంగా నా దగ్గరికి ఏదైనా స్క్రిప్ట్ వస్తే నేను దాన్ని చదివేందుకు ఎక్కువ టైం తీసుకుంటాను. కానీ ఈ స్క్రిప్ట్ ని మాత్రం ఒక గంటలో చదవడం పూర్తి చేశాను. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ నాకు అంత ప్రత్యేకంగా అనిపించింది. ఎంతో ఆసక్తిని కలిగించింది" అంటూ చెప్పింది.
ఇక తర్వాత ఇటీవల కాలంలో వస్తున్న ఓటీటీ కంటెంట్స్ గురించి మాట్లాడుతూ.." ఈ మధ్యకాలంలో ఓటీటీలో కుటుంబమంతా కలిసి చూసే కథలు తగ్గిపోయాయనేది నా అభిప్రాయం. నేను సాధారణంగా ఇంట్లో సినిమాలు, షోలను ఎక్కువగా చూస్తూ ఉంటాను. కానీ కొన్నిసార్లు పిల్లలతో కలిసి చూడలేను. పిల్లలతో కలిసి మేము చాలా సినిమాలు చూడలేకపోతున్నామం. సినిమాలు అనేవి మన కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండాలి. ఎన్నో సంవత్సరాలుగా ఇది ఒక సాంప్రదాయంగా వస్తుంది. అలా మనం కొన్నేళ్లుగా కుటుంబంతో కలిసి చూస్తూ పెరిగిన సినిమాలను చూడాలని ఇప్పటికీ ఆశిస్తున్నాను. అలాంటి సినిమా చేయడం కోసమే ఈ ట్రయల్ పీరియడ్ కథను ఎంచుకున్నాను. ఈ సిరీస్ ను కుటుంబమంతా కలిసి చూడొచ్చు" అంటూ పేర్కొంది జెనీలియా.
ఇక ఈ 'ట్రయల్ పీరియడ్' వెబ్ సిరీస్ లో జెనీలియా సింగిల్ మదరగా కనిపించనుంది. అలేయా సేన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పటికే హిందీలో రీఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. త్వరలో టాలీవుడ్ లో కూడా మెరువబోతోంది. తెలుగులో 'జూనియర్' అనే సినిమాలో జెనీలియా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. సుమారు 11 ఏళ్ల విరామం తర్వాత జెనీలియా తెలుగులో నటిస్తున్న సినిమా ఇది. దీంతో జెనీలియా రీ ఎంట్రీ కోసం తెలుగు ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికే రీ ఎంట్రీ తో హిందీలో సక్సెస్ అయిన జెనీలియా.. 'జూనియర్' తో తెలుగులో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.
Also Read : బాలయ్య 'భగవంత్ కేసరి' ఆ హిందీ సినిమాకి కాపీనా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial