Gautham Menon: మనశ్శాంతి లేదు.. ఎటైనా వెళ్లిపోవాలని ఉంది - 'ధృవ నక్షత్రం' వాయిదాపై గౌతమ్ మేనన్ ఆవేదన!
Gautham Vasudev Menon: విక్రమ్ హీరోగా తన దర్శక నిర్మాణంలో తెరకెక్కిన 'ధృవ నక్షత్రం' సినిమా విడుదల వాయిదా పడుతుండటంపై దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ అసహనం వ్యక్తం చేశారు.
Gautham Vasudev Menon: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'ధృవ నక్షత్రం'. ఏ ముహూర్తాన ఈ సినిమా నిర్మాణం మొదలు పెట్టారో తెలియదు కానీ, ప్రారంభం నుంచీ ఈ ప్రాజెక్ట్ కు అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నాయి కానీ, సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకి రావడం లేదు. వివిధ కారణాలతో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై దర్శకుడు తాజాగా స్పందించారు. ఈ సినిమా వల్ల మనశ్శాంతి కరువైందని, తనతో సహా ఫ్యామిలీ అంతా చాలా బాధను అనుభవిస్తున్నారని, ఎటైనా వెళ్లిపోవాలని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ తాజాగా 'ధృవ నక్షత్రం' సినిమా విడుదలపై మాట్లాడుతూ.. ''ఇది చాలా హృదయ విదారకంగా ఉంది. ఈ సినిమా విడుదల వాయిదా పడుతుండంతో ఎన్నో రోజులుగా మనశ్శాంతి లేకుండా పోయింది. నా కుటుంబం ఆందోళన చెందుతోంది. నా భార్య నెల రోజులుగా ఈ విషయమే ఆలోచిస్తోంది. నాకు ఎటైనా వెళ్లిపోవాలని అనిపిస్తోంది. కానీ, పెట్టుబడిదారులకు సమాధానం చెప్పాలని ఉంటున్నాను. మార్చి 1న 'జాషువా' సినిమా రిలీజ్ కానుంది. దీని కంటే ముందే 'ధృవ నక్షత్రం' విడుదల చేయాలని భావించాం కానీ, అది కుదరలేదు'' అని అసహనం వ్యక్తం చేశారు.
'ధృవ నక్షత్రం' సినిమా 2015 లోనే సెట్స్ మీదకు వెళ్ళింది. వీలయినంత త్వరగా పూర్తి చేసి 2017లో విడుదల చెయ్యాలని మేకర్స్ భావించారు. 2018లో రిలీజ్ పోస్టర్ వదిలారు. కానీ ఆర్థిక ఇబ్బందులతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నిలిచిపోయింది. గతంలో గౌతమ్ మీనన్ - శింబు కాంబినేషన్‌లో ఓ సినిమా కమిటై, పూర్తి పోవడంతో ఆల్ ఇన్ పిక్చర్స్ నిర్మాత కోర్టుకెల్లాడు. రూ.2.40 కోట్లు అడ్వాన్స్ తీసుకొని కూడా సినిమాని పూర్తి చేయలేదని, డబ్బు తిరిగి ఇవ్వలేదని చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నగదు తిరిగి చెల్లించేవరకూ 'ధృవ నక్షత్రం' విడుదలను ఆపివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతుండంతో విడుదల వాయిదా మీద వాయిదాలు పడుతూ వస్తోంది.
విక్రమ్ నటించిన 'పాన్నియన్ సెల్వన్' సినిమా హిట్టయిన తర్వాత, 'ధృవ నక్షత్రం' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావించారు. ఫైనల్ గా 2023 దీపావళికి రిలీజ్ అని అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలు పెట్టారు. కానీ చివరి నిమిషంలో వాయిదా పడటంతో, దర్శక నిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ అభిమానులకు క్షమాపణలు కోరుతూ ఓ ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. 2023 డిసెంబర్ 8న రిలీజ్ చేస్తారని అనుకున్నారు కానీ, ఇప్పటికీ మోక్షం కలగలేదు. ఈ నేపథ్యంలోనే దర్శకుడు తాజాగా విచారం వ్యక్తం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'ధృవ నక్షత్రం' సినిమాలో విక్రమ్ సరసన ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రీతూ వర్మ - ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. సిమ్రన్, రాధిక, దివ్య దర్శిణి, పార్థీబన్, విక్రమన్, అర్జున్ దాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. హరీష్ జైరాజ్ సంగీతం సమకూర్చారు. గతంలో విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలాగైనా అన్ని అడ్డంకులు దాటుకొని ఈ సినిమా రిలీజ్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: కమెడియన్.. హీరో.. విలన్.. ఏదైనా నీకే సాధ్యమెహే - సునీల్ గురించి ఈ విషయాలు తెలుసా?