షారుక్ 'జవాన్' పై దిల్ రాజు భారీ పెట్టుబడి?
అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'జవాన్' మూవీ తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 'పఠాన్' సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 'పఠాన్' సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న షారుక్ త్వరలోనే 'జవాన్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మరో రెండు నెలల్లో విడుదలకు ముస్తాబవుతోంది. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన తమిళ స్టార్ హీరోయిన్ నయనతార కథానాయికగా నటిస్తోంది. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా 'జవాన్' నాన్ థియెట్రికల్ రైట్స్ ఏకంగా రూ.250 కోట్లకు అమ్ముడైనట్లు ఇప్పటికే వార్తలు రావడం జరిగింది. బాలీవుడ్ లోనే ఇది హైయెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.
అయితే తాజాగా 'జవాన్' తెలుగు మూవీ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేశారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఇప్పటికే భారీ డీల్ కు ఒప్పందం కుదుర్చుకున్నారట. సాధారణంగా దిల్ రాజు ఓ సినిమా రైట్స్ ని కొనుగోలు చేస్తున్నారంటే ఎన్నో అంచనాలు వేసి ఆ సినిమాను కొనుగోలు చేస్తారు. అయితే ఇంతవరకు షారుక్ ఖాన్ కి మన తెలుగులో పెద్దగా సక్సెస్ ఏమీ లేదు. కానీ దిల్ రాజు మాత్రం షారుక్ 'జవాన్' తెలుగు రైట్స్ ని కొనుగోలు చేయడం ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది. ఇందుకు కారణం దర్శకుడు అట్లీ అని చెబుతున్నారు. అట్లీ మీద నమ్మకంతోనే తెలివిగా దిల్ రాజు 'జవాన్' మూవీ తెలుగు రైట్స్ ని భారీ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కోలీవుడ్లో అట్లీ తెరకెక్కించిన సినిమాలు కమర్షియల్ గా భారీ సక్సెస్ అందుకున్నాయి.
ఈ ఒక్క కారణం తోనే దిల్ రాజు 'జవాన్' తెలుగు రైట్స్ ని కొనుగోలు చేశారట. ఏది ఏమైనా దిల్ రాజు మాత్రం 'జవాన్' తెలుగు రైట్స్ కొనుగోలు చేసి రిస్కు చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన 'శాకుంతలం' ఆయనకి భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆ నష్టం నుంచి ఇప్పటికీ ఆయన కోలుకోలేదు. 'శాకుంతలం' ఎఫెక్ట్ తోనే రీసెంట్గా 'ఆదిపురుష్' తెలుగు రైట్స్ ని దిల్ రాజు కొనలేదు. అలాంటిది తాజాగా భారీ ధరకు దిల్ రాజు కొనుగోలు చేసిన 'జవాన్' రేపు రిలీజ్ తర్వాత కాస్త అటు ఇటు అయితే భారీ నష్టాలు తప్పవని చెప్పొచ్చు. ఇక 'జవాన్' సినిమాని హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయబోతుండగా.. ఈ సినిమా తమిళ వెర్షన్ ని రెడ్ జాయింట్ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 'పఠాన్' వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత షారుక్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి త్వరలోనే ట్రైలర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 12న 'జవాన్' ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read : 'మొదటి ప్రేమకు మరణం లేదు' - హార్ట్ టచ్చింగ్ ఎమోషనల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'బేబీ'
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial