Game Changer Ticket Price: 'గేమ్ ఛేంజర్'కు కీలకంగా మారనున్న టికెట్ రేట్లు... ఇప్పుడు తగ్గాల్సిందేనా?
Game Changer Movie Ticket rates : ఈ సంక్రాంతి సీజన్ కి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో 'గేమ్ ఛేంజర్' టికెట్ రేట్ల పెంపు విషయం కీలకంగా మారబోతోంది.
2025 కొత్త ఏడాది థియేటర్లలో 'గేమ్ ఛేంజర్' జాతరతో షురూ కాబోతోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీ జనవరి 10న పొంగల్ కానుకగా రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా టాలీవుడ్ లో జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ సినిమాకు స్పెషల్ షోలు, టికెట్ రేట్ల సంగతి ఎలా ఉండబోతుందా అన్న ఆసక్తి మొదలైంది. 'గేమ్ ఛేంజర్' విషయంలో టికెట్ రేట్లు కీలకంగా మారబోతున్నాయి.
కలెక్షన్లపై టికెట్ రేట్ల ఎఫెక్ట్
గత కొన్ని నెలల నుంచి పాన్ ఇండియా సినిమాలకు పెరుగుతున్న టికెట్ ధరలు ప్రేక్షకులపై భారీగా భారాన్ని మోపుతున్నాయి. ఓవైపు సినిమా వర్గాలు, మరోవైపు ప్రేక్షకులు అందనంత ఎత్తుకు పెరిగిపోతున్న సినిమా టికెట్ ధరలపై విమర్శలు గుప్పిస్తున్నారు. రీసెంట్ గా 'పుష్ప 2' విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలు భారీగా పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా మూవీ టికెట్ రేట్లు పెరిగాయి. కానీ దీనిపై ప్రేక్షకుల నుంచి తీవ్రమైన నెగెటివిటీ వచ్చింది. సినిమాకు మంచి మౌత్ టాక్ వచ్చినప్పటికీ, కలెక్షన్ల విషయంలో ఎదురైన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత టికెట్ ధరలు తగ్గించక తప్పలేదు మేకర్స్ కు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రేట్లు ఈ సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపించాయి. కానీ టికెట్ రేట్లను కాస్త తగ్గించిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వేగం పుంజుకున్న సంగతి తెలిసిందే. దీన్ని ఒక ఉదాహరణగా చూసుకుంటే సినిమా కలెక్షన్లపై టికెట్ ధరల ప్రభావం స్ట్రాంగ్ గా ఉందన్న విషయం తెలిసిపోతుంది. ఇక ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' వంతు వచ్చింది. కానీ అసలు ఈ సినిమాకు తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ఉంటుందా అన్నది డౌటే.
తెలంగాణ ముఖ్యమంత్రి షాకింగ్ నిర్ణయం
రీసెంట్ గా సంధ్యా థియేటర్ సంఘటనను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇకపై తను సీఎం గా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లకు తెలంగాణలో అనుమతి ఇవ్వను అని ఆయన తేల్చారు. దీంతో రానున్న పెద్ద సినిమాల మేకర్స్ తలలు పట్టుకున్నారు. అయితే రీసెంట్ గా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ పెద్దల బృందం ముఖ్యమంత్రితో భేటీ అయిన తరువాత ముఖ్యమంత్రి నిర్ణయంలో ఏదైనా మార్పు ఉంటుందా అనేది చూడాలి.
టాలీవుడ్ ముఖ్యమైన పండగగా భావించేది సంక్రాంతి సీజన్, సమ్మర్ హాలిడేస్ నే. అందుకే ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సంక్రాంతి సీజన్ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో సినిమా టికెట్ రేట్లను భారీగా పెంచకపోవడమే బెస్ట్ అంటున్నారు సినీ విశ్లేషకులు. సినిమా బాగుంటే తక్కువ టికెట్ రేట్లతో కూడా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించవచ్చు. ఒకవేళ సినిమా అంచనాలను అందుకుంటే రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉంటారు. కాబట్టి మేకర్స్ టికెట్ ధరలను నిర్ణయించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే బెటర్. అయితే ఈ సంక్రాంతి సీజన్ కి పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' టికెట్ ధరలు కీలకం కాబోతున్నాయి. 'గేమ్ ఛేంజర్' టీం తీసుకునే నిర్ణయమే మిగతా రెండు సంక్రాంతి సినిమాలు 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలపై పరోక్షంగా ప్రభావం చూపించబోతున్నాయి. మరి ఇలాంటి క్రూషియల్ టైంలో 'గేమ్ ఛేంజర్' నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. ఇక మిగతా రెండు సినిమాల విషయానికొస్తే... నిజానికి మంచి బజ్ ఉంది కాబట్టి, ఈ సినిమాలకు టికెట్ రేట్లు పెద్దగా పెంచకపోయినా వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు.
Also Read: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?