'బేబీ' బీజీఎం నన్ను ఏడిపించింది, ఈ మూవీకి అతడే మొదటి హీరో: డైరెక్టర్ సాయి రాజేశ్
'బేబీ' బ్యాగ్రౌండ్ మ్యాజిక్ తనను ఏడిపించిందని, దీని కోసం గత రెండు నెలలుగా ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యామని, రోజుకి కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయామని దర్శకుడు సాయి రాజేష్ తెలిపారు.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందిన తాజా చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ శుక్రవారం (జూలై 14) వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలానే మ్యాజిక్ డైరక్టర్ విజయ్ విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. మరో మూడు రోజుల్లో పెయిడ్ ప్రీమియర్స్ పడనున్న తరుణంలో, తాజాగా బీజీఎం వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు దర్శకుడు తెలిపారు.
ఆదివారం దర్శకుడు సాయి రాజేశ్ మ్యాజిక్ డైరెక్టర్ విజయ్ తో కలసి ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. "బేబీ మూవీ చివరి రీల్ బ్యాగ్రౌండ్ మ్యాజిక్ ఇప్పుడే పూర్తయింది. నా ప్రియమైన విజయ్ బుల్గానిన్ ని ఒక సెల్ఫీ అడిగాను. BGM నన్ను ఏడిపించింది… 2 నెలల నుండి ప్రతిరోజూ మ్యాగ్జిమమ్ 4 గంటలు మాత్రమే నిద్రపోయాం... బేబీ మూవీ కోసం మేమిద్దరం దాదాపు 3 సంవత్సరాలుగా కలసి పనిచేస్తున్నాం. 100ల ట్యూన్లపై వర్క్ చేశాడు, మిక్సింగ్ అండ్ మాస్టరింగ్లో 100ల గంటలు గడిపాడు… బీజీయం మీద అయితే 2 నెలలుగా మానసిక సంఘర్షణకు గురయ్యాడు... ఫైనల్ గా దాన్ని ఛేదించాడు" అని సాయి రాజేశ్ పేర్కొన్నారు.
"బేబీ మూవీకి విజయ్ బుల్గానిన్ మొదటి హీరో… అతను ఒక మ్యూజికల్ జీనియస్. నేను గర్వంగా చెప్పగలను, అతని పాటలు యూట్యూబ్ లో పాపులర్ కావడానికి ముందే నేను అతన్ని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నాను. మరో 2 పాటలు మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాయి. విజయ్...లవ్ యూ... థాంక్స్ ఫర్ ఎవరీథింగ్" అని సాయి రాజేశ్ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు. రోజుకి 4 గంటల నిద్రతో ఎలా చేశారు? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఊహించని రిలీజ్ కావడం, ప్రీ పోన్ చేయటం వల్ల ఇంతలా కష్టపడాల్సి వచ్చిందని దర్శకుడు తెలిపారు. అలానే ట్రైలర్ లో మెయిన్ స్టోరీ రివీల్ చెయ్యలేదని అన్నాడు.
Also Read: సమంత మైయోసిటిస్ ట్రీట్‌మెంట్ కోసం అన్ని కోట్లు ఖర్చు చేయనుందా?
ఇకపోతే సాయి రాజేశ్ మొదటి నుంచీ ఒక మంచి సినిమా తీశానని కచ్చితంగా చెప్పగలనని, నిర్మాత తనపై ఉంచిన నమ్మకంతోనే ఇది సాధ్యమైందని చెబుతూ వస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ కి మారుతి తరహా ఎంటర్టైన్మెంట్ జోడిస్తూ ఈ కథ రెడీ చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. తమిళనాడులో జరిగిన ఓ వాస్తవ సంఘటన స్ఫూర్తితో ‘బేబి’ చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన 'బేబీ' ట్రైలర్ ని బట్టి, యూత్ ఫుల్ కంటెంట్ తో తెరకెక్కిన న్యూ ఏజ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. ఇందులో ఇన్నోసెంట్ ఆటో డ్రైవర్ గా ఆనంద్ దేవరకొండ, కాలేజ్ స్టూడెంట్ గా విరాజ్ అశ్విన్ నటించారు. డీగ్లామర్ విలేజ్ గర్ల్ గా, మోడరన్ అమ్మాయిగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో వైష్ణవి చైతన్య కనిపించింది. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్.కె.ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎమ్ ఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. విప్లవ్ ఎడిటింగ్ వర్క్ చేసారు.
కాగా, 'హృదయ కాలేయం' సినిమాతో స్టీవెన్ శంకర్ అనే స్క్రీన్ నేమ్ తో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు నీలం సాయి రాజేశ్. ఆ తర్వాత 'కొబ్బరి మట్ట' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇదేక్రమంలో 'కలర్ ఫోటో' వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రాయడమే కాదు, నిర్మాణంలోనూ భాగం పంచుకొని నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నాడు. మరి ఇప్పుడు 'బేబీ' మూవీతో ఎలాంటి విజయాన్ని సాధిస్తారో చూడాలి.
Also Read: మహేష్ బాబుకు మూడు నెలల ట్రైనింగ్ - రాజమౌళి సినిమా అంటే ఆమాత్రం ఉండాలిగా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial