Elvish Yadav: రేవ్ పార్టీలకు పాము విషం సరఫరా చేస్తున్న ‘బిగ్ బాస్’ విన్నర్ - ఇంతకీ ఆ విషాన్ని ఏం చేస్తారు?
బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. రేవ్ పార్టీ కోసం ఏకంగా పాము విషం ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో ఆయన వెల్లడించాడు.
Elvish Yadav Case: బిగ్ బాస్ ఓటీటీ విజేత, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ కేసు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రేవ్ పార్టీల కోసం పాము విషాన్ని సరఫరా చేయడంతో పాటు పాములను తీసుకొచ్చినట్లు వెల్లడించాడు. గత ఏడాది రేవ్ పార్టీలకు పాము విషం సరఫరా చేసిన వారితోనూ తనకు సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. చాలా కాలంగా రేవ్ పార్టీలు నిర్వహించడంతో పాటు వచ్చిన వారికి విషాన్ని అందించినట్లు ఒప్పుకున్నారు.
అసలు నిజం ఒప్పుకున్న ఎల్విష్ యాదవ్
గత ఏడాది నోయిడా రేవ్ పార్టీపై దాడి చేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. వారిలో ఎక్కువగా పాములను ఆడించే వారు ఉన్నారు. ఈ సందర్భంగా పాము విషంతో పాటు 9 విష సర్పాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ రైడ్ నిర్వహించారు. ఈ కేసులో ఎల్విష్ పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. కొంతకాలంగా పరారీలో ఉన్న అతడిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల పాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. తొలుత ఈ కేసులో తనకు ఎలాంటి పాత్ర లేదని వాదించిన ఎల్విష్, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాన్ని చెప్పారు. ఇప్పటికే పలు రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరాఫరా చేసినట్లు చెప్పారు. అంతేకాదు, రేవ్ పార్టీలకు విషం సరఫరా చేసే వారితోనూ తనకు సంబంధాలు ఉన్నట్లు తెలిపారు.
నాన్ బెయిలబుల్ కేసు, కఠిన శిక్ష పడే అవకాశం
ఎల్విష్ యాదవ్‌పై వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద పోలీసులు కేసు బుక్ చేశారు. ప్రస్తుతం అతడిని నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రాఫిక్ పదార్ధాలు కలిగి ఉన్న కేసులో విచారిస్తున్నారు. ఈ కేసులో బెయిల్ దొరకకపోగా, అతనికి కఠిన శిక్ష విధించే అవకాశం ఉంటుంది. బాలీవుడ్ గాయకుడు ఫజిల్‌పురియా తన పార్టీలకు పాములను ఆర్గనైజ్ చేసేవాడని గతంలోనే ఎల్విష్ యాదవ్ పోలీసులు చెప్పాడు. పాములు ఆడించే వారి సాయంతో రేవ్ పార్టీలకు వచ్చే వారికి విషం అందించే వాడు. వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని పాములు ఆడించే వారికి ఇచ్చేవాడు. ఈ విషయాన్ని రేవ్ పార్టీపై దాడి సందర్భంగా అరెస్ట్ అయిన పాములు పట్టేవాళ్లు పోలీసులకు వెల్లడించారు. ఎల్విష్ ఇప్పటి వరకు 6 రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఎల్విష్‌తో సంబంధం ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, రేవ్ పార్టీల్లో పాల్గొన్న వారిని సైతం పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
పాము విషంతో ఏం చేస్తారంటే?
నాగు పాములు అత్యంత విషపూరిత జీవులు. వీటి విషం చాలా ప్రమాదకరం. గత కొంత కాలంగా రేవ్ పార్టీలలో నాగుపాము విషాన్ని వినియోగిస్తున్నారు. నేరుగా విషం రూపంలో కాకుండా పౌడర్ రూపంలోకి మార్చి తీసుకుంటున్నారు. పాము విషం పౌడర్ తీసుకోవడం వల్ల విపరీతమైన మత్తు కలుగుతుంది. దీని ప్రభావం సుమారు 5 రోజుల వరకు ఉంటుంది. అలసిపోకుండా గంటల తరపడి డ్యాన్స్ చేసే శక్తి లభిస్తుంది. అఫిడిజం అనే పిలిచే ఈ వ్యసనం విదేశాల్లో బాగా పాపులర్. ఇప్పుడు భారత్ లోనూ అడుగు పెట్టింది. వాస్తవానికి పాము విషం అలవాటు అనేది చాలా డేంజరస్. ఈ వ్యసనం ఉన్నవాళ్లు శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులకు గురవుతారు. నిజానికి పాము విషంతోనే పాముకాటు విరుగుడు మందు తయారు చేస్తారు. పాము విషానికి చాలా డిమాండ్ ఉంది. కానీ, ఇప్పుడు రేవ్ పార్టీల్లో పాము విషాన్ని వాడటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
View this post on Instagram
Read Also: శ్రీకాంత్ అడ్డాల మెచ్చిన పాట - యువత మనసు దోచేలా 18 ఏళ్ల యువకుడి 'ప్రేమే'