Suresh Sangaiah: తమిళ సినిమా పరిశ్రమలో విషాదం... లివర్ సంబంధిత సమస్యలతో యంగ్ డైరెక్టర్ మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తమిళ యువ దర్శకుడు సురేష్ సంగయ్య చనిపోయారు. గత కొద్ది రోజులుగా కాలేయ సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్సపొందుతూ కన్నుమూశారు.
Suresh Sangaiah Death: గత కొంత కాలంగా సినీ పరిశ్రమలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పలు కారణాలతో సినీ సెలబ్రిటీలు చనిపోతున్నారు. కొంతమంది వృద్ధాప్యంతో కన్నుమూస్తే, మరికొంత మంది ఆత్మహత్యలు, అనారోగ్య సమస్యలతో భూమ్మీది నుంచి వెళ్లిపోతున్నారు. రీసెంట్ గా ఓ కన్నడ డైరెక్టర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఓ సీనియర్ తమిళ నటుడు వయో సంబంధిత సమస్యలతో బాధపడుతూ చనిపోయారు. తాజాగా ఓ యువ తమిళ దర్శకుడు చనిపోయారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న డైరెక్టర్ సురేష్ సంగయ్య చికిత్స పొందుతూ చనిపోయారు.
కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడిన సురేష్
సురేష్ సంగయ్య గత ఏడాది కాలంగా లివర్ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కామెర్లు సోకడంతో పరిస్థితి మరింత విషమించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను రాజీవ్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఈ శుక్రవారం పరిస్థితి విషమించడంతో అర్థరాత్రి సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృత దేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఇవాళ ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. సురేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సురేష్ మరణవార్తను కన్ఫర్మ్ చేసిన ఇండస్ట్రీ మిత్రులు
సురేష్ సంగయ్య మరణ వార్తను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శరణ్ ధృవీకరించారు. వీరిద్దరు కలిసి ఓ సినిమాకు పని చేశారు. అటు దర్శకురాలు హలిత షమీమ్ కూడా సురేష్ చనిపోయారని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన తోటి మిత్రుడిని కోల్పోవడం అత్యంత బాధాకరం అంటూ సంతాపం తెలిపారు. ఎంతో భవిష్యత్ ఉన్న సురేష్ అర్థాంతరంగా చనిపోవడం తమిళ సినిమా పరిశ్రమకు తీరని లోటుగా ఆమె అభివర్ణించారు. ఆయన మృతి వార్త తెలిసి సినీ ప్రముఖులతో పాటు సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
Shocked and saddened to hear about @sureshsangaiah's passing. I've always held #OruKidayinKarunaiManu as a precious film and now with a deeper significance. pic.twitter.com/EB7F7iK0n2
— Halitha (@halithashameem) November 15, 2024
తొలి సినిమాతోనే మంచి గుర్తింపు
సురేష్ 2017లో విడుదలైన ‘ఒరు కిడైయిన్ కరుమను’ సినిమాతో దర్శకుడిగా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో విధార్థ్, రవినా హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదలై థియేటర్లలో అద్భుతంగా ఆడింది. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. పలువురు విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. గత ఏడాది ‘సత్య సోతనై’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్రలో ఓ ఓటీటీ సినిమాను కూడా తెరకెక్కించారు. ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం నటుడు సెంథిల్ తో కలిసి ఓ సినిమాను చేస్తున్నారు. ఆ సినిమాకు ఇంకా పేరును ఖరారు చేయలేదు.
Also Read: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?